పూరీ..ఇప్పుడు నీ హీరో ఎవరు??
గడిచిన వారం రోజులుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా డ్రగ్స్ గురించే చర్చ. డ్రగ్స్ ఇష్యూతో లింక్స్ ఉన్నాయంటూ సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు జారీ చేయడం, సిట్ విచారణ అనేవి ఇప్పుడు మీడియాలో ప్రధాన వార్తలు. అన్నింటికంటే ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ డ్రగ్స్ ఇష్యూలో బాగా ఫోకస్ అయ్యారు. ఆయన నిజంగా డ్రగ్స్ వాడారా? లేదా? అన్నది విచారణలో తేలుతుంది. కానీ ఎన్నో అడ్డంకులను దాటుకుని ఈ స్థాయికి వచ్చిన పూరీ జగన్నాథ్ ఈ సమస్య నుంచి గట్టెక్కి, తనను తాను మళ్లీ ఎలా నిరూపించుకుంటాడన్నదే అసలైన ఛాలెంజ్. సమస్య మనిషిలోని నిజమైన సత్తాను బయటకు తీస్తుంది. పూరీ లో అటువంటి నిఖార్సైన సత్తా ఉంటే ఈ సంక్షోభం నుంచి బయటపడి మళ్లీ స్టార్ డైరెక్టర్ గా ఎదగగలడు. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు, పరిస్థితుల నుంచే విద్యార్ధులు ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమైన పాఠాలను గ్రహించాలని 'కెరీర్ టైమ్స్' చెపుతూ వస్తోంది. ఇప్పుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఉదంతం నుంచి కూడా తగిన పాఠాలు నేర్చుకుని తమ బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాల్సి ఉంది.
మనం పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాలను చూస్తే అందులో హీరోలు మన పక్కింట్లో ఉండే కుర్రాళ్లలా అనిపిస్తారు. అన్యాయాన్ని ఎదిరిస్తూ అదే సమయంలో ఊరికే నటించలేని ఒక విధమైన లెక్కలేని తనం హీరో పాత్రలో కనిపిస్తుంది. అయినా చివరికి హీరో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు. సంభాషణలు కూడా కృతకంగా కాకుండా చాలా సహజంగా ఉంటాయి. ఇవన్నీ మనం ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒక చిత్రకారుడ్ని తీసుకుంటే అతను గీసే చిత్రాల్లో అతని మనస్తత్వం, అభిరుచి ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగే ఒక కెమెరామెన్, గేయ రచయిత, దర్శకుడు ఎవరైనా తమలో అంతర్గతంగా దాగున్న ఆలోచనలను, అభిప్రాయాలను సినిమా అనే మీడియా ద్వారా చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో కూడా పూరీ పేరు బయటకు రావడానికి అతని సినిమాల్లో పాత్రలు ప్రవర్తించే తీరు, కొన్ని సన్నివేశాలు కూడా కారణం కావచ్చు. అయితే అతను తప్పు చేసినట్టు రుజువు కాలేదు కాబట్టి అతన్ని నిందించేందుకు ఎవరికీ హక్కు లేదు. కానీ ఎందరో డైరెక్టర్లు ఉండగా పూరీ పేరు రావడం వెనుక అతని స్వయంకృతాపరాధం ఉండొచ్చు. ఈ విషయాన్ని విద్యార్ధులు జాగ్రత్తగా గమనించాలి.అనవసరమైన విషయాల జోలికి వెళ్లకపోవడం మంచిది.
తెలుగు సినిమా రంగంలో అత్యంత వేగంగా సినిమాలు తీయగలిగే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పూరీ జగన్నాథ్ మాత్రమే. తక్కువ సమయంలో సినిమా తీసినా క్వాలిటీ మాత్రం ఎక్కడా తగ్గదు. కథా బలం లేకపోవడం ఇటీవలి కాలంలో అతని సినిమాలు అంతగా సక్సెస్ అయి ఉండకపోవచ్చు కానీ అందులో క్వాలిటీ లేక మాత్రం కాదు. ఈ డ్రగ్స్ ఇష్యూలో పూరీ అదఃపాతాళానికి దిగబడిపోయారని చాలా మంది భావిస్తుండవచ్చు. కానీ తనపై తాను నమ్మకం ఉంచి తన వేగం, పనితీరు తగ్గలేదని నిరూపించుకుంటే అతను ఈ సంక్షోభం నుంచి బయటపడటం కష్టమేమీ కాదు. ఇప్పటికే ప్రకటించినట్టుగా డ్రగ్స్ దాని పర్యవసానాలు ఇతివృత్తంగా సినిమా తీసి అందులో తన ఆవేదనను ప్రతిబింబించే హీరో తానే అయి నడిపిస్తే హిట్ రావడం ఖాయం. ఈ సినిమా ద్వారా తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తూనే అదే సమయంలో సమాజాన్ని పీడించే డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు వ్యక్తిని ఎంతలా దిగజార్చుతాయో వెల్లడిస్తే తన నిర్దోషిత్వాన్ని కూడా బయటపెట్టుకున్నట్టు అవుతుంది.
తప్పులు చేయడం మానవ సహజం. తెలిసి చేసిన తప్పు క్షమార్హం కాదు కానీ తెలీకుండా చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నించే వాడే జీవితంలో ఎదగగలడు. ఇప్పుడు చాలా మంది విద్యార్ధులు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరీక్ష పాస్ కాలేదని, మంచి మార్కులు రాలేదని ఉసురు తీసుకుంటున్నారు. చేసే పనిలో విజయవంతమవ్వాలని, త్వరగా పూర్తి చేయాలని ప్రతీ ఒక్కరికీ ఒత్తిడి ఉంటుంది. అది సినిమా డైరెక్టర్ కావచ్చు. చదువుకునే విద్యార్ధి కావచ్చు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు డ్రగ్స్ , మత్తు పదార్ధాలు అంటూ వక్ర మార్గం పట్టకుండా , దాన్ని వదిలించుకునేందుకు విభిన్న ప్రయత్నాలు చేయాలి. కుటుంబ సభ్యులతో గడపడం, పెంపుడు జంతువులతో ఆడుకోవడం, మనసుకు నచ్చిన పని చేయడం ఇవన్నీ ఒత్తిడిని తగ్గించే అద్భుత పరిష్కార మార్గాలే. కాస్త ఆచరిస్తే చాలా కుటుంబ అనుబంధాల్లో, అభిరుచుల్లో డ్రగ్స్ ను మించిన కిక్ ఉంటుంది. విద్యార్దులు ఒకసారి ఫెయిల్ అయినా నిరాశలో కూరుకుపోయి ఒత్తిడికి గురికాకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించడం కష్టమేమీ కాదు. ఓడిపోవడం తప్పు కానే కాదు దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నించకపోవడమే తప్పు.
సినిమా వాళ్లు డ్రగ్స్ వాడుతున్నారు? హైదరాబాద్ లో స్కూల్ స్టూడెంట్స్ డ్రగ్స్ వాడుతున్నారు? అంటూ వార్తలతో హోరెత్తిస్తున్నారు కానీ.ఈ పరిస్థితికి బాధ్యలు ఎవరు అన్నదానిపై ఎవరూ దృష్టిసారించడం లేదు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సినిమా హీరోలు అంటూ ఆధారాలు లేకుండా వాళ్లను దోషులను చేస్తున్నారు కానీ ఇందులో నిజమైన దోషులు ఎవరు అన్నది అందరూ గుర్తించాల్సి ఉంది. పిల్లలపై సరైన పర్యవేక్షణ లేని తల్లిదండ్రుల నుంచి డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నా కళ్లు తెరవని ప్రభుత్వాల వరకూ అందరికీ ఇందులో వాటా ఉంది. సాక్షాత్తూ ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తూ పైగా మందును ప్రమోట్ చేస్తూ ఉంటే యువతరానికి ఎటువంటి సంకేతాలు వెళ్తాయి. విద్యార్ధులు జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించి సమకాలీన విషయాల నుంచి తమ జీవన నైపుణ్యాలను నేర్చుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు సానుకూల మార్గాలను అన్వేషించాలి. అలాకాకుండ డ్రగ్స్ , మద్యం జోలికి వెళ్తే జీవితం దిగజారిపోతుంది, కెరీర్ చేజారిపోతుంది.
You can send your Educational related articles to careertimes.online1@gmail.com
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment