'విజ్యుమె'..జాబ్ మార్కెట్లో కొత్త సెన్సేషన్!
ఈ ఆధునిక కాలంలో తనను తాను ప్రమోట్ చేసుకున్నవాడే విజేత. అది ఫేస్ బుక్ , ట్విట్టర్, యూట్యూబ్ ఏదైనా కానీ సోషల్ నెట్ వర్కింగ్ లో ఎంత ఉత్సాహంగా ఉన్నావన్నదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ట్రెండ్ కు అనుగుణంగా లేకపోతే టాలెంట్ ఎంత ఉన్నా కంపెనీలు పక్కన పెట్టేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం విద్యార్హతలను చూసి ఉద్యోగం ఇచ్చేవారు. ఇప్పుడు అభ్యర్ధి అప్ టు డేట్ గా ఉన్నాడా..లేదా? హావభావాలు ఎలా ఉన్నాయి? ఎంత ఉత్సాహంగా ఉన్నాడు? ఇలా సవాలక్ష లక్షణాలు చూస్తున్నారు. ఉద్యోగ అర్హతల్లో చోటుచేసుకున్న ఈ మార్పులకు అనుగుణంగానే ఇప్పుడు ఓ కొత్త పద్ధతి జాబ్ మార్కెట్లోకి రంగ ప్రవేశం చేసింది. సంప్రదాయ రెజ్యుమె కు భిన్నంగా మరింత సృజనాత్మకంగా వచ్చిన ఆ కొత్త పద్ధతే వీడియో రెజ్యుమె. షార్ట్ కట్ లో విజ్యుమె గా పిలుచుకుంటున్న ఈ వీడియో రెజ్యుమె కు అప్ గ్రేడ్ కాకుంటే విద్యార్ధులు పోటీలో వెనకబడిపోవడం ఖాయం.
అసలు ఏంటీ విజ్యుమె?
అభ్యర్ధులు ఇప్పటివరకూ సంప్రదాయ రెజ్యుమెలనే అధికంగా వాడుతున్నారు. ఇందులో మన ప్రతిభ, సామర్ధ్యాలను ఒక పరిధి మేరకు మాత్రమే వివరించే వీలుంటుంది. అందుకే దానికి భిన్నంగా వీడియో రెజ్యుమె రంగ ప్రవేశం చేసింది. విద్యార్ధిలోని నైపుణ్యాలను కాస్త భిన్నంగా, హావభావాలతో ఎంప్లాయర్స్ ను ఆకట్టుకునేలా చేయడమే వీడియో రెజ్యుమె లక్ష్యం. వీడియో రెజ్యుమె అంటే ఒక షార్ట్ వీడియో. విద్యార్ధి విద్యార్హతలు, నైపుణ్యం, అనుభవం, ప్రాజెక్ట్ వివరాలు మొదలైన వాటిని ఒక వీడియోగా చిత్రీకరించి కాస్త భిన్నంగా ఎంప్లాయర్ ముందు ప్రజంట్ చేయడటే వీడియో రెజ్యుమే ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం రిక్రూట్ మెంట్ విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఈ కొత్త విధానం రూపుదిద్దుకుంది. మిగతా వారికి కాస్త భిన్నంగా, ఆధునిక అప్రోచ్ తో తనను తాను ప్రజెంట్ చేసుకుంటూ వీడియోను రూపొందించడం ఎంప్లాయర్స్ ను ఆకర్షిస్తోంది. ఇటువంటి కొత్త తరహా ప్రయోగాలు, మంచి అభిరుచి, ఉత్సాహవంతులైన అభ్యర్ధుల కోసం ఎదురుచూస్తున్న హెచ్ ఆర్ మేనేజర్లు వీడియో రెజ్యుమెలకు ఫిధా అయిపోతున్నారు.
విజ్యుమె లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే!
సంప్రదాయ రెజ్యుమెలో విద్యార్ధి అకడమిక్ అర్హతలు, ఇతర వివరాలు మాత్రమే ఉంటాయి. కానీ వీడియో రెజ్యుమెలో అభ్యర్ధి హావభావాలు, భావవ్యక్తీకరణలను ఎంప్లాయర్స్ చాలా స్పష్టంగా తలుసుకునే వీలుంది. దీన్ని బట్టి ఇంటర్వ్యూలకు ఎవర్ని పిలవాలన్నదానిపై వారికి ముందుగానే ఒక స్పష్టత వస్తుంది. ఇదే వీడియో రెజ్యుమె లో ఉన్న వెసులుబాటు. మన నైపుణ్యాలను కాగితంపై కాకుండా వీడియో రూపంలో పంపుతున్నందున వీడియో రెజ్యుమొ లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మంచి క్వాలిటీ కెమెరాతో షూట్ చేసి వీడియో 2 నుంచి 3 నిమిషాలకు మించి ఉండకుండా చూసుకోవాలి. మంచి వస్త్రధారణతో పాటు కెమెరా వైపు సక్రమంగా చూసి చాలా స్పష్టంగా మాట్లాడగలిగే నేర్పు వచ్చాకే విజ్యుమె తయారీకి పూనుకోవాలి. దీనికోసం ముందుగా రిహార్సల్స్ చేసుకుంటే మంచిది. అదే విధంగా సంప్రదాయ రెజ్యుమెకు విజ్యుమె అనుబంధంగా ఉండాలి కానీ ఇదే ప్రధానంగా ఉండకూడదు.
రెజ్యుమె కు అనుబంధంగానే ఉండాలి
ఇతరుల కంటే మేం కాస్త భిన్నం అని చెప్పుకునేందుకు విజ్యుమె బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అర్హతలు, అనుభవం తక్కువగా ఉన్నవారు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు విజ్యుమెను వేదికగా మలుచుకోవాలి. ఇది విద్యార్ధికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది విజ్యుమె ఎప్పుడూ రెజ్యుమె కు అనుబంధంగానే ఉండాలి. జాబ్ వెబ్ సైట్లలో, లింక్డ్ ఇన్ వంటి సైట్లలో రెజ్యుమె తో పాటు విజ్యుమెను అటాచ్ చేయాలి. అన్నింటికంటే గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం..అన్ని కంపెనీలు విజ్యుమెను అంగీకరించవు. విద్యార్ధులు దీన్ని గమనించి దానిక తగ్గట్టు అప్లికేషన్ ను పెట్టుకోవాలి. సంప్రదాయ రెజ్యుమె ను మాత్రమే అంగీకరించే కంపెనీల పాలసీలకు అనుగుణంగా నడుచుకోవాలి. లేకుంటే క్రియేటివిటీ మాట దేవుడెరుగు, మొత్తానికే నష్టం జరగొచ్చు.
పెరుగుతున్న ప్రాధాన్యత
పెరుగుతున్న ప్రాధాన్యత
రెజ్యుమె లో అభ్యర్ధి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం ఎంప్లాయర్స్ కు సాధ్యం కాదు. విజ్యుమెలో అయితే వారిని అన్ని కోణాల నుంచి పరిశీలించేందుకు అవకాశం కలుగుతుంది. విజ్యుమె ద్వారా అభ్యర్ధి హావభావాలు ఎలా ఉన్నాయి, ఒక విషయంలో అతను అభిప్రాయం ఎంత సూటిగా, స్పష్టంగా ఉందన్నదానిపై ఎంప్లాయర్స్ కు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అభ్యర్ధి మన కంపెనీ వర్క్ కల్చర్ లో ఇమడగలుగుతాడా లేదా అన్నదానిపై ఒక అభిప్రాయానికి వస్తున్నారు. ఈ ఉపయోగమే ఇప్పుడు విజ్యుమెలకు ఆదరణ పెరిగేలా చేస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ , వర్చువల్ ఇంటర్వ్యూల ద్వారా సమయాన్ని, డబ్బును ఆదా చేసుకుంటున్న కంపెనీలు ఇప్పడు వీడియో రెజ్యుమెలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ముఖ్యంగా క్రియేటివిటీ రంగంలో ఇప్పటికే విజ్యుమెలు బాగా ప్రాచుర్యం పొందాయి. రానున్న రోజుల్లో మిగతా రంగాలకు ఈ కొత్త మార్పు క్రమంగా విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్ధులు రిక్రూట్ మెంట్ ప్రాసెస్ లో వచ్చిన ఈ కొత్త మార్పుపై ఓ కన్నేసి ఎప్పుడూ అప్ డేట్ గా ఉంటే విజయం సాధించవచ్చు.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment