'లైట్ తీస్కో'..లేకుంటే లైఫే పోతుంది!
ఒత్తిడి అనేది మానవ జీవితంలోకి కొత్తగా వచ్చింది కాదు. అనాది నుంచి ఒత్తిడితో సహవాసం చేయడం మనిషికి అలవాటే. ఒత్తిడి మనుగడకు మూలం. ఒత్తిడి ఉన్నప్పుడే మనలోని అసలైన నైపుణ్యం బయటకు వస్తుంది. అయితే ఇదంతా ఒత్తిడి అదుపులో ఉన్నంతవరకే. అది అదుపు తప్పితే మానవ జీవితం అస్తవ్యస్థమే. ముఖ్యంగా అదుపు తప్పిన ఒత్తిడి కుంగుబాటుకు గురిచేస్తుంది. ఇప్పుడు యువతరానికి ఇదే అతిపెద్ద సవాలుగా మారింది. ఒత్తిడిని జయించలేక మన యువత జీవితంలో డీలా పడిపోతోంది. ప్రస్తుతం మన సమాజం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. విస్తరిస్తున్న పట్టణీకరణ సరికొత్త ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక వనరులకు బాటలు వేసింది. అయితే ఈ నయా అభివృద్ధి మన వ్యవస్థకు మంచినే కాదు ఎంతో చెడును కూడా మోసుకొచ్చింది. ముఖ్యంగా ఈ కొంగ్రొత్త ఆర్థిక వ్యవస్థలో మానవ సంబంధాలు, మానవీయ కోణాలు పతనం చెందుతున్నాయి. దీంతో శారీరక రుగ్మతలకు తోడు ఇప్పుడు మానసిక రుగ్మతలు కూడా విజృంభిస్తున్నాయి. అందులో ప్రధానమైనది డిప్రెషన్. కుంగుబాటుగా వ్యవహరించే ఈ మానసిక రుగ్మత ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా అందర్నీ ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా అధిక మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్ధులు, ఉద్యోగులు డిప్రెషన్ భాధితులుగా మారుతున్నారు. ఉద్యోగుల్లో , విద్యార్ధుల్లో ప్రతీ వందమందిలో 30 మంది డిప్రెషన్ బారిన పడుతున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు సమస్య ఎంత తీవ్రంగా ఉందో. మన విద్యావ్యవస్థకు మరో కొత్త సవాలుగా మారిన ఈ డిప్రెషన్ ను త్వరగా వదిలించకపోతే మన భవిష్యత్ యువతరం కుంగిపోక తప్పదు.
నిర్వీర్యమైపోతున్న యువతరం
ఇప్పుడిప్పుడే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఇండియాకు డిప్రెషన్ అనేది అతిపెద్ద సమస్యగా మారుతోంది. ఈ సరికొత్త పోటీ వ్యవస్థలో ఒత్తిడిని ఎదుర్కొలేక ఇటు విద్యార్ధులు అటు ఉద్యోగులు చిత్తయిపోతున్నారు. దాదాపు ఒక కోటి ఉన్న మన హైదరాబాద్ జనాభాలో 30 శాతం మంది డిప్రెషన్ తో భాధపడుతున్నారని సర్వేలు చెపుతున్నాయి. ఇందులో 15 నుంచి 29 ఏళ్ల లోపు యువకులే అధికంగా ఉన్నారన్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత మన విద్యా విధానం విద్యార్ధులపై ఒత్తిడిని పెంచే విధంగా ఉందన్న విమర్శలు అధికంగానే ఉన్నాయి. ఇక ఉద్యోగ జీవితంలో ఒత్తిడులు ఏమంత తక్కువ కావు. టార్గెట్ లు, అదనపు పని సమయాలు, ఆఫీస్ వాతావరణం ఇలా ఎన్నో విషయాలు ఉద్యోగిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అపరిమితంగా పెరిగిపోతున్న ఈ ఒత్తిడి ఇప్పుడు డిప్రెషన్ కు దారితీస్తోంది. ప్రతీ దానికీ చిరాకు పడటం, ఏ విషయంపై శ్రద్ధ లేకపోవడం, విపరీతమైన కోపం, నిద్రలేమి, ఆత్మన్యూనత, నలుగురితో కలవలేకపోవడం వంటివి డిప్రెషన్ లక్షణాలు.
త్వరగా మేల్కోకుంటే నష్టమే
డిప్రెషన్ ను నిర్లక్ష్యం చేస్తే అది ఆత్మహత్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. మన దేశంలో కుంగుబాటు సరిగా గుర్తించలేకపోవడం వల్లనే విద్యార్ధుల్లో, ఉద్యోగుల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. డిప్రెషన్ లక్షణాలు గుర్తించిన వెంటనే తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా చికిత్స చేయించాలి. కొందరు విదేశీ వైద్యులు డిప్రెషన్ ను యుద్ధం కంటే తీవ్రమైన సమస్యగా అభివర్ణించారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఇది ఎంత ప్రమాదకరమో. అయితే డిప్రెషన్ అనేది ప్రతీ మనిషి తన జీవితంలో అనుభవించేదే. అయితే అది తీవ్రతరం కాకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. సమస్యలపై అధికంగా ఆలోచించకుండా మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే పనులు చేస్తూ స్వాంతన పొందాలి. కొన్ని కేసుల్లో డిప్రెషన్ అనేది జన్యుపరంగా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లల్లో డిప్రెషన్ లక్షణాలు కల్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
తల్లిదండ్రులదే కీలక పాత్ర
చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ సమస్యను అయినా ధైర్యంగా ఎదుర్కొగలిగే విధంగా పెంచాలి. అలా చేయడం వలన వాళ్లు జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలకు భయపడకుండా ఉంటారు. దీంతో పాటు వారు పనిని , చదువును, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోగలిగేలా తర్ఫీదు ఇవ్వాలి. ఒకవేళ తమ పిల్లలు డిప్రెషన్ కు గురైతే తల్లిదండ్రులు వాళ్లతో అధిక సమయం కేటాయించాలి. వారి సమస్యను మూలం నుంచి అర్థం చేసుకుని వాళ్ల ఒంటరితనాన్ని పొగొట్టాలి. అటు ఉద్యోగులు కూడా డిప్రెషన్ లక్షణాలు తనలో ఉన్నాయని అనుకుంటే, వీలైనంత వరకూ స్నేహితులతో గడపాలి. కొత్త ప్రదేశాలు చూడటం, వ్యాయామం, మంచి పౌష్టికాహారం తీసుకోవడం వంటి చేస్తే దీని నుంచి చాలా త్వరగా బయటపడొచ్చు. యోగా, ధ్యానం చేస్తూ మంచి పుస్తకాలు చదివితే కుంగుబాటు మీ నుంచి దూరంగా పారిపోతుంది.
ఒత్తిడిని చిత్తు చేయాలి
రాతియుగపు ఆదిమ మానవుడి స్థాయి నుండి ఇతర గ్రహాలపై అడుగుపెట్టే దశకు చేరుకున్న సుదీర్ఘ ప్రయాణంలో మనిషి పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడం వల్లనే విజయం సాధ్యమైంది. అడవిలో క్రూరమృగాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి మన పూర్వీకులు ఎంత ఒత్తిడిని అనుభవించి ఉంటారు. అందులో వారు విజయం సాధించారు కాబట్టే ఇప్పుడు మానవ జాతి మనుగడ సాగించగలుగుతోంది. అటువంటి వారి వారుసులమైన మనం చిన్న చిన్న ఒత్తిడికే భయపడిపోయి మానసిక రుగ్మతలను కొనితెచ్చుకుంటున్నాం. ఈ పోటీ ప్రపంచంలో ఒత్తిడి అనివార్యం. ఆ ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలో ప్రతీ విద్యార్ధికి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే తెలియజేయాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒత్తిడి మంచిదే. ఒత్తిడి ఉన్నప్పుడే విద్యార్ధి, ఉద్యోగి అయినా వారిలో ఉన్న అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది. అయితే ఒత్తిడి మన అదుపులో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఒత్తిడిని అదుపు చేయడంలో విఫలం చెందామో అప్పుడు అది మన అంతం చూస్తుంది. ఈ విషయంలో విద్యార్ధులు, ఉద్యోగులు చిన్నతనం నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment