ఆ రెండు అక్షరాలను ఇంటిపేరుగా మార్చుకుంటే మీ లైఫ్ మారిపోద్ది!
ప్రస్తుతం చాలా మంది ఔత్సాహికులు పారిశ్రామికవేత్తలుగా మారాలని.. స్టార్టప్ లు పెట్టి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా ఎదగాలని కలలు కంటున్నారు. అయితే వ్యాపారంలో కీలకమైన కొన్ని సూత్రాలను ఆకలింపు చేసుకోకుంటే గెలుపు వాళ్ల దరికి చేరడం కష్టసాధ్యంగామారుతుంది. ముఖ్యంగా ప్రస్తుత వ్యాపార సూత్రాల్లో కీలకంగా మారిన మార్పు మంత్రాన్ని ఒంటపట్టించుకుంటేనే విజయం సాధ్యమవుతుంది. మార్పు..ఈ రెండు అక్షరాల్లో ఉన్న సానుకూల సంకేతమే మానవ జీవితంలో జరిగే అద్భుతాలకు ఆరంభ వేదిక. మార్పు అనేది జీవితంలో కానీ వ్యాపారంలో కానీ అనివార్యం. ముఖ్యంగా వ్యాపారంలో రాణించి మంచి ఎంటర్ ప్రెన్యూర్ గా స్థిరపడాలనుకునే వాళ్లు మార్పును ఇంటిపేరుగా చేసుకోవాలి. అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గి ఉన్నత శిఖరాలను చేరగలుగుతారు. బిజినెస్ లో ఉన్నత స్థాయికి చేరాలనుకుంటున్న యువతరం , ఆత్మవిశ్వాసం, నమ్మకానికి అదనంగా మార్పును జోడిస్తే వాళ్లను ఆపడం ఎవరి తరమూ కాదు. ఆపిల్ అతిపెద్ద టెక్నాలజీ కంపెనీగా ఎదిగినా, నోకియా అనూహ్యంగా పతనమైనా ఆయా కంపెనీలు మార్పును స్వీకరించే విధానమే కారణం. మారుతున్న సమాజం, ప్రజల అలవాట్లు, ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో వ్యాపారంలో మార్పు యొక్క ఆవశ్యకతపై 'కెరీర్ టైమ్స్' ప్రత్యేక విశ్లేషణ.
'దేవుడే మారిపోతున్నాడు'..మీరెంత..?
గతంలో దేవుడు కొన్ని వర్గాల వారికి దూరం. కొందరి వ్యక్తుల మూర్ఖత్వం వలన కొన్ని వర్గాల వారికి ఆలయంలోకి ప్రవేశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. అప్పుడు ఎవ్వరినైతే దేవుడ్ని చూసేందుకు అనుమతించలేదో ఇప్పుడు వారి ఇంటిముందుకే దేవుడ్ని తీసుకెళ్తున్నారు. సమాజంలో వచ్చిన అనివార్యమైన మార్పు ఇది. (సర్వ శక్తివంతుడైన దేవుడే మార్పుకు అతీతుడు కాదని చెప్పడమే మా ఉద్దేశం ) మనిషి కానీ, మనిషి చేసే వ్యాపారం కానీ, ఆఖరుకు దేవుడు కానీ మార్పును స్వాగతిస్తేనే మనుగడ సాగించగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారంలో మార్పును స్వీకరించకపోతే అభివృద్ధిని సాధించలేరు. కొత్తగా స్టార్టప్ పెట్టి వ్యాపారం రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ విషయాన్ని గుర్తించాలి. ఒక ఉత్పత్తి నాణ్యంగా తయారు చేయడం ఎంత ముఖ్యమో దాన్ని విజయవంతంగా మార్కెటింగ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటిలో దేన్ని విస్మరించినా వ్యాపారంలో అపజయం తప్పదు. ఈ రెండు ముఖ్య విషయాలకు తోడు మారుతున్న స్థితిగతులను, ట్రెండ్ ను అంచనా వేసి ఎప్పటికప్పుడు వ్యాపార వ్యూహాల్లో మార్పులు చేసుకోగల సామర్ధ్యం ఉండటమన్నది ఎంటర్ ప్రెన్యూర్ కు ఉండాల్సిన మరో ముఖ్యమైన లక్షణం.
కోట్లు ఉన్నాయని కూరగాయలు అమ్మడం మానేస్తున్నారా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ గూర్చి మనలో ఎవరికీ పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్ కంపెనీ. ఆ కంపెనీ అధినేత ముకేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడు. అయినా వ్యాపార విస్తరణలో భాగంగా దుస్తులు, రిటైల్, జ్యూయలరీ, టెలీ కమ్యూనికేషన్స్ వంటి ఎన్నో రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వెళుతున్నాడు. సామాజికంగా, ఆర్థికంగా దేశంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. మార్పును అంగీకరించకుండా పెట్రో కెమికల్స్ వ్యాపారాన్ని పట్టుకుని వేళ్లాడితే కొద్ది రోజుల తర్వాత ఆ కంపెనీకి మనుగడ ఉండదు. జనాల్లోకి బాగా వెళ్లిపోయాం , మన ఉత్పత్తులకు ప్రజలు బాగా అలవాటుపడ్డారు అనుకునే రోజులకు కాలం చెల్లింది. ప్రఖ్యాత మొబైల్ కంపెనీ నోకియా కూడా ప్రజల అభిరుచులకు అనుగుణంగా మారలేక చతికిలపడింది. బ్రాండ్ ఎంత గొప్పదైనా ప్రతీ మార్పును సొంతం చేసుకుంటేనే మార్కెట్లో కొనసాగుగలుగుతారు. ఈ విషయంలో యువ పారిశ్రామికవేత్తలు నోకియా పతనాన్నే ఒక పాఠంగా తీసుకుంటే వ్యాపారంలో మార్పు ఎంత ముఖ్యమైందో అర్ధమవుతుంది.
విభిన్న ఉత్పత్తులే కంపెనీకి మనుగడ!
ఏదైనా ఒక ఉత్పత్తి ప్రజలకు బాగా చేరువయ్యిందని దానినే ఎల్లప్పుడూ కొనసాగిస్తే వ్యాపారం ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోతుంది. వ్యాపారంలో విజయవంతమైన ఉత్పత్తి అనేది ఒక మైలురాయి మాత్రమే తర్వాత దానికంటే మెరుగైన ఉత్పత్తులను, సేవలను అందించకుంటే పోటీదార్లు మీ స్థానాన్ని ఆక్రమిస్తారు. ప్రారంభంలో మారుతీ సుజుకీ విడుదల చేసిన 800 మోడల్ కారు అత్యంత ప్రజాదరణ పొందింది. ఒక రకంగా ఇండియాలో ప్రజల కారు కలకు పునాది 800 కారే. ఆ కారు అంత బాగా విజయం సాధించింది కదాని కంపెనీ అదే కారుతో ఆగిపోలేదు. మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా తక్కువ ధర కార్లతో పాటు హైఎండ్ కార్లను కూడా అందిస్తూ అతిపెద్ద కార్ల కంపెనీగా దూసుకుపోతోంది. కోల్గేట్ టూత్ పేస్ట్ ఎంత పాపులర్ అయినా ఇప్పటికీ రకరకాలు కొత్త ఉత్పత్తులతో మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ఆ కంపెనీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. మార్పు ఆవశ్యకతను గుర్తించాయి కాబట్టే మనం ఇప్పుడు చెప్పుకున్న కంపెనీలు ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగగలుగుతున్నాయి.
కొత్త ప్రయోగాలకు తెరలేపడమే విజయం రహస్యం!
వ్యాపారంలో ముందుగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే...ఎప్పుడూ ఒకేచోట ఉండిపోకుండా నిత్య చైతన్య స్రవంతిలా ఉండాలి. కొన్ని ఉత్తేజకరమైన మాటల్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 'వీలైతే పరిగెత్తు..పరిగెత్తలేకుంటే నడువు..నడవడం వీలుకాకుంటే పాక్కుంటూ పో'.. అంతే కానీ ఒకే దగ్గర ఉండిపోతే అది పతనానికి సమాధిగా మారుతుంది. వ్యక్తిత్వ వికాసంలో తరుచుగా వాడే ఈ మాటను మనం ఇప్పుడు చెప్పుకుంటున్న వ్యాపార సూత్రాల్లోకి అన్వయించుకుంటే ఎవ్వరైనా విజయం సాధించవచ్చు. చిన్న కోచింగ్ సెంటర్లుగా ప్రస్థానం ప్రారంభించిన శ్రీచైతన్య , నారాయణ విద్యా సంస్థలు...ఒలింపియాడ్స్ అని, టెక్నోస్కూల్స్ అనీ, ఐఐటీ అకాడమీలు అని ఇప్పుడు నాసా కోచింగ్ దగ్గర ఆగాయి. విద్యా రంగంలో , తల్లిదండ్రులు అభిరుచుల్లో మార్పులను నిరంతరం అనుసరిస్తున్నారు కాబట్టే ఆ రెండు సంస్థలు విజయవంతమైన సంస్థలుగా ఎదగగలిగాయి. వ్యాపారం ప్రారంభించాలనుకునే యువకులు కూడా ఇలాంటి సక్సెస్ స్టోరీలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అప్పుడే విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగగలుగుతారు.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment