ఇంటర్వ్యూలో 'ఏబీసీడీఈ' లను సరిగ్గా చెపితే చాలు ఉద్యోగం గ్యారంటీ!!
ఇంటర్వ్యూ అనేది వంద మంది పార్టిసిపేట్ చేసే పరుగు పందెం లాంటిది. ఆ పోటీలో కేవలం ముగ్గురు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. 99 మందిని దాటి విజయాన్ని అందుకోవడం సులువైన విషయం ఏం కాదు. పోటీలో గెలవాలంటే ఎంత శ్రమ పడాలి? ఎంత సామర్ధ్యం ఉండాలి? ఎంత నైపుణ్యం ఉండాలి? అన్న విషయాలపై పూర్తిగా పట్టు సాధిస్తేనే విజయం సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలంటే షార్ట్ కట్స్ ఉండవు. షార్ప్ కట్స్ మాత్రమే ఉంటాయి. ఇంటర్వ్యూలో ఎంప్లాయర్ అడిగే ప్రశ్నలకు ఎంత షార్ప్ గా సమాధానం చెప్పడంతో పాటు విషయాన్ని క్లుప్తంగా కట్ చేసి ఎవరు చెప్పగలుగుతారో వారే విజేతలుగా నిలుస్తారు. అన్నింటికన్నా ఆశావహ దృక్పధంతో, ఆత్మ విశ్వాసంతో సమాధానాలు చెప్పేవారినే హెచ్ఆర్ మేనేజర్లు ఎంపిక చేసుకుంటారు. ఇంటర్వ్యూలో విజయం సాధించడం ఎలా? అన్నదానిపై ఎందరో ఎన్నో రకాలుగా చెప్తారు. అందులో కొన్ని విషయాలు విజయానికి ఉపయోగపడతాయి కూడా. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలో విజయానికి ఖచ్చితంగా ఉపయోగపడే 5 ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. షార్ట్ ఫామ్ లో ఏబీసీడీఈ లుగా పిలిచే ఈ ఐదు స్కిల్స్ ను సరిగ్గా ప్రదర్శించగలిగితే ఇంటర్వ్యూలో మీరు విజయం సాధించడం తథ్యం.
1. ఏ - ఆటిట్యూడ్ ఆఫ్ పాజిటివిటీ
సానుకూల ఆలోచనలు మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. ఇంటర్వ్యూలో కూడా పాజిటివ్ థింకింగ్ అనేది మిమ్మల్ని పోటీలో ముందు వరుసలో నిలబెడుతుంది. అంతా మంచే జరుగుతుంది అని అనుకున్నప్పుడు కచ్చితంగా మీకు మంచి జరిగే తీరుతుంది. మనం వెళ్లే దారిలో ఎన్ని అడ్డంకులు ఉంటాయి. వాటన్నింటిని అధిగమించుకుంటూ సానుకూల ఆలోచనలు చేసినప్పుడు మాత్రం విజయం దరికి చేరుతుంది. ఏదైనా ఒక విషయాన్ని మీరు బలంగా కోరుకున్నప్పుడు అది కచ్చితంగా నెరవేరుతుంది. దానికి ప్రకృతి కూడా సహాయం చేస్తుంది. (పాజిటివ్ థింకింగ్ పై 'కెరీర్ టైమ్స్' ప్రత్యేక ఆర్టికల్ గట్టిగా అనుకో..అయిపోద్ది! కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మంచి వ్యక్తిత్త వికాస పుస్తకాలు, ప్రముఖుల ఆత్మకథలను చదవడం ద్వారా పాజిటివ్ థింకింగ్ ను పెంచుకోవచ్చు. పాజిటివ్ ఆటిట్యూడ్ అనేది ఇంటర్వ్యూలో మీకు ఉండాల్సిన మొదటి స్కిల్.
2. బీ - బుకిష్ నో హౌ
ఇంటర్వ్యూలో మీరు విజయం సాధించాలంటే మీ సబ్జెక్ట్ పై మీకు పూర్తి స్థాయిలో పట్టు ఉండాలి. పుస్తకాలు బాగా చదవడం ద్వారానే మీకు సబ్జెక్ట్ పై పట్టు వస్తుంది. ఎంప్లాయర్ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పగలిగేలా ప్రిపేర్ కావాలి. మీ సబ్జెక్ట్ బుక్స్ బాగా చదవడంతో పాటు అందులో లేని విషయాలను లైబ్రరీకి వెళ్లి ఇతర పుస్తకాల్లో పరిశీలించాలి. అప్పటికీ తెలియని విషయాలను మీరు ఎంచుకున్న రంగంలో అప్పటికే పనిచేస్తున్న అనుభవజ్ఞులను కలిసి తెలుసుకోవాలి. మీరు ఏదైతే రంగంలోకి వెళ్లాలనుకుంటున్నారో ఆ రంగంపై పూర్తి పట్టు సాధించేందుకు ప్రతీక్షణం ప్రయత్నించాలి. దీనికి మీకు పుస్తకాలు బాగా సహాయపడతాయి.
3. సీ - కాంపిటెన్సీస్
ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే మీకు మంచి నైపుణ్యం ఉంటే సరిపోదు. వాటిని సరైన సమయంలో సరైన విధంగా ప్రదర్శించే నేర్పు కావాల్సి వస్తుంది. ఎంప్లాయర్ ఎదుట మీ స్కిల్ ను సరిగ్గా ప్రదర్శించేందుకు చిన్న చిన్న టెక్నిక్స్ అవసరం పడుతుంది. ముఖ్యంగా తెలిసిన సమాధానాలను ఆత్మవిశ్వాసంతో చెప్పేందుకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆలాంటి టెక్నిక్స్ ను నేర్చుకుంటే పోటీలో విజయం సాధించగలుగుతారు. ఇందుకోసం ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పే విధంగా టెక్నిక్ ను మెరుగుపర్చుకోవాలి.
4. డీ - డ్రీమ్
కలలు కనండి. వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలామ్ విద్యార్ధులకు ప్రతీ వేదికపై ఉద్భోధించిన అద్భుతమైన మాట ఇది. ఆ మాటను అందరూ ఆచరిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఇంటర్వ్యూలో కూడా మీకు ఇదే ప్రశ్న ఎదురవుతుంది. ఐదేళ్ల తర్వాత మీరు ఏ పొజిషన్ లో ఉండాలనుకుంటున్నారో కల కనండి. దాన్ని సాకారం చేసుకునేందుకు ఒక ప్లాన్ ను తయారు చేసుకోండి. ఇంటర్వ్యూలో మీ డ్రీమ్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైనప్పుడు మీ కలను వివరించి చెప్పండి. ఎందుకంటే కలలు కనేవారే వాటిని నిజం చేసుకునేందుకు కష్టించి పనిచేస్తారు. అయితే కలలను నిజం చేసుకునేందుకు ప్లానింగ్ తో పాటు నమ్మకం కూడా ఉండాల్సిందే. మీ లో ఈ క్వాలిటీ ఉందని గుర్తిస్తే ఇంటర్వ్యూలో మీకు మొదటి ప్రాధాన్యత నిస్తారు.
5. ఇ - ఎక్స్‌ప్రెస్
తనకు తెలిసిన విషయాన్ని సరైన పద్ధతిలో అవతలి వ్యక్తికి వివరించి, ప్రభావంతంగా చెప్పగలగడం ప్రతీ విద్యార్ధికి, ఉద్యోగికి కావాల్సిన మరో అతి ముఖ్యమైన స్కిల్. ముఖ్యంగా ఇంటర్వ్యూలో ఇది చాలా ముఖ్యం కూడా. కమ్యూనికేషన్ ఆధారంగానే ఇంటర్వ్యూలో మీ విజయం ఆధారపడి ఉంటుంది. చాలా మందికి సబ్జెక్ట్ పై చాలా పట్టు ఉంటుంది. కానీ సరైన విధంగా ప్రజంట్ చేయలేకపోతారు. దీని వలన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. ఆత్మ విశ్వాసం కోల్పోవడం అంటే ఇంటర్వ్యూలో ఫెయిల్ కావడమే. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని ఇంటర్వ్యూ చేసేవాళ్లకు సూటిగా చెప్పగలగాలి. ఇలా చెప్పడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఏబీసీడీఈ లను సరిగ్గా నేర్చుకుంటే ఆత్మవిశ్వాసం మీ సొంతమవుతుంది. ఆత్మవిశ్వాసం ఉంటే ఇంటర్వ్యూలో అయినా మరెక్కడైనా విజయం మీదే.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com






Comments
Post a Comment