ఇక్కడ ప్రతీ 'పదం' పైసలు కురిపిస్తుంది..!
రోజురోజుకూ విస్తరిస్తున్న టెక్నాలజీ వినియోగం కొత్త అవకాశాలకు, కొత్త కెరీర్ లకు దారులు పరుస్తోంది. ఇంజినీరింగ్, డిప్లొమా వంటి వృత్తి నైపుణ్యాలు ఉన్నవారికే కాదు భాషపై పట్టు ఉన్నవారికి కూడా డిజిటల్ విప్లవం వరంలా మారుతోంది. ప్రపంచం ఒక మినీ కాలనీగా మారిపోయిన నేపథ్యంలో సమాచార మార్పిడి, సాహిత్య వెసులుబాటులో అనువాదం అనేది కీలకంగా మారిపోయింది. దీంతో ఇంగ్లీష్ తో పాటు స్థానిక భాషలపై పట్టు, అనువాదం పై ఆసక్తి ఉన్నవారికి ఇది కాసులు కురిపిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో భాషా పండితులు ఒక్క పదానికి 2 రూపాయలు నుంచి 5 రూపాయల వరకూ సంపాదిస్తూ వృత్తి నిపుణులకు తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. మరికొందరు స్టార్టప్ లు పెట్టి అనువాదాలకు కాంట్రాక్ట్ లు తెచ్చుకుని విజయవంతమైన ఎంటర్ ప్రెన్యూర్స్ గా రాణిస్తున్నారు. ఆసక్తి ఉండాలే కానీ పదం పదంకు రూపాయలు కురిపించే అనువాదం ఇప్పుడు హాట్ కెరీర్ లో ఒకటిగా నిలుస్తోంది.
మన దేశంలో హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, కన్నడ, తెలుగు, పంజాబీ వంటి స్థానిక భాషలపై పట్టు, నైపుణ్యం భాషా నిపుణులకు డిమాండ్ అధికంగా ఉంది. అమెరికా, బ్రిటన్, మలేషియా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాల నుంచి అనువాదకులకు అధికంగా ఆర్డర్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ నుంచి మన స్థానిక భాషల్లోకి అనువాదం చేయాలంటూ పలు కంపెనీలు, భాషా నిపుణులను సంప్రదిస్తున్నాయి. సరళ ఆర్థిక విధానంలో భాగంలో మన దేశం విదేశీ కంపెనీలకు తలుపులు బార్లా తెరిచింది. దీంతో పలు కంపెనీలు మన దేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ఇక్కడి వినియోగదారులను ఆకట్టుకునేందుకు, తమ వివరాలను తెలిపేందుకు ప్రకటనలను, బ్రోచర్లను స్థానిక భాషల్లో విడుదల చేయాల్సిన అవసరం వాటికి ఏర్పడింది. దీంతో ఆయా కంపెనీలు అనువాదకుల తలుపులు తడుతున్నాయి. దీంతో ఒకప్పుడు కేవలం తరగతి గదులకో, ట్యూషన్ సెంటర్లకో పరిమితమైన భాషా పండితులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ పూర్తిస్థాయిలోనూ, తీరి సమయాల్లోనూ పనిచేస్తూ అధిక మొత్తాలను సంపాదిస్తున్నారు.
కొత్త పరిశ్రమగా రూపుదిద్దుకుంటున్న అనువాదం
టెక్నాలజీ విస్తరణతో శరవేగంగా దూసుకొచ్చిన అనువాద రంగం ఇప్పుడు కొత్త ఔత్సాహిక పరిశ్రమగా రూపుదిద్దుకుంటోంది. భాషా పండితులుగా పిల్లలకు పాఠాలు భోధించిన పలువులు అధ్యాపకులు పారిశ్రామికవేత్తలుగా స్పార్టప్ లను నెలకొల్పుతున్నారు. ఇంగ్లీష్, విదేశీ భాషలతో పాటు స్థానిక భాషలపై పట్టు ఉన్న విద్యార్ధులు కూడా అనువాదాన్ని కెరీర్ గా ఎంచుకుంటున్నారు. అయితే అధిక శాతం ఇప్పటికీ దీన్ని అదనపు ఆదాయాన్ని సమకూర్చే కెరీర్ గానే పరిగణిస్తున్నారు. ముఖ్యంగా జర్నలిజంలో పనిచేస్తున్న వారు ఈ రంగంలో అధికంగా ఉన్నారు. అయతే ఇటీవలి కాలంలో డాక్టర్లు, లాయర్లు కూడా అనువాదం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదనపు ఆదాయంతో పాటు తమ తమ రంగాల్లో ఉన్న స్పైషలైజ్డ్ విషయాన్ని స్థానిక భాషల్లో అందించే అవకాశం వచ్చినందుకు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇంగ్లీష్ ను మినహాయిస్తే మిగతా భాషల్లో బాగా రాయగలిగే పరిజ్ఞానం కేవలం పరిచయస్తులతో,కుటుంబ సభ్యులతో అనుభూతులను పంచుకునేందుకు మాత్రమే ఉపయోగపడేది. ఇప్పుడు అదే రాయగలిగే పరిజ్ఞానం డబ్బులు కూడా సంపాదించి పెడుతుండటం టెక్నాలజీ ప్రపంచం కల్పించిన అద్భత అవకాశం.
అనువాదానికి గిరాకీ ఎందుకు పెరిగింది?
గడిచిన ఐదేళ్లలో ఇండియాలో ప్రజల జీవన స్థితిగతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం ఊపందుకుంది. మరోవైపు ప్రజల కొనుగోలు శక్తి ఊహించని విధంగా పెరిగింది. దీంతో కంపెనీలు ప్రజలకు చేరువయ్యేందుకు తమ ప్రణాళికలకు పదును పెట్టాల్సి వస్తోంది. అందులో భాగంగానే స్థానిక భాషల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. విదేశీ కంపెనీలతో పాటు దేశీయ కంపెనీలు కూడా ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో కూడా స్థానిక భాషకు పెద్ద పీట వేయడంతో కంపెనీలకు అది అత్యవసరమైన విషయంగా మారిపోయింది. వస్తువులకు సంబంధించి స్థానిక భాషల్లో వివరాలను అందించే బ్రోచర్లు, సమాచారంతో పాటు ప్రొడక్ట్స్ కోసం ప్రత్యేకంగా యాప్స్ ను కూడా తయారు చేస్తున్నారు. వీటన్నింటికీ ఇంగ్లీష్ తో పాటు స్థానిక భాషపై పట్టు ఉండే విషయ పరిజ్ఞాన నిపుణులు భారీగా అవసరమవుతున్నారు. మొదటి లాంగ్వేజ్ తో పాటు ఇంగ్లీష్ భాషపై మంచి పరిజ్ఞానం ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగా సంపాదిస్తున్నారు.
అనువాదం అంత సులువేమీ కాదు
గడిచిన ఐదేళ్లుగా మన దేశంలో అనువాదకులకు డిమాండ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. సగటున ఏడాది 20 శాతం వృద్ధితో వీరికి డిమాండ్ ఉందని గణాంకాలు చెపుతున్నాయి. ఇందులో ఉన్న అధిక ఆదాయాలు చూసి చాలా మంది పూర్తి సమయాన్ని అనువాద వృత్తికే కేటాయిస్తున్నారు. మరికొందరు మాత్రం తమ తమ ఉద్యోగాలు చేసుకుంటూ అభిరుచితో అనువాదం చేస్తూ అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు. అయితే అనువాదం అనుకున్నంత సులువైన విషయమేమీ కాదు. ఒక్కోఅసైన్ మెంట్ కు 2 నుంచి 3 రోజుల వరకూ పట్టొచ్చు. ఇచ్చిన ప్రాజెక్ట్ ఆకర్షణీయంగా, క్లయింట్ కు సంతృప్తి కలిగే విధంగా తయారు చేసి ఇవ్వడం కొంచెం కష్టమైన విషయమే. అయినా ఇందులో కుదురుకుంటే, క్లయింట్లకు నమ్మకం కలిగేలా వ్యవహరిస్తే మంచి ఆదాయం రావడం మాత్రం గ్యారంటీ. భాషా నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ, మంచి అభిరుచి ఉంటే అనువాదం మీకు కాసులు కురిపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment