ఈ 6 కెరీర్స్ తో చదువు లేకున్నా స్టార్ కావొచ్చు!!
మంచి కెరియర్ అంటే లక్షల్లో జీతం, ఉద్యోగ భద్రత, మంచి పదోన్నతులు..ఇలా సాగుతుంది ప్రాధాన్యతల లిస్ట్. ఇలాంటి కెరియర్ ను సొంతం చేసుకోవాలంటే అత్యున్నత అర్హతలు, నైపుణ‌్యాలతో పాటు ఇంకా ఎన్నో విషయాలు తెలియాల్సి ఉంటుంది. మరి ఎటువంటి విద్యార్హతలు లేకపోతే మంచి కెరియర్ ను నిర్మించుకోవడం సాధ్యం కాదా? అని అంటే కచ్చితంగా సాధ్యమే అని చెప్పాల్సి వస్తుంది. కుటుంబ పరిస్థితుల వల్లనో లేక ఆర్థిక కష్టాల కారణంగానో చాలా మంది చదువును కొనసాగించలేరు. కానీ వాళ్లకి కూడా బాగా డబ్బు సంపాదించి మంచి కెరియర్ లో స్థిరపడాలని ఉంటుంది. చదువు లేకున్నా పెద్దగా నైపుణ్యాలు లేకున్నా అత్యవసర సర్వీసెస్ గా ఎనీటైమ్స్ కెరీయర్స్ ను ఎంచుకుంటే వీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. కాస్త కష్టపడితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కెరియర్స్ లో నెలకు 40 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకూ సంపాదించే వీలుంది. పనిని నేర్పుగా చేయగలిగే అతి చిన్న నైపుణ్యం మాత్రమే ఈ ఎమర్జన్సీ కెరియర్స్ కు పెట్టుబడి. ఈ కెరీర్స్ కు పని ఉండదు అని చెప్పేందుకు వీలు లేదు. మనిషి అవసరాల ఆధారంగా పనిచేయడం వలన అవతలివారు ఎంత డబ్బు చెల్లించైనా వీరితో పనిచేయించు కుంటారు. గ్రామీణ ప్రాంతాల వారు, పెద్దగా చదువుకోని వారు దృష్టిపెట్టాల్సిన ఆ కెరియర్స్ ఏంటో చూసేద్దామా..!!
'మనం చాలా ముఖ్యమైన పనిమీద వెళ్తున్నాం. సడన్ గా మనం బైక్ కి లేదా కార్ కి పంక్చర్ పడింది'. అప్పుడు మనం ఏం చేస్తాం. వెహికల్ ను రోడ్డు మీద వదిలేయం. అలా అని జాప్యం చేస్తే అవతల మన అర్జంట్ పని ఆగిపోతుంది. ఇటువంటి సమయంలో మనల్ని ఆదుకునేది టైర్ పంక్చర్ మెకానిక్. అదే విధంగా ఏదో వెహికల్ ఏదో సాంకేతిక సమస్య తలెత్తినప్పుడో లేక పెట్రోల్ ఓవర్ ప్లో కావడం, స్పార్క్ ప్లగ్ లో సమస్య రావడం వంటి ప్రాబ్లెమ్స్ వస్తాయి. అటువంటప్పుడు మనం కచ్చితంగా మెకానిక్ దగ్గరకు వెళ్లాల్సిందే. వీళ్లతో మనం పని చేయించుకున్నప్పుడు మనం డబ్బులకు పెద్దగా ప్రాధాన్యతనివ్వం. ఎందుకుంటే మనకు సమయం చాలా ముఖ్యం. సరిగ్గా ఇక్కడే ఈ కెరియర్ లో ఉన్నవాళ్లు మంచి డబ్బులు సంపాదిస్తారు. పెద్ద పెద్ద పనిముట్ల అవసరం లేకుండా చిన్న చిన్న పరికరాలతో వీరు పనిచేస్తారు. హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో ఈ టైర్ పంక్చర్ / మెకానిక్ లు రోజుకి 1500 నుంచి 2000 వరకూ సంపాదిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా తమ పనివేళలను వీరే నిర్ణయించుకుంటారు. తమకు అనుకూలంగా ఉన్న సమయంలోనే పనిచేస్తారు. పెద్దగా చదువుకోని గ్రామీణ ప్రాంత విద్యార్ధులు దీనిపై ఓ లుక్కేయండి.
సమయానికి ఉపయోగపడ్డామన్న ఆత్మసంతృప్తి తో పాటు మంచి డబ్బులను సంపాదించుకునే అవకాశమున్న మరో కెరియర్ అంబులెన్స్ సర్వీస్. దీనికి కూడా పెద్ద చదువు సంధ్యలు, అర్హతలు అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, వెహికల్ ను వేగంగా, చాకచక్యంగా నడిపే నేర్పు ఉంటే సరిపోతుంది. ప్రస్తుత సమాజంలో చాలామంది ఆసుపత్రిలో చనిపోయిన తమ వారిని సొంత వాహనాల్లో తరలించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో అంబులెన్స్ సర్వీస్ లకు డిమాండ్ పెరిగింది. ఇక అత్యవసరంగా పేషెంట్స్ ను తరలించడం వంటి పనులు వీళ్లకి ప్రతీ రోజూ ఉంటాయి. అత్యవసర సమయంలో ఎవరూ వీళ్లతో బేరాలాడుతూ కూర్చోరు. వాళ్లు అడిగినంత ఇచ్చి పని జరిగేలా చూసుకుంటారు. మన దేశంలో అంబులెన్స్ సర్వీస్ లకు ఇటీవల కాలంలో బాగా డిమాండ్ పెరుగుతోంది. మంచి కండీషన్ లో ఉన్న వెహికల్ ను సమకూర్చుకుని నిబంధనలకు అనుగుణంగా అందులో అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తే సరిపోతుంది. ఈ కెరీర్ మంచి డబ్బుతో పాటు అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడామన్న ఆత్మసంతృప్తి కూడా దొరుకుతుంది. అంబులెన్స్ కెరియర్ ను ప్రారంభించేవాళ్లకు బ్యాంకులు రుణాలు కూడా అందిస్తున్నాయి. పెద్దగా చదువుకోలేదని బాధ పడకుండా యువత అంబులెన్స్ సర్వీస్ పై దృష్టి సారిస్తే మంచిది.
ఇది అందరూ చెయ్యలేని కెరియర్. అయినా ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనిషి అత్యవసరాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి. అస్సలు చదువు రాకపోయినా శ్మశాస సేవల కెరియర్ ను ఎంచుకుంటే మంచి డబ్బులు సంపాదించవచ్చు. ఈ కెరియర్ లో ఉన్నవాళ్లు రోజుకు నాలుగు నుంచి ఐదు వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నారు. దహన సంస్కారాలకు అవసరమైన అన్ని రకాల సామాన్లను సమకూరుస్తూ మృతుల తాలూకూ వారికి సంతృప్తి కలిగేలా వ్యవహరించడమే వీళ్లు చేయాల్సిన పని. ప్రస్తుతం మనిషి చనిపోయిన వెంటనే బంధువులు వచ్చే వరకూ ఒక అద్దాల శవపేటికలో ఉంచుతున్నారు. అటువంటి బాక్స్ లు సమకూర్చుకుంటే మరింత లాభసాటిగా ఉంటుంది. దీంతో వాళ్ల స్తోమతకు అనుగుణంగా కట్టెలు, ఇతర సామాన్లు సమకూర్చడం కూడా వీళ్లు చేస్తున్నారు. ఈ కెరియర్ ఎమర్జెన్సీ కెరియర్స్ లో ఒకటి. ఇక్కడ కూడా ఎవరూ డబ్బు విషయం పెద్దగా ఆలోచించరు. కాబట్టి శ్మశాన సేవల కెరియర్ పై కూడా దృష్టి పెడితే మంచిది. అయితే అందరి వల్ల ఇది సాధ్యం కాదు.
హిందూ దేవాలయాల దగ్గర పండగల సమయంలో మంచి డిమాండ్ ఉన్న కెరియర్ ఇది. పండగల సమయం అనే కాదు మంచి ప్లానింగ్ తో చేస్తే ప్రతీ రోజూ వ్యాపారం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా అత్యవసర సర్వీసే. ఎందుకంటే గుడికి వచ్చేవాళ్లు కొబ్బరికాయ, ఇతర పూజా ద్రవ్యాలు ఎంత డబ్బు ఇచ్చి అయినా కొంటారు. అంత దూరం గుడికి వచ్చి దేవుని దగ్గరకు ఉత్తి చేతులతో వెళ్లరు కదా? ఇటీవల కాలంలో లాభసాటి వ్యాపారాల్లో దేవాలయాల దగ్గర చేసే ఈ పూలు, పూజా ద్రవ్యాల వ్యాపారం కూడా ఒకటని తేలింది. ఎందుకంటే ఇక్కడ చేసే వ్యాపారంలో పెట్టుబడి పోను దాదాపు 50 నుంచి 60 శాతం వరకూ లాభాలు వస్తాయి. మంచి నాణ‌్యత ఉన్న వస్తువులు అందిస్తే రోజూ గుడికి వచ్చే కొందరి వ్యక్తులతో మంచి రిలేషన్స్ ను కొనసాగిస్తే ఇది మరింత లాభసాటిగా మారుతుంది. చదువుకోని వారు మంచి డబ్బులు సంపాదించాలనే కోరిక ఉన్నవాళ్లు ఈ కెరియర్ పై దృష్టి పెట్టండి.
5. చెప్పులు, బ్యాగులు కుట్టడం
మనం అర్జంట్ గా పనిమీద వెళ్తున్నాం. బ్యాగ్ తెగిపోతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో చెప్పులు తెగిపోతాయి. అలా అని మధ్యలో వాటిని వదిలేసి వెళ్లలేం కదా? ఇలాంటప్పుడు మనం బ్యాగ్ ను లేదా చెప్పులను కుట్టే మనిషి ఉంటే బాగుండునని అనుకుంటాం. అలాంటి షాప్ కనిపిస్తే మనం అర్జంగ్ గా పనిచేయించుకుంటాం కానీ ఇంత మాత్రమే డబ్బులు ఇస్తాను అని బేరాలు చేసే పరిస్థితి ఉండదు. కొన్ని నివేదికల ప్రకారం మన దేశంలో అత్యవసర సర్వీసుల కెరియర్ లో చెప్పులు, బ్యాగులు కుట్టడం కూడా ఉంది. మంచి ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటే మనం పైన చెప్పుకున్న కెరియర్స్ లానే ఇది కూడా చాలా మంచి కెరియర్ గా నిలుస్తుంది. ఇటీవల కాలంలో జిప్ లు అధికంగా ఉన్న బ్యాగ్ లు వస్తున్నాయి. అవి అస్తమాను ఫెయిల్ కావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీళ్లు జిప్ లను కూడా సరిచేస్తే అదనపు ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ అత్యవసర సర్వీస్ ను సరిగ్గా నిర్వహించుకోగలిగితే రోజుకు 2వేల రూపాయల వరకూ సంపాదించే వీలుంది.
6. ప్లంబర్/ ఎలక్ట్రిషియన్
మన ఇంట్లో చాలా పనులకు నీళ్లే ఆధారం. ఒక్క పూట నీళ్లు రాకుంటే విలవిలలాడిపోతాం. కిచెన్ దగ్గర్నుంచి, వాష్ ఏరియాల వరకూ అంతా వాటర్ ను సప్లయ్ చేసేందుకు పైపులు, ట్యాప్ లు ఉంటున్నాయి. వీటికి ఏడాదిలో కొన్ని సార్లు కచ్చితంగా రిపేర్లు , సమస్యలు వస్తాయి. ఇటువంటి సమయంలో మనకు ప్లంబర్ అవసరం పడుతుంది. ఇది కూడా ఒక ఎమర్జెన్సీ కెరియర్. నీళ్లు లేకుండా మనం ఒక్కరోజు కూడా ఉండలేం కనుక ప్లంబర్ ను పిలిచి యుద్దప్రాతిపదికన పనిని పూర్తి చేయిస్తాం. ఈ సమయంలో అతను అడిగిన డబ్బులు ఇచ్చి ప్లంబింగ్ వర్క్ పూర్తి చేయించుకుంటాం. నగరాల్లో అపార్ట్ మెంట్ కల్చర్ విస్తరించాక ప్లంబింగ్ వర్క్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. వీళ్లు ప్రస్తుతం ఒక్క విజిట్ కు రూ.500 వరకూ ఛార్జ్ చేస్తున్నారు. ఇక ఎలక్ట్రిసిటి సంగతి చెప్పనక్కర్లేదు. మనం తిండి తినకుండా అయినా ఉంటాం కానీ ఒక పూట కరెంట్ లేకపోతే అల్లాడిపోతాం. ఎలక్ట్రిక్ ఉపకరణాల సంఖ‌్య పెరగడంతో ఇప్పుడు ఎలక్ట్రిషియన్స్ కు కూడా డిమాండ్ పెరిగింది. ఇంట్లో చిన్న విద్యుత్ సమస్యలు వచ్చినా ఎలక్ట్రిషియన్ రావాల్సిందే. ప్రస్తుతం మెట్రో నగరాల్లో చాలా మంది ఎలక్ట్రిషియన్లు నెలకు 40 నుంచి 50 వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నారు.
పెద్దగా చదువుకోలేదు. అర్హతలు లేవు. నేను ఎందుకూ పనికిరాను అని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా యువకులు ఇప్పుడు మనం చెప్పుకున్న ఎమర్జెన్సీ కెరియర్స్ పై దృష్టి పెడితే మంచి స్థాయికి చేరుకోవచ్చు. చదువులేకున్నా ఆర్థికంగా ఎదిగేందుకు అడ్డంకి లేదని నిరూపించవచ్చు. ముఖ్యంగా అర్హతలు లేని గ్రామీణ ప్రాంత యువకులు ఈ కెరియర్స్ పై దృష్టి సారిస్తే మంచిది.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com






Comments
Post a Comment