ఆ డిగ్రీ చదివారా? అయితే మీకు ఉద్యోగం రానట్టే..!
విద్య అనేది విజ్ఞానం సంపాదించుకునే సాధనం అయినప్పటికీ ఇప్పుడు విద్య యొక్క అంతిమ లక్ష్యం ఉపాధి. సరైన ఉపాధిని కల్పించలేని చదువులు ఈ కాలంలో మనగడ సాగించలేవు. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే విద్యార్ధులు ఉపాధికి బాటలు వేసే కోర్సులను చేయాల్సి ఉంటుంది. అయితే మన విద్యా విధానంలో లోపాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కలగలిపి విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. మొదట్లో అట్టహాసంగా కోర్సులను ప్రారంభించేయడం తర్వాత వాటి ఆలనా పాలనలను అటకెక్కించడం మన పాలకులకు పరిపాటిగా మారింది. దీని వలన చాలా మంది విద్యార్ధుల భవిష్యత్ అంధకారంగా మారుతోంది. తాజాగా వ్యవసాయ ఇంజినీరింగ్ పట్టభధ్రులు కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు బలిపీఠమెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఉద్యోగాలు రాకుంటే ఇక ఆ చదువులెందుకు?
ఒక విద్యార్ధి నాలుగేళ్ల పాటు కష్టపడి ఒక వృత్తి విద్యను ఎందుకు నేర్చుకుంటాడు? ఆ విద్య ద్వారా తన భవిష్యత్ ను అందంగా తీర్చిదిద్దే ఒక మంచి ఉపాధిని పొందాలన్నది ప్రతీ విద్యార్ధి అంతిమ లక్ష్యం. అయితే మన ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు, మన విద్యా విధానంలోని దార్శినికత లోపం విద్యార్ధి పాలిట శాపంగా మారుతున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ ఇంజినీరింగ్ చదివిన విద్యార్ధులు. అగ్గికల్చరల్ ఇంజినీరింగ్ పట్టాతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్నవారి కలలు కల్లలుగా మారాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి, అక్రిడిటేషన్ రాలేదన్న కారణంతో తెలంగాణాలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కమర్షియల్ అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్ మెంట్, ఫుడ్ సైన్స్ డిగ్రీ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి రద్దు చేశారు. దీంతో గతంలో ఈ డిగ్రీ కోర్సుల్లో చదివిన విద్యార్ధుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది.
విద్యార్ధుల గోడు వినే నాథుడేడి?
మన దేశ ఆర్ధిక రంగంలో వ్యవసాయ రంగానిదే ప్రధాన వాటా. అయితే దురదృష్టవశాత్తూ ఆది నుంచి మన పాలకులు వ్యవసాయ రంగంపై శీతకన్ను వేస్తూనే వస్తున్నారు. వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యం తగదని నివేదికలు చెపుతున్నాఆ మాటలు వారి చెవికెక్కడం లేదు. ప్రస్తుతం వ్యవసాయ రంగం క్షేత్రస్థాయిలో తీవ్రమైన నిపుణుల కొరత ఉంది. అందుకు అనుగుణంగా కొన్ని యూనివర్సిటీల్లో వ్యవసాయ డిగ్రీలకు శ్రీకారం చుట్టారు. కానీ వాటిని ఇప్పుడు ఐసీఏర్ గుర్తింపు లేదన్న కారణంతో ఇలా అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు. దీంతో ఈ కోర్సులు చదివిన విద్యార్ధులు ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమవుతున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించలేక ఇటు ఆ కోర్సు ఆధారంగా ఇతర రంగాల్లోకి వెళ్లలేక విద్యార్ధులు ఆవేదన చెందుతున్నారు. అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, డిగ్రీ చదివిన విద్యార్ధులు చాలామంది 10 వేల రూపాయల లోపు జీతాలకు పనిచేస్తూ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.
బుట్టదాఖలవుతున్న సిఫార్సులు
కమర్షియల్ అగ్రికల్చరల్ - బిజినెస్ మేనేజ్ మెంట్, డిగ్రీ ఫుడ్ సైన్స్ చేసిన విద్యార్ధులకు తెలంగాణా మార్కెటింగ్ శాఖ లో ఉద్యోగాలకు అర్హత కల్పించాలని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇప్పటికీ ఈ కోర్సులు కర్ణాటక ,కేరళ రాష్ట్రాల్లోని కొన్ని యూనివర్సిటీల్లో కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ పోస్టులకు ఈ కోర్సులు చెల్లవని అధికారులు అడ్డుకుంటున్నారు. తాజాగా వ్యవసాయ విస్తరణా అధికారి (ఏఈఓ) పోస్టుల భర్తీకి వ్యవసాయ ఇంజినీరింగ్ డిగ్రీ చెల్లదని అధికారులు అడ్డుపుల్ల వేశారు. ఈ నేపథ్యంలో ఏఈఓ పోస్టుల్లో వ్యవసాయ ఇంజినీరింగ్ అభ్యర్ధులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని జయశంకర్ యూనివర్సిటీ సిఫార్సు చేసింది. ప్రతీ 100 పోస్టులలో 10 వ్యవసాయ ఇంజినీరింగ్ వారికి, 50 పోస్టులు వ్యవసాయ డిప్లొమా అభ్యర్ధులకు, మిగిలిన 40 పోస్టులు బీఎస్సీ అగ్రికల్చరల్ ఉత్తీర్ణులకు కేటాయించాలని తెలంగాణా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫార్సులపై ప్రభుత్వం ఇంతవరకూ ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు.
ఉద్యోగాలు రాని కోర్సులను ఎందుకు ప్రవేశపెడుతున్నారు?
యూనివర్సిటీల్లో కోటి ఆశలతో చదువుతున్న విద్యార్ధుల జీవితాలతో ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయి. అదీ ప్రభుత్వ యూనివర్సిటీల్లోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇక విద్యార్ధులు ఎక్కడ చదువుకోవాలి? ఎవర్ని నమ్మాలి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ముందుచూపుతో వ్యవహరించకపోవడం విద్యార్ధుల పాలిట శాపంగా మారుతోంది. ఎవరో చేసిన తప్పులకు విద్యార్ధుల బంగారు భవిష్యత్ అగమ్యగోచరంగా తయారవుతోంది. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా విద్యార్ధుల భవితకు భరోసానిచ్చే కోర్సులు ప్రవేశపెట్టినప్పుడే మన విద్యా వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుంది.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment