పెళ్లి నలభైలో..కెరీర్ కంపెనీలో..పిల్లలు ఫెర్టిలిటీ సెంటర్ లో..!!
మనిషి జీవితంలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. ప్రతీ దశ మనిషి కొత్త బాధ్యతలను నిర్వర్తించడానికి ఉద్దేశించబడి ఉంటుంది. ప్రకృతి నియమాల ప్రకారం ఆయా దశల్లో జరగాల్సిన మార్పులు నిర్దేశించిన సమయానికి పూర్తి కావాలి. అలా పూర్తి కాకుంటే ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించినందుకు అనుకున్న లక్ష్యాలు నెరవేరవు. మనం ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే..ఇటీవలి కాలంలో మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మనుష్యుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. గతంలో పెళ్లి చేసుకున్నాక కెరీర్ గురించి ఆలోచించే వారు కానీ ఇప్పుడు కెరీర్ లో కుదురుకున్నాకే పెళ్లి అంటున్నారు. ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి అనే ఆలోచన బాగానే ఉన్నా ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం వలన కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఏర్పడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఇబ్బందులు పెను సమస్యగా మారి మనిషి కెరీర్ ను, జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పెళ్లిని కెరీర్ ను సమన్వయం చేసుకునే విషయాలపై కెరీర్ టైమ్స్ విశ్లేషణ.
ప్రస్తుతం పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిపోయింది. మన పెద్దలు నిర్ణయించి పెట్టినట్టుగా పాతికేళ్లకే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా మారిన కొన్ని ఆర్థిక సంబంధ విషయాలు పాతికేళ్లకి పెళ్లి అన్న మాటను వెనక్కు నెడుతున్నాయి. పెద్దల మాటల చద్దన్నం మూట అన్నారు. పెద్దలు అటువంటి నిబంధన పెట్టారూ అంటే దానివెనుక ఒక బలమైన కారణం ఉందని అర్ధం. కానీ ఇప్పటి యువతరం పాతికేళ్లకు ఇంకా చదువు కొనసాగిస్తూనే లేక అప్పుడప్పుడే ఒక కెరీర్ ను స్థిరపర్చుకునే దశలోనే ఉంటున్నారు. అన్నీ కుదుర్చుకుని ఆర్థికంగా స్థిరపడాలంటే ఈరోజుల్లో యువకులకు ముఫ్ఫై ఏళ్లు దాటిపోతున్నాయి. మరోవైపు లింగ సమానత్వం , అవకాశాలు పెరగడంతో మహిళలు కూడా పెళ్లి చేసుకునే వయస్సు 30 దాటిపోతోంది. మరి సామాజిక మార్పులకు లోబడి 30 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలా? లేక పెద్దలు నిర్ణయించి పెట్టినట్టుగా 30 ఏళ్ల లోపే పెళ్లి చేసుకోవాలా? అన్నది మన యువతను వేధిస్తున్న ఒక చిక్కు ప్రశ్న.
ప్రస్తుతం చాలా మంది యువతీ యువకులు 35 ఏళ్లు వస్తే కానీ పెళ్లికి సై అనడం లేదు. ఆర్థికంగా పూర్తి భరోసా లభించాకే పెళ్లి పీటలెక్కుతున్నారు. తమ పిల్లలకు మంచి ఆర్థిక భద్రత కల్పించాలి కాబట్టి పెళ్లి చేసుకోవడం జాప్యం అవుతుందన్నది వీరి వాదన. ప్రస్తుత పరిస్థితులు ఆధారంగా చూస్తే వారు చెప్పిందే నిజమేననిపిస్తుంది కూడా. కానీ ఇక్కడే రానున్న రోజుల్లో ఓ పెను విపత్తుకు బీజం పడుతోంది. ప్రస్తుతం కోసం ఇంత చక్కగా ఆలోచించి, ప్లాన్ చేసుకుంటున్న యువతరం, భవిష్యత్ లో జరిగే విషయాలను మాత్రం విస్మరిస్తున్నారు. వీళ్లు 35 ఏళ్లకు పిల్లల్ని కనడం వలన ఆ పిల్లలు పెరిగి పెద్దవారై జీవితంలో ఇంకా సరిగ్గా స్థిరపడకముందే వీళ్లు వృద్ధులుగా మారిపోతారు. మరొక ఇబ్బంది ఏంటంటే తరాల మధ్య అంతరం పెరుగుతున్న కొద్దీ ఆలోచనల్లో చాలా తేడా వస్తుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల ఆలోచనలను అందుకునే అవకాశం ఉండదు. వారి ఆలోచనలకు వీరి ఆలోచనలకు పొంతన కుదురకపోవడం అడ్డంకిగా మారుతుంది. దీంతో పిల్లలపై పర్యవేక్షణ కొరవడి వాళ్లు క్రమశిక్షణ లేకుండా తయారయ్యే ప్రమాదం ఉంది. ఇది సమాజానికి ఒక రకంగా చెడు సంకేతమే. అందుకే మనం లేట్ మ్యారేజేస్ రానున్న రోజుల్లో పెను విపత్తుకు దారితీస్తాయని ముందు చెప్పుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు మహిళలు 30 ఏళ్లు లోపు గర్భం ధరిస్తేనే మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టేందుకు అవకాశం ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోవడంతో పాటు పిల్లలు పుట్టినా అనారోగ్యంగా పుట్టే ప్రమాదం ఉంది. విద్యాలయంలో అకడమిక్ టైం టేబుల్ ఒక పద్థతి ప్రకారం ఎలా తయారుచేయబడి ఉంటుందో...అలాగే లైఫ్ క్యాలెండర్ ఎవరికి వారే సొంతంగా తయారు చేసుకోవాలి.
మీకేం పోయింది ఇలానే చెప్తారు..! కెరీర్ లో స్థిరపడకుండా పెళ్లి చేసుకుంటే కుటుంబాన్ని నెట్టుకురావడం ఎలా? అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ మీరు మంచి ఆరోగ్యవంతమైన కుటుంబాన్ని నిర్మించుకోవాలంటే కాస్త ముందుగానే పెళ్లి చేసుకోవాలి. పాతికేళ్లకు పెళ్లి చేసుకోవడ కుదరకపోయినా 30 ఏళ్ల లోపు చేసుకుని 30 ఏళ్లకు పిల్లల్ని కంటే మీరు సేఫ్ జోన్ లో ఉంటారు. దీనికోసం ముందుగానే ఒక ప్రణాళిక సిద్థం చేసుకుని జీవితంలో తొందరగా స్థిరపడే విధంగా కెరీర్ ను ఎంచుకోవాలి. ఆర్థికంగా పెద్ద లక్ష్యాలు సాధించలేకున్నా మీ ఆలోచనలను, బాధ్యతలను పంచుకునే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటే మీ లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చు. 30 ఏళ్లకు కూడా స్థిరపడలేదు. నేను 35 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటా అంటే అది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ విధమైన ఆలోచన చేసే ముందుకు భవిష్యత్ లో జరిగే పరిణామలు, మీ పిల్లలకు మీకు మధ్య వయస్సు తేడాలు, ఆలోచనా విధానంలో అంతరాలను దృష్టిలో పెట్టుకోవాలి.
పెళ్లి, కెరీర్ రైలు పట్టాల్లాంటివి!
పెళ్లి, కెరీర్ అనేవి జీవితం అనే రైలును నడిపే రెండు సమాంతర రైలు పట్టాల్లాంటివి. ఈ రెండు సమాంతరంగా లేకుంటే రైలు పట్టాలు తప్పుతుంది. జీవితంలో ఓ స్థాయికి వచ్చాక పిల్లల భవిష్యత్, మీ రిటైర్ మెంట్ జీవితం, ఆరోగ్యం ముఖ్యమైన విషయాలుగా మారిపోతాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని చక్కని ప్రణాళిక వేసుకుని కెరీర్ ను పెళ్లిని సమన్వయం చేసుకోవాలి. 30 ఏళ్లకు పిల్లల్ని కంటే 50, 55 ఏళ్లకు రిటైల్ అయిపోయినా ఏ ఇబ్బందీ ఉండదు. మీ పిల్లలు కెరీర్ లో స్థిరపడేందుకు మీరు అన్నివిధాలా సహాయపడేందుకు కావాల్సిన శక్తిసామర్ధ్యాలు మీకు ఉంటాయి. అలా కాకుండా 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుని 40 ఏళ్లకు పిల్లల్ని కంటే మీరు రిటైల్ అయ్యే సమయానికి పిల్లలు ఇంకా చదువుతూనే ఉంటారు. వాళ్లను స్థిరపరిచేందుకు మీరు వాళ్లకు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటే ఇవన్నీ పెద్ద విషయాలు కావని ఎవరైనా అనొచ్చు. కానీ ఆలోచనల్లో అంతరాలు, వాళ్లను పర్యవేక్షణ చేయలేని అసహాయత మిమ్మల్ని బాధపెట్టవచ్చు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని యువతరం కెరీర్ ను పెళ్లిని చక్కగా ప్లాన్ చేసుకుంటే జీవితంలో ఉన్నతిని సాధిస్తారు.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment