ఈ మార్పుతో 'తుప్పు' వదిలిపోద్దా?
భవిష్యత్ భాగ్యరేఖను మార్చే ఏదైనా ఒక పనిని దూరదృష్టితో, దీర్ఘకాలిక ప్రయోజనాలతో చేపట్టకుంటే అది పెను సంక్షోభానికి దారితీస్తుంది. అటువంటి ముందుచూపు లేని నిర్ణయాలు వ్యక్తికే కాదు దేశానికీ నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ మాటలు మన దేశంలో ఇంజినీరింగ్ విద్య దుస్థితికి అతికినట్టు సరిపోతాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు విద్యా విధానంలోని లోపాలు, పాలకులు అస్తవ్యస్థ నిర్ణయాలు వెరసి దేశానికి వెన్నుముక కావాల్సిన యంత్ర విద్యను అంపశయ్యపైకి చేర్చాయి. ప్రతీ ఏడాది ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న విద్యార్ధుల్లో నైపుణ్యాలు భూతద్దం పెట్టి వెతికినా కానరావడం లేదు. నైపుణ్యం లేకపోవడంతో అత్యున్నత డిగ్రీ చేతిలో ఉన్నా మంచి కొలువు రాక యువతరం నిరాశలో కూరుకుపోతోంది. ఈ దుస్థితికి చెక్ పెట్టేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ( ఏఐసీటీఈ) ఇటీవల కొన్ని విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రతీ ఏడాది ఇంజినీరింగ్ సిలబస్ లో మార్పులు చేయాలన్నది ఏఐసీటీఈ నిర్ణయాల్లో ఒకటి. అయితే సిలబస్ ను ప్రతీ ఏడాది మారిస్తే యంత్ర విద్యకు పట్టిన తుప్పు వదిలిపోతుందా? నాణ్యమైన ఇంజినీర్లను తయారు చేసేందుకు ప్రస్తుతం ప్రకటించిన చర్యలు సరిపోతాయా?
సిలబస్ మార్పుతో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయా?
ప్రస్తుతం మన దేశంలో 3,300 కి పైగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 8 లక్షల మంది విద్యార్ధులు ప్రతీ ఏడాది అడ్మిషన్ పొందుతున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్న విద్యార్ధుల్లో కేవలం 35 నుంచి 40 శాతం మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. నిపుణుల అవసరం ఉన్నా సరైన నైపుణ్యాలు లేని కారణంగా ఇంజినీరింగ్ పట్టభద్రులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. ఇంజినీరింగ్ విద్యలో నైపుణ్యాలు దారుణంగా పతనం కావడం, అటు మన అవసరాలకు తగిన నిపుణుల కొరత ఏర్పడటంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి,యంత్ర విద్యలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇక నుంచి ప్రతీ ఏడాది ఇంజినీరింగ్ సిలబస్ లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వెలువడుతోంది. సిలబస్ మార్పుతో ఇంజినీరింగ్ నాణ్యత పెరుగుతుందని, ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానం ఇంజినీరింగ్ లోనూ మంచి ఫలితాలనే ఇస్తుందని కొందరు చెపుతున్నారు. అయితే కొందరు నిపుణులు మాత్రం ఈ మార్పుపై పెదవి విరుస్తున్నారు. కేవలం సిలబస్ మార్పుతోనే ఇంజినీరింగ్ విద్యను ప్రక్షాళన చేయడం కుదరదని, నాణ్యమైన మౌలిక వసతులు లేకుండా మార్పు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో ఆచరణ కష్టమే!
ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఇంజినీరింగ్ సిలబస్ లో మార్పులు చేస్తున్నారు. కొత్తగా ఆయా కోర్సులకు సంబంధించి వచ్చిన మార్పులను సిలబస్ లో చేర్చడమే ఈ మార్పు. అయితే ఈ మార్పు అన్ని కోర్సుల్లోనూ ఉండదు. ఇప్పుడు ఏఐసీటీఈ ప్రతీ ఏడాది సిలబస్ ను మారుస్తానని చెపుతోంది. ఇది కొత్త తలనొప్పులు తెస్తుందనేది కొందరి వాదన. స్వయంప్రతిపత్తి కలిగిన ఐఐటీ, ఎన్ఐటీలకు ఈ విధానం సరిపోతుంది కానీ వందల సంఖ్యలో అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్న యూనివర్సీలకు ఇది కష్టమైన విషయమే. ముఖ్యంగా సప్లిమెంటరీ పరీక్షల విషయంలో చిక్కు వచ్చి పడుతుంది. యూనివర్సీల అనుబంధ కాలేజీల్లో ఒక ఏడాది విద్యార్ధి వార్షిక పరీక్షలో ఫెయిల్ అయితే మళ్లీ పాత సిలబస్ ప్రకారం సప్లిమెంటరీ పరీక్ష రాస్తాడు. ఇప్పుడు ప్రతీ ఏడాది సిలబస్ లో మార్పు చేస్తే విద్యార్ధి సప్లిమెంటరీ పరీక్ష ఏ సిలబస్ ఆధారంగా రాయాలన్నది చిక్కు ప్రశ్నగా మారుతుంది. ప్రస్తుతం మూడేళ్లకు ఒకసారి సిలబస్ మారిస్తేనే పరీక్షల విభాగం రికార్డుల నిర్వహణ కష్టంగా ఉందని యూనివర్సీటీలు చెపుతున్నాయి. ఇక ప్రతీ సంవత్సరం వీరు రికార్డులు ఏ విదంగా నిర్వహిస్తారోనన్నది గందరగోళంగా మారే పరిస్థితి ఉంది.
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తీసుకున్న నిర్ణయంపై ఐఐటీ అధ్యాపకులు కూడా పెదవి విరుస్తున్నారు. ప్రతీ ఏడాది సిలబస్ మారిస్తేనే అద్భుత ఫలితాలు వస్తాయనుకోవడం మంచిది కాదని చెపుతున్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యను నాణ్యతా లోపం పీడిస్తుందని ముందు దాన్ని సరి చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నది వారి వాదన. ముఖ్యంగా విషయంలేని అధ్యాపకులు వల్లనే ఇంజీనీరింగ్ విద్య భ్రష్టు పట్టిపోయిందని, అర్హులైన అధ్యాపకులను నియమించినప్పుడే నిజమైన ప్రక్షాళన మొదలైనట్టని వారు అంటున్నారు. ఈ వాదనను ఎవరైనా సమర్ధించాల్సిందే. నాణ్యమైన అధ్యాపకుల కొరతే యంత్ర విద్య దిగజారడానికి ప్రధాన కారణం. ఇక ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రయోగశాలల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా కాలేజీల్లో ల్యాబ్ లకు ఎప్పుడూ తాళాలు వేసి ఉంటాయన్నది ఒక ప్రధాన ఆరోపణ. ప్రయోగశాలలో అత్యాధునిక పరికరాలను సమకూర్చి విద్యార్ధులతో సొంతంగా ప్రాజెక్టులు చేయించినప్పుడే ఇంజినీరింగ్ విద్యకు తిరిగి జవసత్వాలు వస్తాయి. ఈ రెండు కీలక మార్పులు చేయకుండా మిగతా ఏ మార్పులు చేసినా అవి సరైన ఫలితాలను ఇవ్వవు.
సమస్య మూలంలోకి వెళ్లాలి
ఒక దేశ విద్యా విధానం ఎప్పుడూ ఆ దేశ అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. ఇందుకు అనుగుణంగా సిలబస్ లో దీర్ఘకాలిక ప్రయోజనాల ప్రతిపాదికగా మార్పు చెందుతున్న సాంకేతికకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసుకోవడం సహజమే. అలా కాకుండా సర్వరోగ నివారిణిలా సిలబస్ మార్పుతో అద్భుతాలు జరిగిపోతాయని ఆశించడం ఇప్పుడు సమస్యగా మారుతోంది.గడిచిన ఐదేళ్లుగా ఇంజినీరింగ్ విద్యలో పాతుకుపోయిన నాణ్యతాలోపాన్ని పాలకులు ఇప్పటికైనా గుర్తించడం మంచి పరిణామమే. అయితే సమస్యను పైపైన చూడకుండా మూలాల్లోకి వెళ్లినప్పుడే సరైన పరిష్కారం లభిస్తుంది. ప్రతీ ఏడాది పాఠ్యాంశాలను మార్చడం మంచి నిర్ణయమే అయినా అది సమస్యకు పూర్తి పరిష్కారం చూపదన్నది వాస్తవం. యంత్ర విద్య ప్రక్షాళనకు గతంలో చాలా సంస్థలు , నిపుణులు పరిష్కార మార్గాలను సూచించారు. ఇందులో అందరూ ముక్తకంఠంతో చెప్పింది. ప్రయోగశాలలకు పెద్ద పీట వేసి విద్యార్ధులకు ప్రాక్టికల్ గా విద్యను నేర్పినప్పుడే యంత్ర విద్య ఈ దుస్థితి నుంచి బయటపడగలుగుతుందని. వీటితో పాటు అర్హత కలిగిన నాణ్యమైన అధ్యాపకులు లేకుండా తీసుకునే మిగతా చర్యలు కూడా సత్ఫలితాలను ఇవ్వవు. ఈ రెండు విషయాల్లో రాజీ పడకుండా ప్రక్షాళన కార్యక్రమం చేపడితేనే వచ్చే ఐదేళ్లో మనకు నాణ్యమైన ఇంజినీర్లు తయారవుతారు. అది చేయకుండా కేవలం పాఠ్యాంశాల్లో మార్పులు చేసి ఫలితాలు కావాలంటే అది సాధ్యం కాని పని.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment