'ధైర్యవంతులు' మాత్రమే ఇది చదవండి!!
ప్రతీ రోజూ ఉదయాన్నే లేవడం.. గబాగబా నాలుగు ముద్దలు నోట్లో వేసుకోవడం ఆఫీస్ కు పరిగెత్తడం.. నైన్ టూ సెవెన్ నాన్ స్టాప్ గొడ్డు చాకిరీ.. అవుట్ పుట్ అంటూ బాస్ పెట్టే హింస.. డెడ్‌లైన్ అంటే వణుకు.. కొత్తగా ఆలోచిద్దామంటే పట్టించుకునే నాథుడే ఉండడు.. ఈ గానుగెద్దు చాకిరీకి నెలంతా కళ్లు కాయ కాసేలా ఎదురు చూసే జీతం వచ్చినా రెండ్రోజుల్లోనే కథ మళ్లీ మొదటికే. ఇలాంటి లైఫ్ స్టైల్ తో విసిగిపోతున్న వారంతా ఇప్పుడు చేస్తున్న ఆలోచన వ్యాపారం చేయడం. ఆలోచన వచ్చింది కదాని ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోవడం అంత ఈజీ అయితే ఇప్పుడు గల్లీకో వ్యాపారవేత్త ఉండేవాడు. అందరికంటే భిన్నంగా ఉండి, ఎన్నో మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొనే సత్తా ఉన్న వాళ్లే వ్యాపార వేత్తలు కాగలరు.
స్టార్టప్ పెట్టాలనే ఆలోచన రావడం సరైనదే. అయితే దృఢచిత్తం, సాహసం ఉంటేనే విజయం మిమ్మల్ని వరిస్తుంది. అలా కాకుండా ఆఫీస్ ఒత్తిడి భరించలేక వ్యాపారవేత్త అయిపోదామనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకునేవాళ్లు ముందుగా తమను తాము పరీక్షించుకోవాలి. తీవ్రమైన ఒత్తిడితో కూడిన ఈ రంగానికి నేను పనికొస్తానా? నేను ఈ సవాలును విజయవంతం చేయగలుగుతానా? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మవిమర్శ కూడా చాలా ముఖ్యం. ఇది వ్యాపారవేత్త కావాలనుకుంటున్న వారిని వెనక్కు లాగడం కాదు. తమను తాము స్వీయ సమీక్ష చేసుకున్నాకే స్టార్టప్ ఆలోచన చేస్తే అది విజయవంతమవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లక్షణాలు ఉంటే స్టార్టప్ అస్సలు స్టార్ట్ చేయకండి.
- లైఫ్ లో ఆర్థిక స్థిరత్వం అంటే, నెలా నెలా వచ్చే జీతం అని అనుకునే వాళ్లు వ్యాపారవేత్త కాలేరు.
- సవాళ్లంటే భయపడే వారు వ్యాపారం జోలికి వెళ్లకండి.
- రెండు పడక గదుల ఇళ్లు కొనుక్కోవడం, మంచి జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు. ఇవి చాలు నాకు. ఇలా ఆలోచించే వాళ్లు వ్యాపారవేత్తలుగా అస్సలు పనికిరారు.
- నూటికి 90 శాతం మంది మీ వ్యాపారం ఆలోచన విని మీరు తప్పకుండా ఫెయిల్ అవుతారు అని చెపుతారు. వారి మాటలు విని కొత్త విషయాల జోలికి వెళ్లకుంటే మీరు వ్యాపారవేత్త కాలేరు.
- ఇక మంచి హోదా, ప్రతీ ఏడాది 10 శాతం జీతం హైక్. ఇలా ఆలోచిస్తే అస్సలు వ్యాపారం వైపు రావద్దు.
- వ్యాపారం ప్రారంభించాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అన్నీ నాకే తెలుసు అనే అతి విశ్వాసం మీకు ఉంటే మీరు వ్యాపారవేత్త అయ్యే లక్షణాలు లేనట్టే.
వ్యాపారవేత్తగా రాణించాలంటే ఒక మొండి ధైర్యం కావాలి. అది ఎంతలా అంటే అనుకోని కష్టాలు ఎన్ని ఎదురైనా నువ్వు నమ్మిన దాన్ని మధ్యలో వదలేయని ధైర్యం ఉండాలి. నమ్మక ద్రోహాలు, త్యాగాలు, జేబులో రూపాయి కూడా ఉండని సందర్భాలు వీటన్నింటినీ దాటే దమ్ము ఉంటేనే విజయం వస్తుంది. ఏడాదికి లక్షల్లో వస్తున్న జీతాన్ని వదిలిపెట్టే ధైర్యంతో పాటు ఎప్పటికైనా నిలబడతాను అనే ఆత్మవిశ్వాసం మిమ్మల్ని నడిపిస్తుంది. ఎంటర్‌ప్రెన్యూర్ షిఫ్ లో ఎన్నో సమస్యలను, బాధలను భరించాల్సి ఉంటుంది. మీ కలను నిజం చేసుకునేందుకు లక్షల్లో జీతాన్ని వదిలే ధైర్యం ఉండాలి.
- మానసికంగా చాలా బలంగా ఉండగలగాలి.
- ఇన్వెస్టర్లు ముందుగా అంగీకరించి తర్వాత పెట్టుబడి పెట్టకుండా చేయి ఇవ్వవచ్చు.
- జేబులో రూపాయి కూడా ఉండని సందర్భాలు ఎదురు కావచ్చు.
- మీతో కలిసి పనిచేస్తామని చెప్పినవాళ్లు మధ్యలో మిమ్మల్ని వదిలి పెట్టవచ్చు.
- రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. లాభాలు తక్షణం వచ్చేయవు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
మనం అన్నీ చక్కగా ప్లాన్ చేసుకుని ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లాలి అనుకుంటాం. కానీ అవన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. పరిస్థితి మన అదుపులో ఉండదు. దీంతో చిరాకు వేధిస్తుంది. అనుభవంలో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటాం. దీనికి తోడు ఒక్కోసారి మీరు తీసుకుంటున్న నిర్ణయాలపై మీకే అనుమానం కలుగుతుంది. సలహా అడుగుదామంటే సహాయం చేసే వాళ్లే ఉండరు. మెంటార్స్ ఉన్నా అన్ని విషయాలకు వాళ్లను అడగలేం కదా అనుకుంటారు. వరుసగా పరాజయాలు ఎదురైతే మీపై మీకే నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. ఇక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మోసుకొచ్చే మరో బాధ పని వ్యసనం. మనం దేన్ని వ్యవనంగా మార్చుకున్నా దాని ప్రభావం మన జీవితంపై ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మద్యం, ధూమపానానికి బానిసలుగా మారే ప్రమాదం పొంచి ఉంది. వీటికి తోడు నిద్రలేమి, కుటుంబ సంబంధాలు దెబ్బతినడం, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటివి కూడా చోటుచేసుకుంటాయి. ఇవన్నీ మిమ్మల్ని నిరుత్సాహపర్చడానికి చెపుతున్నవి కావు ఎదురుకాబోయే సవాళ్లను మీకు ముందుగా వివరించే ప్రయత్నమే.
ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలని మీకు బలంగా అనిపించినప్పుడు , ఉద్యోగాన్ని వదిలి ఇక స్టార్టప్ పెట్టాల్సిందే అని నిర్ణయించుకున్నప్పుడు ఈ విషయాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొండి.
- నెలకు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? భవిష్యత్ లో మీ ఖర్చుల లెక్కలు తయారు చేసుకోండి.
- జీతం లేకుండా ఎన్నాళ్లు ఇళ్లు గడుస్తుంది? మీ ప్రారంభించే కొత్త స్టార్టప్ తో ఏడాది తర్వాత ఆదాయం వస్తుంది అనుకుంటే రెండేళ్లకు సరిపడా డబ్బు ఆదా చేసుకున్నాకే రంగంలోకి దిగండి.
- జాబ్ చేస్తూనే నా డ్రీమ్ ప్రాజెక్ట్ ను స్టార్ చేయొచ్చా? పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎంత సమయం పడుతుంది.
- అన్నింటి కంటే ముఖ్యంగా అసలు నేను ఎందుకు ఉద్యోగం వదిలేయాలి? బాస్ చెపుతున్న పని నచ్చడం లేదు. యస్ నాకు నేనే బాస్ కావాలి.
- ప్లాన్ ఏ, ప్లాన్ బీ రెండూ కనుక విఫలమైతే, ప్లాన్ సీ, ప్లాన్ డీ కూడా నా దగ్గర రెడీగా ఉన్నాయా?
- ఉద్యోగం వదిలి స్టార్టప్ మొదలు పెట్టాక మూడేళ్ల తర్వాత ఎలా అనిపిస్తుంది? కొంచెం కష్టంగా ఉన్నా ముందుకు వెళతారా? లేక నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా?
ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ లో ఉన్న సవాళ్లు గూర్చి. ఇది మిమ్మల్ని నిరుత్సాహపర్చాలన్నది కాదు. అందులో ఉండే లోటు పాట్లపై ముందుగా మిమ్మల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం. మనం రోజూ వందల సంఖ్యలో స్టార్టప్ సక్సెస్ స్టోరీలను వింటూ ఉంటాం. కానీ దాని వెనుక వాళ్లు పడిన శ్రమను, కష్టాన్ని మాత్రం తెలుసుకోము. అలా తెలుసుకున్నప్పుడే అది మన విజయానికి సహాయపడుతుంది. వ్యాపారవేత్త కావాలన్న మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎన్నో సమస్యలను, కష్టాలను, బాధలను భరించాల్సి ఉంటుంది. అయినా వెనకడుగు వేయకుండా ధైర్యంతో శ్రమిస్తే విజయం తప్పకుండా మీ ముంగిట నిలుస్తుంది.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com





Comments
Post a Comment