ఐటీ సంక్షోభం..నైపుణ్యమే 'అభయం'!
'దూసుకొస్తున్న కొత్త టెక్నాలజీలు..లక్షలాది ఐటీ ఉద్యోగాలకు ఎసరు'. గడిచిన రెండు రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వార్త ఇప్పుడు ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. అనూహ్యంగా వచ్చి పడిన ఈ తొలగింపు ముప్పుతో ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరి టేబుల్ పై పింక్ స్లిప్ దర్శనమిస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అధిక వేతనాలు అందుకుంటున్న వారికి ఈ తొలగింపు ముప్పు ఎక్కువగా ఉంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రస్తుతం తక్కువ మంది సిబ్బందితోనే పనులు పూర్తవుతున్నాయి. దీంతో కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను మార్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితమే ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ. అయితే ఉద్యోగులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పెను సంక్షోభం నుంచి ఈజీగా గట్టెక్కవచ్చు.
'మార్పు' అనేది చాలా శక్తివంతమైనది. కొత్త మార్పు వచ్చినప్పుడు పాత విషయం తలదించుకుని కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఇది ప్రకృతి సూత్రం. టెక్నాలజీకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కొత్త టెక్నాలజీలు రంగ ప్రవేశం చేసినప్పుడల్లా పాత టెక్నాలజీలు కనుమరుగవుతూ ఉంటాయి. అలాగే ఐటీ రంగంలో కూడా ఇటీవల కాలంలో ఎన్నో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆటోమేషన్, కృత్రిమ మేథ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలు రంగ ప్రవేశం చేశాయి. ఈ పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు ఆయా టెక్నాలజీలను సొంతం చేసుకుంటూ మానవ వనరులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశీయ ఐటీ రంగంలో దాదాపు 40 లక్షల మంది వరకూ ఉపాధి పొందుతున్నారు. తాజా పరిస్థితితో అందులో దాదాపు 30 నుంచి 40 శాతం మంది వరకూ ఉద్యోగాలు కోల్పోయే అవకాశముందని తెలుస్తోంది. ఆ మిగిలిన 60 శాతం మందే సంప్రదాయ ఐటీ సేవలతో పాటు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా పనిచేస్తారని సర్వే సంస్థల అంచనా.
ప్రస్తుతం ఈ 'తొలగింపు' ఎక్కువగా సంప్రదాయ ఐటీ సేవల్లో కొనసాగుతున్న వారికే అధికంగా ఉంది. చాలా రోజుల నుంచి ఒకే విభాగంలో పాతుకుపోయి , భారీ జీతాలు తీసుకుంటున్న వారిని కంపెనీలు ముందుగా ఇంటికి పంపిస్తాయి. ఒక విధంగా కొత్త టెక్నాలజీలు నేర్చుకోకుండా చాలా రోజుల నుంచి ఒకే టెక్నాలజీలో పనిచేస్తున్న వారికి ముప్పు ఎక్కువగా పొంచి ఉంది. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోని వారికి ప్రస్తుత జాబ్ మార్కెట్లో మనుగడ ఉండదని కెరీర్ టైమ్స్ గతంలోనే చెప్పింది. నిత్య విద్యార్ధిలా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాల్సిందే. "నాకేంటి ఉద్యోగం వచ్చేసింది..ఇక రిలాక్స్ అయిపోతాను" అనుకున్నవాళ్లకు మనుగడ కష్టంగా మారుతుంది. ఇప్పుడు ఐటీ రంగంలో కూడా అదే జరుగుతోంది. సంప్రదాయ ఐటీ ఉద్యోగాల్లో కోత ఉన్నప్పటీకీ కొత్త టెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని గుర్తించి అభ్యర్ధులు ఆ దిశగా కృషి చేయాలి. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ టెక్నాలజీలు నేర్చుకుని ఇండస్ట్రీకి అనుగుణంగా తమను తాము మలుచుకున్నప్పుడు ఏ కంపెనీ ఉద్యోగిని వదులుకునేందుకు సిద్ధపడదు.
ఐటీ రంగంలో 3 -5 ఏళ్లకు కొత్త టెక్నాలజీ రావడం సహజమే. అంటే ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్న వాళ్లకే ఈ రంగం సరిపడుతుందని చాలా క్లియర్ గా అర్ధమవుతోంది. అయితే కొందరు ఉద్యోగులు మాత్రం సేఫ్ జోన్ లో ఉండిపోయి అప్ డేట్ అయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదు. అటువంటి వాళ్లు ఇప్పుడు ఇబ్బందుల్లో పడే అవకాశముంది. టీమ్ లీడ్ తో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నించండి. ప్రస్తుతం ఏయే టెక్నాలజీలపై అధిక ప్రభావం పడనుందో తెలుసుకుంటే నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు అవకాశముంటుంది. అదే విధంగా రానున్న రోజుల్లో ఏయే టెక్నాలజీకు డిమాండ్ ఉంటుందో తెలుసుకుంటే ఆయా కోర్సులను నేర్చుకునేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం నిపుణుల అంచనా ప్రకారం ఆటోమేషన్ వలన ఈ విభాగాల్లో ఉద్యోగాలు పోతాయని తెలుస్తోంది.
- మాన్యువల్ టెస్టింగ్
- టెక్నాలజీ సపోర్ట్
- సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్
ఈ విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల పనులను రోబోటిక్స్ ఆటోమేషన్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ద్వారా తక్కువ ఖర్చుతో నిర్వహించుకునేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాల తొలగింపు గురించి వార్తలు వస్తున్నా కొన్ని విభాగాల్లో మాత్రం నిపుణులకు మంచి గిరాకీ ఉంది. ప్రస్తుత కొత్త టెక్నాలజీకి సపోర్ట్ చేసే ఈ నిపుణుల కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. రానున్న రోజుల్లో ఐటీ రంగంలో డిమాండ్ ఉన్న విభాగాలు ఇవే.
- డేటా సైన్స్
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( కృత్రిమ మేథ)
- డిజిటల్ డొమైన్
మానసికంగా సిద్ధం కండి!
ప్రస్తుతమున్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఐటీ ఉద్యోగులు మానసికంగా సిద్ధం కావాలి. తమ లోపాలను, బలహీనతలను తక్షణం సరిదిద్దుకుని ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలి. అయినప్పటకీ ఉద్యోగానికి ఆపద వస్తే మార్కెట్ లో డిమాండ్ ఉన్న టెక్నాలజీలను నేర్చుకుని ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలి. ముఖ్యంగా 35 ఏళ్లు పైబడిన వారు, అధికంగా వార్షిక వేతనం పొందుతున్న వారు అప్రమత్తంగా ఉండాలి. ఐటీ రంగంలోనే కెరీర్ ను కొనసాగించదలిస్తే తప్పనిసరిగా అప్ డేట్ కావాల్సిందే. ఇక అధిక వేతనం కోసమే ఐటీ రంగంలో పనిచేస్తూ మనసుకి నచ్చిన పనికి దూరమైన వారికి ఇదే సరైన సమయం. కాస్త కష్టమైనా నిపుణులు, కుటుంబ సభ్యుల సహకారంతో కెరీర్ ను ఛేంజ్ చేసుకునేందుకు ప్రయత్నించండి. ప్రతీ సంక్షోభం మనిషికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఐటీ రంగంలో ఉద్యోగాల కోత అనే సంక్షోభం కూడా కొత్త అవకాశాలకు దారులు పరిచేదే. మానిసికంగా సిద్ధమైతే ఈ కఠిన సవాలను ఉద్యోగులు విజయవంతంగా అధిగమించగలరు.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment