పే'రెంట్స్' పై కేసులు పెట్టాలి!?
ఒత్తిడి ఎక్కువైనప్పుడు అగ్నిపర్వతంలో ఉన్న లావా పెల్లుబికుతుంది. తన చుట్టుపక్కల ప్రాంతాలను నామరూపాలు లేకుండా నాశనం చేస్తుంది. ఎంతో పరిణితి చెందిన వ్యక్తులైనా ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఒక్కోసారి హద్దులు దాటి ప్రవర్తిస్తారు. అలాంటిది నూనూగు మీసాల టీనేజ్ పిల్లలు ఒత్తిడిని ఎలా అధిగమించగలరు? హైదరాబాద్ లో తాజాగా జరిగిన కాలేజీపై దాడి సంఘటన ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. టీనేజీ పిల్లల్లో పెరిగిపోతున్న మానసిక సంఘర్షణ, హింసాత్మకంగా మారుతుందంటే లోపం ఎవరిలో ఉంది? కేవలం మార్కులు తెచ్చుకునే యంత్రాలుగా వారిని తయారు చేసి తొక్కిపెడితే వారిలో మరిగిన లావా ఇలానే ఆగ్రహం రూపంలో బయటపడుతుంది. ఇటు తల్లిదండ్రులు, అటు కాలేజీలు మార్కులు మార్కులు అంటూ వాళ్లను నిరంతరం వేధించుకు తింటుంటే వారు ఇలా ప్రవర్తించడంలో ఆశ్చర్యమేమీ లేదు. విద్యార్ధులు హింసకు పాల్పడ్డారు. వాళ్లు వక్రమార్గం పట్టారు. అని గొంతు చించుకునే ముందు వాళ్లు ఎందుకు ఇలా ప్రవర్తించారు? వాళ్లు ఇంతలా రియాక్ట్ కావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అన్నది విశ్లేషించాల్సి ఉంటుంది.
విద్యా విధానమనేది విద్యార్ధుల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడాలి. కానీ కార్పోరేట్ విద్యలో విద్యార్ధుల నవనాడులు కుంగదీస్తూ, వాళ్లను మానసిక వికాసానికి దూరం చేస్తూ ,వీళ్లను ఆనందానికి దూరం చేస్తున్నారు. వీటన్నింటికి తోడు తల్లిదండ్రులు మార్కుల వెంట మూర్ఖంగా పరుగులు పెడుతున్నారు. పరీక్షల్లో మార్కుల గురించి ఆలోచిస్తున్నారు కానీ పిల్లల మనస్తత్వాల్లో వచ్చే మార్పులు కోసం ఆలోచించడం లేదు. పిల్లల మనసును అర్ధం చేసుకున్నప్పుడు పిల్లల్లో మార్పు వస్తుంది. మార్పు రావడం మొదలైతే మార్కులు రావడం మొదలవుతుంది. మార్కుల కోసం ప్రయత్నం చేయడం వలన అన్ని రకాల అభిరుచులకు దూరమవుతున్నారు. ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మార్కుల కోసం కాకుండా మార్పు కోసం పనిచేసేలా మన విద్యా విధానానంలో మార్పులు చేసుకోవాలి.
పే "రెంట్స్" గా మారితే ఫలితం ఇలానే ఉంటుంది!
భారతదేశంలో విద్యా వ్యవస్థ వివిధ దశల్లో పలు మార్పులకు గురైంది. మన దేశంలో మొదట గురుకుల విద్యా వ్యవస్థ ఉండేది. ఆ తర్వాత బ్రిటిష్ వారి పాలనలో మెకాలే విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత రెసిడెన్సియల్ విద్యా విధానం మొదలైంది. ఒక విద్యార్ధికి ఇంటి దగ్గర చదువుకునే పరిస్థితులు లేనప్పుడు, అతను విద్యకు దూరం కాకుండా ఉండేందుకు రెసిడెన్సియల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఇప్పటి తల్లిదండ్రులు తమ బాధ్యతలను వదిలించుకోవడానికి పేరెంట్స్ గా కాకుండా పే "రెంట్స్" గా తయారయ్యారు. తల్లి దండ్రులు ఏదో ఒక కాలేజీకి రెంట్ పే చేసి పే "రెంట్" గా ఉంటున్నారు. ఇక ఆ "రెంట్" కు తగిన ఫలితం చూపించాలన్న ఆత్రంతో కాలేజీలు విద్యార్ధలు మానిసిక వికాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎప్పుడో ఉదయం 6 గంటలకు మొదలైన తరగతి గదులు రాత్రి 9 గంటల నడుస్తూనే ఉంటాయి. ఇక విద్యార్ధి మానసిక ఉల్లాసాన్ని పొందే సమయమేది? వాళ్లు మనుష్యులు కారా? వాళ్లకు అభిరుచులు, ఆకాంక్షలు ఉండవా? ఇటువంటి తీవ్ర ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో విద్యార్ధులు మానసిక ఉల్లాసాన్ని కోరుకోవడంలో తప్పు లేదు.
ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన కాలేజీపై దాడి ఘటనలో ఎవరిని శిక్షించాలి. విద్యార్ధులనా? కానే కాదు. ఈ దాడి కారణంగా ఎవర్ని అయినా శిక్షింప దలుచుకుంటే ఆ శిక్ష పడాల్సింది తల్లిదండ్రులకే కానీ విద్యార్దులకు కాదు. భవిష్యత్ పై భయం లేకుండా రౌడీ మూకల మాదిరి ప్రవర్తించారు అంటే లోపం ఎక్కడ ఉంది? మన విద్యా విధానంలోనా? తల్లిదండ్రుల్లోనా? లేక కాలేజీ యాజమాన్యంలోనా? కాలేజీ ఆస్తులకు నష్టం కలిగిస్తే..శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే నేరం అవుతుందన్న విషయం ఆ విద్యార్ధులకు ఎందుకు తెలియలేదు. లోపం మరెక్కడో లేదు మన వ్యవస్థలోనే ఉంది. హత్యకు ఉపయోగించిన ఆయుధానికి శిక్ష వేసే చట్టం ఎక్కడైనా ఉండే అప్పుడు ఈ పిల్లలకు శిక్ష వేయండి. హత్య చేసిన మనిషికే కదా శిక్ష వేస్తారు.. ఆయుధానికి వేయరు కదా? ఈ పిల్లలు కేవలం ఆయుధం లాంటి వాళ్లే . ఈ ఆయుధాన్ని సరైన మార్గంలో పెట్టలేక పోయిన తల్లిదండ్రులది, కార్పోరేట్ విద్యా వ్యవస్థదే ఈ లోపం. వీళ్లు ఇలా దాడికి దిగడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. వాళ్లకు కావాల్సింది సాధించుకోవడానికి ఇలాంటివి చేసారు. ఈ దాడి నేపథ్యంలో పిల్లల మీద కేసులు పెడితే తెలిసీ తెలియని నూనూగు మీసాల వయసులో ఉన్న విద్యార్ధులు తమ విద్యార్ధి జీవితాన్ని కోల్పోవడమే కాక భవిష్యత్ ను కూడా కోల్పోతారు.
విద్యార్ధికి మానసిక భధ్రత కల్పించండి
కార్పోరేట్ కళాశాలకు విద్య పేరుతో వ్యాపారం చేయడమనేది సర్వసాధారణమైపోయింది. దీంతో పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇంత ఒత్తిడి ఉన్నప్పుడు వాళ్లు మానసిక ఆనందాన్ని కోరుకోవడం సహజమే. చదువును చదువుగానే నూరిపోయడానికి మార్గాలను వెతికితే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు. ఇలాంటి ఘటనలు వలన విద్యార్ధుల్లో అభధ్రతా భావం చోటు చేసుకుంటుంది. ముందుగా వాళ్లలో ఉన్న అభద్రతా భావాన్ని తొలిగించాలి. భద్రత అంటే చుట్టూ సెక్యూరిటీని పెట్టడం భద్రత కాదు. అతను అంతర్గతంగా భద్రత ఫీలవ్వాలి, నేను కొంత సేపు టీవీ చూడొచ్చు. కొంత సేపు ఫోన్ మాట్లాడొచ్చు. నెలలో కొన్ని రోజులు ప్రకృతితో మమేకం అయ్యే స్థితి ఉంది. ఇలాంటి మానసిక భద్రతనే విద్యార్ధి కోరుకుంటున్నాడు. అలాంటి మానసిక భధ్రత లేదు కాబట్టే అతను ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాడు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాలంటే విద్యార్ధుల మానసిక ఆనందాన్ని హరించకుండా, ఒత్తిడి పెంచకుండా, ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువకునే విధంగా మన విద్యా విధానంలో మార్పులు చేసుకోవాలి.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment