కలెక్టర్ ఆమ్రపాలి,..ఉద్యోగం,..అబద్దం..!!

          మారుతున్న సామాజిక, ఆర్ధిక‌ ప‌రిస్థితులు ఇప్పుడు మ‌న‌ జీవితాల‌ను శాసిస్తున్నాయి. విలువ‌ల‌ను  కాపాడుకుంటూ , వ్య‌క్తిత్వాన్ని నిలుపుకుంటూ జీవించ‌డ‌మ‌న్న‌ది క‌ష్ట‌సాధ్యంగా మారుతోంది. అవ‌స‌రాల కోసం అడ్డ‌దారులు తొక్కుతూ, అబద్దాల‌తో న‌టిస్తూ జీవితాన్ని న‌డిపిస్తున్న‌వారు ఎక్కువైపోయారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో స్వ‌ల్ప‌కాలిక లాభం కోసం చాలా మంది విద్యార్దులు, ఉద్యోగులు అబ‌ద్దాన్నే న‌మ్ముకుంటున్నారు. అర్హ‌త‌ల ద‌గ్గ‌ర్నుంచి, నైపుణ్యం వ‌ర‌కూ ప్ర‌తీదాంట్లోనూ అబద్దాలు చెపుతూ కెరీర్ లో దూసుకుపోతున్నాం అనుకుంటున్నారు. అబ‌ద్దం ఆయుష్షు చాలా చిన్న‌ద‌ని, ఒక్కసారి అబ‌ద్దం ఆడితే దాన్ని క‌ప్పిపుచ్చేందుకు వాటిని కొన‌సాగిస్తూనే ఉండాల‌ని తెలుసుకోలేక‌పోతున్నారు.ఆ మధ్య కలెక్టర్ ఆమ్రపాలి ఉద్యోగం కోసం అబద్దం చెప్పినా ఫర్వాలేదంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ చిట్కాలు స్వల్పకాలానికి పనికొస్తాయేమో కానీ దీర్ఘకాలానికి ఏమాత్రం కాదు.  దీనికి తోడు అబద్దాలు చెప్పేవారికి జ్ఞాప‌క‌శ‌క్తి ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే చెప్పిన అబద్దాన్ని గుర్తుపెట్టుకుని కొనసాగించాలి కదా..?  కెరీర్ లో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరాల‌న్నా, మంచి వ్యక్తిగా గౌర‌వం పొందాల‌న్నా వ్య‌క్తిత్వాన్ని నిలుపుకోవ‌డం చాలా ముఖ్యం. విలువ‌ల‌తో కూడా మీ న‌డ‌వ‌డిక‌ను బ‌ట్టి మాత్ర‌మే మీ కెరీర్ జీవిత కాలం నిర్ణ‌యించబ‌డుతుంది. స్వ‌ల్ప‌కాలిక లాభాల కోసం అబ‌ద్దాలు ఆడుకుంటూ పోతే కెరీర్ కూడా స్వ‌ల్ప‌కాలానికే ప‌రిమిత‌మ‌వుతుంది. అబ‌ద్దాన్ని చెపితే మొద‌ట సుఖ‌ప‌డ‌వ‌చ్చేమో కానీ త‌ర్వాత క‌ష్ట‌ప‌డ‌తారు. ఈ చిన్న విష‌యాన్ని విద్యార్ధులు గుర్తిస్తే కెరీర్ స‌రైన దిశ‌లో సాగుతుంది.


'అబ‌ద్దం' మీ విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీస్తుంది!

     ఉద్యోగం కోసం అబద్దం చెప్పినా ఫర్వాలేదని కలెక్టర్ గారు ఏ ఉద్దేశంతో చెప్పారో తెలియదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అబద్దం అనేది కెరీర్ కు ప్రతిబంధకంగా మారుతుంది. చిన్న‌ప్ప‌టి నుంచి అబద్దం అనేది మ‌నకు తెలీకుండా మ‌నలో దూరిపోయేందుకు ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటుంది.అబ‌ద్దం చెప్ప‌కుండా ఉండ‌టం అన్న‌ది క‌ష్ట‌మైన విష‌య‌మైనా దాన్ని పూర్తిగా వ‌దిలించుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. ఎందుకంటే అబ‌ద్దం అనేది మీ విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీస్తుంది. కొన్నిసార్లు అబ‌ద్దాల వ‌ల‌న మీరు  సంక్షోభాన్ని దాటవ‌చ్చు. లేదా ఏదైనా ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు. అయితే ఇవ‌న్నీ తాత్కాలిక‌మైన విష‌యాలు మాత్ర‌మే. దీర్ఘ‌కాలంలో అబ‌ద్దాలు మీకు న‌ష్టాన్ని త‌ప్ప లాభాన్ని క‌లిగించ‌వు. పైపైచ్చు మీకు మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను దూరం చేస్తాయి. ప్ర‌స్తుతం చాలా మంది విద్యార్ధులు రెజ్యుమెలో అబ‌ద్దాల‌ను చెప్పి , అనుభ‌వానికి సంబంధించి త‌ప్పుడు ప‌త్రాలు జ‌త చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ధ‌తి కాదు. కంపెనీలు ఇప్పుడు ఫేక్ ఎక్స్ పీరియ‌న్స్ లు స‌మ‌ర్పించిన అభ్య‌ర్ధుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. సంస్థ అంత‌ర్గ‌త ఎంక్వైరీ లో మీరు తప్పు చేసిన‌ట్టు తేలితే మీ క్రెడిబిలిటీ దారుణంగా దెబ్బ‌తింటుంది. దీంతో పాటు మీరు చెప్పిన  అబ‌ద్దానికి మీరు ప్ర‌తిరోజూ మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ను అనుభ‌వించాల్సి ఉంటుంది. అదే విధంగా ఇంటర్వ్యూలో మీరు అబద్దాలు చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు అది ముఖంలో కనిపించిపోతుంది. మీకు తెలీకుండానే మీరు ఒత్తిడికి గురవుతారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఇంటర్వ్యూలో, అయినా తర్వాత ఉద్యోగంలో అయినా నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి. మీలో లేని అర్హతలు సంపాదించుకుంటే వస్తాయి కానీ అబద్దాల ద్వారా మాత్రం కాదని గుర్తించండి.


అశ్వ‌త్థామ హ‌తః కుంజ‌ర‌హః !

     మహాభారతంలో ధర్మరాజు అంతటి వాడే 'అశ్వత్థామ హత‌: కుంజరహ:' అంటూ అబద్దం చెప్పాడని, మనం చెప్తే తప్పేంటి అని సమర్ధింపు ధోరణిని చాలా మంది అలవర్చుకుంటారు. ఇటువంటి సమర్ధింపులు వాళ్లకు ఎటువంటి మేలు చేయవు. ముఖ్యంగా కెరీర్ విషయంలో అబద్ధాలు అస్సలు ఫలితాన్ని ఇవ్వవు. ప్రస్తుతం హెచ్ఆర్ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అభ్యర్ధులు అబద్ధం చెప్పి ఉద్యోగాన్ని సాధిస్తే , విచారణ చేసి వారిని వెంటనే తొలిగించే వ్యవస్థ ఇప్పుడు కంపెనీల్లో ఉంది. అదే విధంగా ఆఫీస్ వాతావరణంలో అబద్దాలను ప్రచారం చేయడం, చాడీలు చెప్పడం. ఇంకొకరి ఇమేజ్ ను దెబ్బతీయడం వంటి పనులు మీ కెరీర్ జీవితకాలాన్ని తగ్గిస్తాయి. అబద్దం అంటే నెగెటివ్ ...నెగెటివ్ కు ఉండే శక్తి అపారమైనది. దానిని అడ్డగించడం అంత సులభమైన విష‍యం కాదు. అందుకే అబద్దాని వెయ్యి మంది పిల్లలు అనే మాట ప్రచారంలో ఉంది. అబద్దం చాలా వేగంగా ప్రచారం అయిపోతుంది. ఈ విషయాన్ని గుర్తించి అబద్దాలను ప్రచారం చేయకుండా వీలైనంతగా నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాల్లో అబద్దం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆ స్థితిని అంచనా వేసి ఆ అబద్దం చెప్పడం ఎవరికీ ఎటువంటి కీడు జరగదని, కొన్ని విషయాల్లో మేలు జరుగుతుంది అనుకుంటే చిన్న అబద్ధం ఆటడం తప్పేం కాదు. కానీ ఇందులో మీ విచక్షణను పూర్తి స్థాయిలో ఉపయోగించాలి.


అసలు అబద్దాలు ఎందుకు చెపుతారో తెలుసా?

  • చేసిన త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు  22 శాతం మంది అబ‌ద్దాలు ఆడ‌తారు.
  • ఆర్థికంగా లాభాన్ని, ప్ర‌యోజ‌నాన్ని పొందేందుకు 16 శాతం మంది. 
  • క‌ష్ట‌మైన ప‌రిస్థితిని అధిగ‌మించేందుకు లేదా త‌ప్పించుకునేందుకు 14 శాతం మంది
  • వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నం పొందేందుకు 15 శాతం మంది
  • సొంత ఇమేజ్ ను పెంచుకునేందుకు 8 శాతం మంది
  • త‌న చుట్టూ ఉన్న జ‌నాల్ని నవ్వించేందుకు 5 శాతం మంది
  • వేరే వ్య‌క్తుల‌కు స‌హాయం చేసేందుకు 5 శాతం మంది
  • ఇత‌రుల‌ను బాధ‌పెట్ట‌డానికి 4 శాతం మంది


విశ్వసనీయత, నిజాయితీయే మీ ఆయుధాలు!

    సూపర్ స్టార్ రజనీకాంత్ పాపులర్ డైలాగ్ గుర్తుంది కదా...'మంచి ముందు కష్టపడొచ్చు...కానీ తర్వాత గెలుస్తాడు. చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు..కానీ తర్వాత ఓడిపోతాడు'. ఈ మాటలను విద్యార్ధులు తమ జీవితానికి , కెరీర్ కు అన్వయించుకోవాలి. అబద్దం అనేది మీకు అప్పటికప్పుడు ప్రయోజనాన్ని చేకూర్చవచ్చేమో కానీ దీర్ఘకాలంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తుంది. నిజాన్ని దాచిపెట్టకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం వలన మీకు ప్రారంభంలో స్వల్ప నష్టాలు కలగొచ్చునేమో కానీ దీర్ఘకాలంలో అవే మీకు అదనపు అర్హతలు అవుతాయి. ప్రస్తుతం కంపెనీలు నైపుణ‌్యంతో పాటు నిజాయితీ, విశ్వసనీయత ఉన్నవారికే ప్రాధాన్యత నిస్తున్నాయి. కాబట్టి నైపుణ‌్యంతో ఈ రెండు విషయాలను కూడా పెంచుకునేందుకు ప్రయత్నం చేయండి. మీరు తర్వాత ఉద్యోగంలో కొనసాగినా, స్టార్టప్ పెట్టి ఎంట్రెపెన్యూర్ గా మారినా, వ్యక్తిగత జీవితంలో మంచి పౌరునిగా ఎదగాలన్నా ఇది ముఖ్య విష‍యం.


ఈ ఫీచ‌ర్ పై  గైడెన్స్ కావాల్సిన వారు  క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరచ్చు.
97006 09135



                           You can send your Educational related articles to  careertimes.online1@gmail.com




Comments

Popular posts from this blog

అదృష్టాన్ని జేబులో పెట్టుకు తిరగడం ఎలా?

24.."టైం మిష‌న్"..!

ఈ 'కెరీర్' తో కంపెనీకి, మీడియాకు మధ్య వారధి మీరే కావచ్చు!!