ప్రతీ ఉద్యోగి అతిగా ఆలోచించేది దాని కోసమే!!
ఒక సంస్థ దీర్ఘకాలం మనుగడ సాగించాలంటే దాని పునాదుల్లో కొన్ని బలమైన ముడి పదార్ధాలు ఉండాలి. పని సంస్కృతికి తోడు ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం, ఉన్నతమైన లక్ష్యం ఉన్నప్పుడు దాని ఎదుగుదల సుదీర్ఘకాలం కొనసాగుతుంది. కొత్తగా స్టార్టప్స్ పెట్టి ఎంటర్‌ప్రెన్యూర్స్ గా రాణించాలనుకునే వాళ్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఈ అనిశ్చిత ప్రపంచంలో మంచి మీ సంస్థ మంచి ఫలితాలను సాధించాలంటే, కొన్ని విలువలతో కూడిన పునాదులను బలంగా నిర్మించుకోవాలి. సిబ్బందిలో అనుక్షణం స్పూర్తిని రగిలిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో వాళ్లకు తపన రగిలించాలి. ఈ క్రమంలో వాళ్లకు సంపూర్ణమైన బాధ్యతతో కూడిన స్వేచ్ఛను అందించడం చాలా ముఖ్యం. ఈ సంస్థ నాది, నా పై నమ్మకం ఉంచి ఈ పనిని అప్పగించారు. దీన్ని పూర్తి సామర్ధ్యంతో పూర్తిచేస్తాను అని ఉద్యోగులు అనుకున్నప్పుడు ఆ సంస్థ దీర్ఘకాలం మనుగడ సాగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
సంస్థ స్ఫూర్తిని ప్రతిబింబింపజేయాలి!
సంస్థ స్ఫూర్తిని ప్రతిబింబింపజేయాలి!
ఒక పిల్లవాడికి ఇంట్లో తల్లిదండ్రులే ప్రథమ గురువులు. వాళ్లు ఏం చేస్తున్నారు? ఎలా వ్యవహరిస్తున్నారన్నది చూసి పిల్లలు కూడా ఆ విధంగా చేసేందుకు ప్రయత్నిస్తారు. ఒక సంస్థలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఉద్యోగులు కూడా తమ పై అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నారన్నది నిశితంగా గమనిస్తూ ఉంటారు. అందుకే సంస్థ ఉన్నతాధికారులు ఎప్పుడూ తమ కింద ఉద్యోగులకు స్పూర్తిదాయకంగా ఉండాలి. ఒక సమస్యను పరిష్కరించడం, అందుకు అనుగుణంగా వేగంగా స్పందించడం వంటి లక్షణాలు ఉద్యోగుల్లో మంచి లక్షణాలను మేల్కోనేలా చేస్తాయి. రిస్క్ ను హ్యాండిల్ చేసే విధానం, తప్పులను పట్టుకు వేలాడకుండా వాటిని అక్కడే వదిలేసి ముందుకు వెళ్లిపోవడం వంటి విషయాలను పై స్థాయి అధికారులు సమర్ధవంతంగా నిర్వహించాలి. ఇది కింది స్థాయి ఉద్యోగులకు స్పూర్తి మంత్రాలుగా నిలుస్తాయి. అదే విధంగా విలువలను కాపాడటంలో రాజీలేని గుణం, కంపెనీని ఒక కుటుంబంలా భావించి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒకే విధంగా స్పందించడం కూడా కంపెనీని దీర్ఘకాలం నిలబెట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ఉత్పాదకతను సాధించే కిటుకు తెలియాలి!
చాలా మంది మంచి నైపుణ్యం ఉన్నవాళ్లను నియమించుకుంటే చాలా ఉత్పాదకతను సాధించవచ్చని ఆశిస్తూ ఉంటారు. అయితే ఈ పద్ధతి పూర్తి ఫలితాలను ఇవ్వదు. నియమించుకోగానే ఒక ఉద్యోగికి సంస్థపై పూర్తిగా నమ్మకం కుదరదు.సంతృప్తి లభించదు. ఆ పని వాతావరణంలో తాము భద్రంగా ఉన్నామన్న భావన కలిగితే కానీ వాళ్లూ పూర్తి స్థాయిలో ఉత్పాదకతను సాధించలేరు. ఉద్యోగులకు ఆ నమ్మకం, భద్రతను కల్పించేందుకు సంస్థ ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. దీర్ఘకాలం మనుగడ సాగించాలని ఆశించే ఏ కంపెనీ అయినా ముందు ఉద్యోగులకు నమ్మకం, భద్రతను కల్పించాల్సి ఉంటుంది. అప్పుడు ఉత్పాదకత అనేది దానంతట అదే సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగులు తమ ఆర్థిక స్థితిపై అభద్రతకు గురవుతూ ఉంటారు. ఇంట్లో నెరవేర్చాల్సిన బాధ్యతలు తను చూసుకోవాల్సిన వ్యక్తుల ఆరోగ్యం కోసం అదుర్దా చెందుతారు. ఇటువంటి సమయంలో ఉద్యోగులకు మంచి పని వేళలు, ఆరోగ్య బీమా వంటివి కల్పిస్తే వాళ్లు ఎటువంటి భయం, ఆదుర్దా లేకుండా ఉల్లాసంగా పనిచేయగలుగుతారు. ఇటువంటి చర్యలు కంపెనీ ఉత్పాదకతను ఆటోమేటిక్ గా పెంచుతాయి.
వ్యక్తిగతంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలి!
ప్రతీ ఉద్యోగికి కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. ఒక్కో వ్యక్తిపై ఒక్కో రకమైన పరిస్థితుల ప్రభావం ఉంటుంది. దానికి అనుగుణంగానే అతని పనితీరు ఆధారపడి ఉంటుంది. అదే విధంగా అని అభిరుచులు, ఆకాంక్షలు కూడా అతని వర్క్ ను ప్రభావితం చేస్తాయి. ఈ విషయాలన్నింటినీ సంస్థ గుర్తించాలి. ఉద్యోగుల బలాలు, అభిరుచులు, ఆకాంక్షల ఆధారంగా వారికి పనిని అసైన్ చేయాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఉత్పాదకత పెరుగుతుంది. కొత్తగా స్టార్టప్ పెట్టాలనుకునే ఔత్సాహికులు ఉద్యోగులకు సంబంధించిన ఈ విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రతీ క్షణం వేధించి, సాధిస్తే స్వల్ప కాలానికి మంచి ఫలితాలు రావచ్చేమో కానీ దీర్ఘకాలంలో మాత్రం నష్టం తప్పదు. ముఖ్యంగా ఉద్యోగులు సంస్థను ప్రేమించి, దాని ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించాల్సిందే అనుకునేలా వాళ్లను మలుచుకోవాలి. ఈ చిన్న కిటుకు తెలుసుకుంటే ఏ సంస్థ అయినా సుధీర్ఘకాలం పాటు మనుగడ సాగించగలుగుతుంది. అదే తీరుగా మంచి ఉత్పాదకతను సాధించి లాభాల బాట పడుతుంది.
ఆకాంక్ష వెనుక బలమైన ప్రణాళిక ఉండాలి!
సుదీర్ఘకాలంగా అదే రకమైన నాణ్యతను కొనసాగిస్తూ మనుగడ సాగిస్తున్న సంస్థలను మనం చూస్తూ ఉంటాం. వాళ్ల విజయానికి కారణమైన అంశాలను పరిశీలిస్తే ఉద్యోగులపై, పని వాతావరణంపై వాళ్లకున్న ముందుచూపు, లక్ష్యం మనకు స్పష్టంగా అర్ధమవుతుంది. వాళ్లకు రాత్రికి రాత్రి విజయం తలుపు తట్టలేదు. అపజయాలను మెట్లుగా మలుచుకుంటూ, విలువలను విడిచిపెట్టకుండా, ఒక ఉన్నతమైన గమ్యం కోసం వాళ్లు చేస్తున్న ప్రయత్నాలను యువతరం పాఠాలుగా స్వీకరించాలి. ఆ పాఠాలను స్వీకరించి విజయవంతంగా అమలు చేసినప్పుడు ఎంత చిన్న సంస్థ అయినా భవిష్యత్ లో గొప్ప సంస్థగా ఎదగడం ఖాయం. కొత్త సంస్థను ప్రారంభించాలనుకునే వాళ్లకు, ఇప్పటికే సంస్థను నడుపుతున్న వాళ్లకు ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు పుస్తకంలో ముందుమాటలా మంచి పరిచయాన్ని కలిగిస్తాయి. ముందుమాటను ఇప్పటికే చదివేసారు కాబట్టి ఇక పుస్తకంలో విషయాన్ని ఆకలింపు చేసుకుని విజయానికి బాటలు వేసుకోండి.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135




Comments
Post a Comment