పేదవాడు వైద్య విద్యను చదవొద్దా?
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో రిజర్వేషన్ అనేది ఎన్నటికీ ఎడతెగని భిన్నాభిప్రాయాల సుదీర్ఘ చర్చ. భారత రాజ్యాంగంలో అణగారిన వర్గాల కోసం ఉద్దేశించిన ఈ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు రాజకీయ పార్టీలకు బంగారు గుడ్డు పెట్టే బాతు. ఈ రిజర్వేషన్లనకు అధారం చేసుకునే మనదేశంలో రాజకీయాలు, రాజకీయ పార్టీలు తమ పబ్బాన్ని గడుపుకుంటున్నాయి. రిజర్వేషన్లు అనే తేనెతుట్టెను కదిపే సాహసం మాకు లేకపోయినా తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తీసుకున్న ఓ నిర్ణయం బడుగు, బలహీన వర్గాలకు వైద్య విద్యను దూరం చేసేదిగా ఉంది. ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వరాదన్నది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తాజా నిర్ణయం. ఇప్పటికే ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన వైద్య విద్య ఆదిత్య నాథ్ నిర్ణయంతో అట్టడుగు వర్గాలకు మరింత దూరమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రిజర్వేషన్లు లేని సమాజాన్ని తీసుకొస్తానని చెపుతున్న యూపీ ముఖ్యమంత్రి ఒక తొందరపాటు చర్యతో వైద్య విద్యను ఉన్నత స్థాయి వారికే పరిమితం చేస్తున్నారా?
రిజర్వేషన్లపై యోగి ది తొందరపాటు నిర్ణయమా?
అభివృద్ధి చెందని సమూహాలకు మొదట్లో 5 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లను కల్పించిన రాజ్యాంగం తర్వాత సమీక్ష చేసిన పొడిగించమని చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మన రాజకీయ నాయకులు దాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే వస్తున్నారు. రిజర్వేషన్ల వలన ఏ కొద్ది మందో తప్పితే మిగిలిన వాళ్లు అభివృద్ధి సాధించనట్టు దాఖలాలు లేవు. దీనిపై ప్రభుత్వాలు ఒక స్పష్టమైన విధానంతో కాకుండా అప్పటికప్పుడు లబ్ది చేకూర్చే విషయానికి పెద్ద పీట వేయడంతో ఇటువంటి పరిస్థితి దాపురించింది. యోగి ఆదిత్య నాధ్ తీసుకున్న తాజా నిర్ణయం విషయానికొస్తే..ప్రస్తుతం సమాజంలో నాణ్యమైన విద్య అనేది ప్రయివేట్ సంస్థల్లోనే దొరుకుతుంది. కీలకమైన విద్యా రంగంలో ప్రభుత్వం తన భాధ్యతను విస్మరించి విద్యను తీసుకెళ్లి ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో పేదవాళ్లు కూడా తమ పిల్లలకు మంచి విద్యను అందించేందుకు ప్రయివేట్ స్కూళ్లలో జాయిన్ చేస్తున్నారు. తమ ఆదాయం ఎంత తక్కువైనా నోరు కట్టుకుని, ఖర్చులు తగ్గించుకుని తమ పిల్లవాడిని మంచి స్కూల్ లో చదివిస్తున్నారు. వాళ్లు పిల్లలను మంచి స్కూళ్లలో చదివిస్తున్నారు అంటే దానర్ధం వారు ధనవంతులు అని కాదు అర్ధం. ఇటువంటి వారికి రిజర్వేషన్ అండ ఉంటేనే వైద్య విద్య వంటి ఉన్నత చదువులు చదవగలుగుతారు.
ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచిన కాలేజీలు
నోట్ల రద్దుకు ముందు వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ సీటు కోసం అధికారంగా 5 లక్షలు వసూలు చేస్తే అనధికారికంగా దానికి ఎన్నో రెట్లు వసూలు చేసేవి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అధికారికంగానే చాలా కాలేజీలు 90 లక్షల రూపాయలకు పైనే వసూలు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ కాలేజీల్లో రిజర్వేషన్లు తీసేయడం అంటే సామాన్యులకు వైద్య విద్యను దూరం చేయడమే. డబ్బు లేని సామాన్యులు అప్పులు చేసి ఏదో విధంగా ఫీజు కట్టి వైద్య విద్య కలను నిజం చేసుకుందామని అనుకుంటారు. ఇప్పుడు ఇలా రిజర్వేషన్లు ఎత్తేయడం వలన ఎంత డబ్బు అయినా కట్టే స్తోమత ఉన్న ధనవంతులకే సీట్లు వస్తాయి. అంత డబ్బు కట్టలేని సామాన్య విద్యార్ధికి అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ ఉంటే ధనిక విద్యార్ధితో కొద్దొ గొప్పో పోటీ పడేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందని నిపుణులు చెపుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు అనేవి అందరికీ అందని ద్రాక్షలా అయిపోయాయి. ఒక జాతి సంక్షేమం కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లతో అందులో ఏదో ఒకటీ ఆరా శాతమే లబ్ది పొందుతున్నట్టు ఇప్పటికే తేటతెల్లమైంది.
రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తుంది కొందరే!
రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందడం లేదన్న విషయాన్ని ప్రొఫెసర్ కంచె ఐలయ్య, బీ.సీ.రాములు వంటి మేధావులు ఎన్నో వేదికలపై చెప్పారు. రిజర్వేషన్ల వలన ఒక జాతిలో 10 మంది ఉంటే అందులో ఒక్కడే అభివృద్ధి చెందుతున్నాడని ఆ ఒక్కడికి రిజర్వేషన్ ను తొలిగించి మిగిలిన తొమ్మిది మందికి రిజర్వేషన్ సక్రమంగా అందేలా చేయాలి. ఇక క్రిమీలేయర్ విధానం సరైన విధంగా అమలు కాకపోవడం కూడా రిజర్వేషన్లు అట్టడుగు వరకూ చేరకుండా నిరోధిస్తోంది. ఆర్థికంగా బాగా స్థిరపడిన వారు ఐఎఎస్, ఐపీఎస్ లలో రిజర్వేషన్లు పొంది మరింత అభివృద్ధి సాధిస్తున్నారు. రిజర్వేషన్లతో వాస్తవంగా లబ్ది పొందిన వారి జాబితాను తయారు చేసి వారి స్థితి ఆధారంగా రిజర్వేషన్ ను తొలిగిస్తే మరొక విద్యార్ధి బాగు పడేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఏ వర్గం వాళ్లైనా ఆర్థికంగా వెనుబడిన వాళ్లకు కచ్చితంగా రిజర్వేషన్ ను కల్పించాల్సిందే. అప్పుడే అట్టడుగు వర్గాలు అభివృద్ధి సాధిస్తాయి.
దుందుడుకు నిర్ణయాలు సత్ఫలితాలనివ్వవు!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ ఏ ఉద్దేశ్యంతో ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లను తొలిగించారో కానీ ఆ నిర్ణయం మాత్రం కచ్చితంగా పేద విద్యార్ధులకు నష్టం చేస్తుంది. ప్రయివేట్ విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదనలు వస్తున్న ఈ సమయంలో పేద విద్యార్ధులకు నష్టం కలిగించే చర్యలు తీసుకోవడం ఎంతవరకూ సమంజసం? ఆదిత్య నాధ్ నిర్ణయంతో బాగా డబ్బు కట్టగలిగే విద్యార్ధి లాభపడితే ఓ మోస్తరుగా ఇబ్బందులు పడి డబ్బు కట్టగలిగే విద్యార్ధి నష్టపోతాడు. ఈ విషయాన్ని యోగి ఆదిత్య నాధ్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నది చర్చనీయాంశంగా మారింది. ఒక ధనవంతుడితో పాటు ఒక పేద విద్యార్ధి కూడా సమానంగా విద్యను పొందినప్పుడే నిజమైన సమానత్వం ఉన్నట్టు లేకుంటే ఎన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నా అవి సత్ఫలితాలను ఇవ్వవు. రిజర్వేషన్లు లేని సమాజాన్ని తీసుకురావాలంటే ముందుగా రిజర్వేషన్ ఫలాలు అర్హులకు అందేలా చేయాలి అప్పుడే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుంది.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment