ఈ 'థ్రిల్లింగ్' కెరీర్ పై ఓ లుక్కేయండి.
భధ్రత....ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో అతి ముఖ్యమైన, అతి కష్టమైన విషయం. మంచి పక్కనే చెడు ఉంటుంది, సాంకేతికత సౌకర్యాలతో పాటు సవాళ్లను కూడా అందించింది. సాంకేతికంగా అభివృద్ధి చెందాక భధ్రతా పరిణామ క్రమం తాళాల నుంచి నెంబరింగ్ తాళాల వద్దకు చేరుకుని ప్రస్తుతం డిజిటల్ తాళాలు, ఫింగర్ ప్రింట్ తాళాల దగ్గర ఆగింది. మనిషి తన సౌకర్యం కోసం రూపొందించిన వస్తువులకు భద్రత కల్పించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మొదట్లో డబ్బు, బంగారం వంటివే విలువైనవి కానీ ఈ డిజిటల్ వరల్డ్ లో విజ్ఞానం వాటి స్థానాన్ని ఆక్రమించింది. టెక్నాలజీయే డబ్బులు కురిపిస్తుంది. కామధేనువు లాంటి ఆ టెక్నాలజీని భధ్రంగా చూసుకోవడమే అతిపెద్ద సవాలు. ఇప్పుడు మనం ఒక్క క్లిక్ తో మనీ ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. ఒక్క క్లిక్ తో బిల్లులు చెల్లించవచ్చు. ఒక క్లిక్ తో వస్తువులను కొనుగోలు చేయొచ్చు. డిజిటల్ విప్లవం వచ్చాక మనిషి రోజువారీ జీవితం మరింత సౌకర్యవంతంగా మారిపోయింది. ఈ డిజిటల్ ఆర్ధిక వ్యవస్థలో అవకాశాలు ఎన్ని ఉన్నాయో ప్రమాదాలు కూడా అన్నే ఉన్నాయి. దోపిడీకి కొత్త దారులు వెతుకుతున్నకేటుగాళ్లు ఇప్పుడు ఆన్ లైన్ లావాదేవీలపై దృష్టి సారించారు. ఇంటర్నెట్ ఆధారిత నగదు లావాదేవీలను అనుకూలంగా మార్చుకుంటూ ఆన్ లైన్ లోనే డబ్బులను దోచేస్తున్నారు. దీంతో డిజిటల్ భద్రత అనేది అత్యంత ముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఇదే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనే ఓ సరికొత్త కెరీర్ కు బాటలు వేసింది.
సౌకర్యాలతో పాటు ఇబ్బందులనూ తెచ్చిన డిజిటల్ విప్లవం
మన దేశంలో నెమ్మదిగా సాగుతున్న డిజిటల్ టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత వేగం పుంజుకుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్ లైన్ చెల్లింపులు, ఆన్ లైన్ నగదు బదిలీలతో పాటు డిజిటల్ వ్యాలెట్లు ఇలా సమస్త ఆర్ధిక లావాదేవీలు ఆన్ లైన్ లో జరిగిపోతున్నాయి. అయితే ఇక్కడే చిక్కు వచ్చి పడింది. ఆన్ లైన్ ద్వారా నగదు లావాదేవీలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన భధ్రతా చర్యలపై చాలామందికి సరైన అవగాహన ఉండటం లేదు. దీంతో విలువైన తమ డబ్బును మోసగాళ్లకు సమర్పించుకుంటున్నారు. ఇంటర్నెట్ ఆధారిత లావాదేవీల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి అనవసరపు నిర్లక్ష్యంతో డబ్బును పొగొట్టుకుంటున్నారు. ప్రతీ ఎలక్ట్రానిక్ పరికరంతో పాటు కంప్యూటర్లకూ ఇంటర్నెట్ అనుసంధానించి ఉండటం వలన మోసగాళ్ల పని సులువవుతోంది. మరోవైపు కీలక సమాచారం ఉండే ప్రభుత్వ కార్యాలయాలు, కంపెనీలపై హ్యాకర్ల దృష్టిపడింది. హ్యాకింగ్ ద్వారా ఆయా సమాచారాన్ని తస్కరించడం, తర్వాత దాన్ని అమ్ముకోవడం, బెదిరించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి.
సైబర్ సెక్యూరిటీతో మోసాలకు అడ్డుకట్ట
ఇలాంటి హ్యాకింగ్, ఫిషింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ వంటి సరికొత్త కెరీర్లు ఊపిరి పోసుకున్నాయి. ఇంటర్నెట్ ద్వారానే కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో కంపెనీలకు సైబర్ సెక్యూరిటీని పటిష్ఠం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వీరికి భారీ సంఖ్యలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు అవసరం పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు డిపార్ట్ మెంట్స్ కు సైబర్ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో గడిచిన రెండేళ్లుగా సైబర్ సెక్యూరిటీ కెరీర్ డిమాండ్ ఉన్న ఉద్యోగాల్లో ఒకటిగా నిలిచింది.ముఖ్యంగా డిజిటల్ విప్లవం ఊపందుకున్న ప్రస్తుతం తరుణంలో ఈ రంగంలో నిపుణులైన వారికి భారీ ఉద్యోగాలు వాటికి తగ్గట్టు వేతనాలు కూడా దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఏయేటికాయేడు విస్తరిస్తున్న ఈ కామర్స్ రంగానికి సైబర్ నిపుణుల అవసరం, కొరత రెండూ ఎక్కువగానే ఉన్నాయి.
సైబర్ సెక్యూరిటీ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ విప్లవాన్ని దూకుడుగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ అనేది కీలకమైన విషయంగా మారిపోయింది. ఈ రంగంలో ఉన్న అపారమైన ఉపాధి అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ కోర్సులను ప్రారంభించాయి. మన దేశంలో లెక్కకు మించి స్టార్టప్ లు అంకురిస్తున్న వేళ , వాటికి అవసరమైన నిపుణులను అందించేందుకు ఇవి సిద్ధమవుతున్నాయి. మన దేశంలో దాదాపు 4వేల వరకూ స్టార్టప్ లు ఉంటే అందులో కేవలం 100 కంపెనీలకు మాత్రమే సైబర్ సెక్యూరిటీ ఉంది. నిపుణులు అందుబాటులో లేక కొన్ని సంస్థలు ఇప్పటికీ ఆ దిశగా ఆలోచించడం లేదు.కానీ భధ్రత అత్యంత ముఖ్యం కాబట్టి రానున్న రోజుల్లో మిగతా కంపెనీలు కూడా దీనిపై దృష్టి పెడతాయి. వచ్చే ఒకటి రెండేళ్లలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల డిమాండ్ ను తీర్చేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభమయ్యాయి.
వచ్చే నాలుగేళ్లలో దాదాపు 10 లక్షల మంది సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ నిపుణుల అవసరముందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. అవసరాలకు తగ్గట్టు నిపుణులను తయారు చేసుకోవాలని కూడా సూచించింది. చైనాలో ప్రభుత్వ కార్యాలయాల్లో అక్కడి 1.25 లక్షల మంది సైబర్ నిపుణులను నియమించుకుంది. అదే మనదేశంలో ఆ సంఖ్య వెయ్యి కూడా దాటలేదు. మనకు సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఏ మేర ఉందో ఈ ఉదాహరణే తెలియజేస్తోంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కొత్త కొత్త కెరియర్లు ఊపిరి పోసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ విద్యార్ధులు ఈ కొత్త కెరియర్ లను అందిపుచ్చుకుంటే భవిష్యత్ బాగుంటుంది. అయితే ఈ కెరీర్ లోకి ప్రవేశించేముందు విద్యార్ధులు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కొత్త విషయాలను ఆస్వాదించగలిగే నేర్పు, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవగలిగే సామర్ధ్యం, విశ్లేషణా శక్తి ఉన్నవాళ్లకు ఈ కెరీర్ బాగుంటుంది. ఇలాంటి లక్షణాలు మీలో లేకుంటే ఈ కెరీర్ లో మనుగడ సాగించడం కష్టంగా ఉంటుంది.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135




Comments
Post a Comment