ఇంజినీరింగ్ చదువు.. బంట్రోతు ఉద్యోగం..!!
ఒక దేశానికి ఇంజినీరింగ్ ప్రతిభ అనేది బండికి ఇరుసు లాంటిది. అలాంటి ఇరుసే బలహీనంగా మారితే బండి పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు . అంతటి ముఖ్యమైన ఇంజినీరింగ్ విభాగాన్ని గడిచిన కొన్నేళ్లుగా చెదలు తొలిచేస్తున్నాయి. కొరవడిన ముందుచూపు, నాణ్యతకు పాతరేయడం తో పాటు అతి అంచనాలు వెరసి ఇంజినీరింగ్ విద్యను మరణశయ్యపైకి నెట్టి పడేశాయి. "పనికిరాని పల్లకీలు వంద ఉంటే ఉపయోగం ఏంటి" అన్న చందంగా లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్ధులు ఉన్నా అందులో నైపుణ్యం ఉన్నవారికోసం భూతద్దం పెట్టి వెతకాల్సిందే. మన పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చలేని ఇలాంటి పనికి రాని ఇంజీనీర్లను తయారు చేసిన పాపం ఎవరిది? మన విద్యా విధానానిదా? ప‌్రభుత్వాలదా? సొమ్ములు తప్ప విద్యార్ధి భవిష్యత్ పట్టని కాలేజీ యాజమాన్యాలదా? లేక చదువంటే ఇంజినీరింగ్ ఒక్కటే అన్నట్టుగా ఇంజినీరింగ్ పిచ్చి పట్టిన తల్లిదండ్రులదా?
ఇంజినీరింగ్ పట్టభధ్రులు ఇప్పుడు గుమస్తా ఉద్యోగాలకు కూడా క్యూ కడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. "తిలా పాపం తలా పిడికెడు" అన్నట్టుగా గొప్పదైన ఇంజినీరింగ్ విద్య ఈ దుస్థితికి దిగజారడంలో అందరిదీ పాత్ర ఉంది. ముఖ్యంగా మన అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన నిపుణులను తయారు చేయడంలో విఫలమైన మన విద్యా విధానమే ఇందులో ప్రథమ దోషి. నాణ్యతకు లేకుంటే ఏది దీర్ఘకాలం మనజాలదన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి మన విద్యా విధానం నేల విడిచి సాము చేసింది. ఫలితం లక్షలాది ఇంజినీరింగ్ విద్యార్ధులు ఇప్పుడు కేవలం గ్రాడ్యుయేట్లుగానే మిగిలిపోయారు. మరోవైపు బీఎస్సీ చదివిన గ్రాడ్యుయేట్లను తీసుకునేందుకు కంపెనీలు సిద్ధపడుతున్నాయి కానీ నైపుణ్యం లేని ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఖర్చు తగ్గింపు చర్యల్లో తలమునకలై ఉన్న కంపెనీలు భారీ వేతనాలు ఇచ్చి నైపుణ్యం లేని వారిని ఎందుకు ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి?
నైపుణ్యం ఉంటే రాచబాటే..!
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అందర్ని కంపెనీలు, సంస్థలు వ్యతిరేక భావంతో చూస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. వారికి ముఖ్యంగా కావాల్సింది నైపుణ్యం. అది విద్యార్ధుల దగ్గర లేదు కాబట్టే వారు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. నైపుణ్యం ఉన్న ఇంజినీరింగ్ విద్యార్ధులకు రెడ్ కార్పెట్ పరిచి భారీ వేతనాలు ఇచ్చేందుకు చాలా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అలా నైపుణ్యం ఉన్నవారిని రాచమర్యాదలు చేసి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. కానీ వారికి అటువంటి వారు దొరకడం లేదు. ఏవో కొన్ని కాలేజీలు, యూనివర్సిటీలు తప్పించి మిగతా కాలేజీల్లో నాణ్యత, నైపుణ్యం అనే మాటే లేదని కంపెనీలు వాపోతున్నాయి. రోజుకు వంద మందిని ఇంటర్వ్యూ నిర్వహిస్తే అందులో నైపుణ్యాలు ఉన్న వారిని వెతికిపట్టుకోవడం సవాలుగా మారిందని కంపెనీల హెచ్ఆర్ లు వాపోతున్నారు. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ తగిన నైపుణ్యాలు ఉండాలే కానీ ఉద్యోగాలకు కొదువ లేదని ప్రముఖ హెచ్ఆర్ నిపుణులు చెపుతున్నారు.
ఇంజినీరింగ్ విద్యలో ప్రక్షాళన !
ఇంజినీరింగ్ విద్యలో ఈ ఆందోళనకర పరిణామాలపై "అఖిల భారత సాంకేతిక విద్యా మండలి" (ఏఐసీటీఈ) ఎట్టకేలకు కొన్ని చర్యలు ప్రారంభించింది. నీట్ తరహా లోనే దేశంలోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీల ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలాని ఏఐసీటీఈ భావిస్తోంది. ఐఐటీలకు తప్ప ఇంజినీరింగ్, అర్కిటెక్చర్ ప్రవేశాలకు వచ్చే ఏడాది నుంచి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్నది ఏఐసీటీఈ ప్రణాళిక. దీంతో పాటు మరికొన్ని మార్పులు కూడా చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యలో ఐదేళ్లకు ఒకసారి సిలబస్ మార్పు జరిగేది. ఇకపై ప్రతీ ఏడాది పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తామని ఏఐసీటీఈ చెపుతోంది. అదే విధంగా భోధనా సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని తీసుకొస్తామని కూడా అంటోంది. ఏఐసీటీఈ చెప్పిన మార్పులు జరిగి ఇంజినీరింగ్ విద్యతో నాణ్యత పెరిగితే మంచిదే. కానీ చెప్పిన విషయాన్ని ఆచరణలో చేసి చూపించేందుకు చర్యలు చేపట్టినప్పుడే ఫలితాలు సిద్ధిస్తాయి. దేశంలో అన్ని వర్గాల వారికి నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అందించడం అదే సమయంలో మన పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నైపుణ్యం కలవారిని తయారు చేయడం అన్న జంట సవాళ్లను ఏఐసీటీఈ ఎలా అధిగమిస్తుందన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న.
ప్రణాళికలకు ఆచరణకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పటికే చాలా ప్రణాళికలు రచించినా ఆచరణలో విఫలం కావడం ఇంజినీరింగ్ విద్య ప్రస్తుత దుస్థితికి కారణం. రానున్న రోజుల్లో "మేకిన్ ఇండియా" నినాదాన్ని ముందుకు తీసుకు వెళ్లాలంటే సత్వరం చర్యలు చేపట్టాల్సిందే. దేశవ్యాప్తంగా ఉన్న 3,300 పైబడి ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల నుంచి ఏటా ఏడు లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్ధులు బయటకు వస్తున్నారు. ఇందులో ఐటీ, సాఫ్ట్ వేర్ మినహా చదివిన ఇంజినీరింగ్ మూల విభాగాల్లో కేవలం 7 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు సాధించగలుగుతున్నారని ఒక నివేదిక బయటపెట్టడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. ఇంజినీరింగ్ విద్యలో లోపాలను, జరగబోయే నష్టాలను ప్రొఫెసర్ ఎమ్మెస్ అనంత్ కమిటీ అప్పటి యూపీఏ ప్రభుత్వానికి విన్నవించింది. అయినప్పటికీ ప్రభుత్వ వర్గాల్లో కదలిక రాలేదు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇంజినీరింగ్ విద్యను ప్రక్షాళన చేయకుంటే భవిష్యత్ లో నాణ్యమైన నిపుణుల లేమితో ప్రపంచ ఆర్ధిక పోటీలో మన దేశం వెనకబడటం ఖాయం.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment