సక్సెస్ కు షార్ట్ కట్ 'స్టార్టప్'!
'ఉన్నత విద్యా సంస్థలో చదువు ఆపై మంచి కంపెనీలో ఉద్యోగం'..నిన్న మొన్నటి వరకు యువతరం ఆలోచనలు ఇలానే ఉండేవి. అయితే గడిచిన రెండేళ్లుగా యువతరం ఆలోచనల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. ఒక కంపెనీలో పనిచేసే కంటే తామే సొంతంగా ఒక కంపెనీని నెలకొల్పాలన్న ఆలోచన చేస్తోంది యువతరం. అందుకు అనుగుణంగానే మన దేశంలో ఎన్నో కొత్త స్టార్టప్ లు ఊపిరి పోసుకుంటున్నాయి. ఇది మంచి ట్రెండే అయినా సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే స్టార్టప్ లు విఫలమయ్యే ప్రమాదం కూడా ఉంది. వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న బలమైన కోరికతో పాటు లక్ష్యాన్ని సాధించే నేర్పు కూడా ఉన్నప్పుడే స్టార్టప్ విజయవంతమవుతుంది. ఎటువంటి వ్యాపార నేపథ్యం లేకుండా కేవలం బలమైన లక్ష్యంతో ప్రారంభించే స్టార్టప్ ల ప్రారంభం అదిరిపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి.
తొలి అడుగు సరైన దిశలో సాగాలి
ఎంతటి సుదూర గమ్యమైనా, దాన్ని చేరుకోవాలంటే ఒక చిన్న అడుగుతోనే మొదలుపెట్టాలి. స్టార్టప్ అనేది కూడా ఒక సుదూర గమ్యం లాంటి. ఒక లక్ష్యాన్ని ప్రేమించి దాని కోసం నిరంతరం శ్రమించి చేరుకోవాల్సిన జీవిత గమ్యంలా స్టార్టప్ ను చూసినప్పుడే అది విజయవంతమవుతుంది. ప్రొఫెషనల్ కెరీర్ లో ఛాలెంజింగ్ గా ఉండాలనుకునే యువత స్టార్టప్ వైపు దృష్టిసారిస్తున్నారు. ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది. మొండి ధైర్యం, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించే నేర్పు ఉన్న వాళ్లే స్టార్టప్ పెట్టేందుకు సిద్ధపడాలి. ఒక సర్వే ప్రకారం మనదేశంలో 67 శాతం మంది యువత ఈకామర్స్ ఆధారిత స్టార్టప్ లు పెడుతుండే మరో 33 శాతం మంది నాన్ ఈకామర్స్ ఆధారిత స్టార్టప్ లను స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎంతమంది సక్సెస్ అవుతారన్నది వాళ్ల వాళ్ల సామర్ధ్యం, పరిస్థితులతో వ్యవహరించే నేర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఇంగ్లీష్ కవి చెప్పినట్టు ప్రేమలోనూ, యుద్ధం లోనూ ఓడిపోని వారు ఎవరూ ఉండరు. అలానే వ్యాపారంలోనూ ఒడిదుడుకులు వచ్చి కిందపడవచ్చు. అలా కిందపడిన సందర్భంలో ఎంత వేగంగా పైకి లేచి మళ్లీ కొత్త శక్తితో గమ్యం వైపు ఎవరైతే సాగిపోగలుగుతారో అటువంటి వాళ్లే వాళ్లే స్టార్టప్ లు పెట్టి రాణించగలగుతారు.
సవాళ్లు ఎదుర్కొనే సత్తా ఉండాలి
ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించినప్పుడు అందులో మొదటి తరం వారు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అతిపెద్ద కంపెనీలుగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్ టెల్, టాటా గ్రూప్, విప్రో, హెచ్ సీఎల్ వంటి కంపెనీలు ప్రారంభ దశలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాయి. అలా సమస్యలను అధిగమించబట్టే ఇప్పుడు ఆయా కంపెనీలు అగ్రశ్రేణి కంపెనీలుగా వెలుగొందుతున్నాయి. ప్రస్తుతం స్టార్టప్ నెలకొల్పే యువతరం మొదటి తరం వ్యాపార వేత్తల అనుభవాలను పాఠాలుగా స్వీకరించాలి. అదే విధంగా అంత పెద్ద కంపెనీలతో పోటీ పడే స్థాయికి రావాలంటే సేవలు, ఉత్పత్తుల విషయంలో ఎంత నాణ్యత ఉండాలో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. శారీరకంగా , మానసికంగా బలంగా ఉండటంతో పాటు భవిష్యత్ లో చోటుచేసుకోబోయే మార్పులను పసిగట్టగలిగే నేర్పు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనదేశంలో ఊపందుకున్న ఈ స్టార్టప్ ట్రెండ్ లో విజయం సాధించగలుగుతారు.
స్టార్టప్ లు ఎన్నో రకాలు
లైఫ్ స్టైల్, స్కేలబుల్, బయబుల్, సోషల్ స్టార్టప్స్, లార్జ్ కంపెనీ స్టార్టప్స్, స్మాల్ బిజినెస్ ఇలా స్టార్టప్ లను విభజించుకోవచ్చు. ప్రముఖంగా మనం చెప్పుకున్న ఈ ఆరు రకాల స్టార్టప్ లు పెద్ద పెద్ద ఆర్థిక లక్ష్యాలకు ఉద్దేశించినవి. ఫండింగ్, రిసోర్సెస్ వంటి కొన్ని మౌలిక సదుపాయాలు ఉంటే కానీ వీటిని ప్రారంభించడం కష్టం. ఇక వ్యక్తుల అవసరాలు, అభిరుచులు, ఇష్టాల నుంచి కూడా ఎన్నో స్టార్టప్ లు పుట్టుకొస్తున్నాయి. ఇవి చాలా చిన్న స్థాయిలోవి. వీటిని ప్రారంభించేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం లేదు. ఈ చిన్న చిన్న స్టార్టప్ లు విభిన్న రకాల సేవలను అందిస్తాయి. హెల్త్ కేర్, గార్డెనింగ్, హౌస్ రిపేరింగ్, లాండ్ స్కేప్, కంప్యూటర్ డిజైనింగ్, పర్సనల్ అకౌంటింగ్, ప్రీలాన్స్ రైటింగ్, మార్కెటింగ్ సేవలు వంటి సర్వీసులను చిన్న స్టార్టప్ లు అందిస్తున్నాయి. వీటితో పాటు పెద్ద కంపెనీల సబ్ కాంట్రాక్ట్ లను చేసిపెట్టే స్టార్టప్ లు కూడా ఉన్నాయి. మెడికల్ ట్రాన్స్ స్క్రిప్షన్, అప్పులు వసూళ్లు, కస్టమర్ సర్వీస్ వంటి వేరే కంపెనీల సేవలను కొన్ని చిన్న స్టార్టప్ లు చేసిపెడుతున్నాయి. చిన్న స్టార్టప్ లు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఒడిసిపట్టుకునేందుకు అవకాశం ఉంది. కొత్తగా స్టార్టప్ ను ప్రారంభించాలనుకుంటున్న యువత ఇందులో ఉన్న సమస్యలతో పాటు ఇతర విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు రంగంలోకి దిగితే బాగుంటుంది.
కష్టపడితే బంగారు భవిష్యత్
అది జీవితమైనా, ఉద్యోగమైనా, స్టార్టప్ అయినా మొదట కష్టపడి పనిచేస్తేనే తర్వాత దాని ఫలితాలు అందుతాయి. రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవాలనుకునే వారు స్టార్టప్ లు పెట్టకపోవడమే మంచిది. దీర్ఘకాలిక లక్ష్యమున్నప్పుడే స్టార్టప్స్ తో మనుగడ సాధ్యమవుతుంది. వ్యాపారం అన్నాక రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటన్నింటిని తట్టుకునే మానసిక ధైర్యాన్ని ముందుగా పెంపోదించుకోవాలి. ఉద్యోగులతో కలివిడిగా ఉంటూ తాము ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నామో వారి ప్రతీ క్షణం గుర్తుకు చేయాలి. పోలీసులు, లాయర్లు, ఆడిటర్, కంప్యూటర్ డెవలపర్ ఇలా విభిన్న రంగాల వారితో వ్యవహరిస్తూ నేర్పుగా వ్యవహారాలను చక్కబెట్టుకోగలిగే నైపుణ్యం ఉన్నప్పుడే స్టార్టప్ విజయవంతమవుతుంది. ప్రస్తుతం మన దేశంలో స్టార్టప్ ల సంఖ్య 12 వేలకు పైగానే ఉందని చెపుతున్నారు. ఇండియా స్టార్టప్ లకు రాజధాని అవుతుందని కూడా సర్వే సంస్థలు చెపుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి భవిష్యత్ ను ఊహించి, కష్టపడే తత్వం ఉంటే స్టార్టప్ లతో యువతరం మంచి వ్యాపారవేత్తలుగా రాణించవచ్చు. మీలో ఆ వ్యాపార నైపుణ్యాలు ఉంటే మరెందుకు ఆలస్యం..ఇప్పుడే ఒక స్టార్టప్ ఏర్పాటుకు ప్రణాళికను సిద్ధం చేసుకొండి.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment