పిల్ల‌లు బాగా చ‌ద‌వాలంటే గ‌ట్టిగా కొట్టాల్సిందేనా?

టీచ‌ర్ల దాడుల‌తో బిక్క‌చ‌చ్చిపోతున్న చిన్నారులు
       
        ఏదైనా తప్పు చేస్తే పిల్ల‌ల‌పై కోపగించుకోవ‌డం..వాళ్ల‌ను కాస్త అదుపులో పెట్టాల‌నుకోవ‌డం స‌హ‌జ‌మే. కొన్ని సంద‌ర్భాల్లో వాళ్లు మ‌రీ మితిమీరిన‌ప్పుడు చిన్న దెబ్బ వెయ్య‌డం కూడా జ‌రుగుతుంది. ఇది ఎప్పుడైనా, ఏ కాల‌మాన ప‌రిస్థితుల‌లోనే అంద‌రూ త‌ల్లిదండ్రులు, టీచ‌ర్లు చేసే ప‌నే. కానీ ఇటీవ‌లి కాలంలో చోటుచేసుకుంటున్న కొన్ని సంఘ‌ట‌న‌లు పిల్ల‌ల‌పై టీచ‌ర్లు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు, దండిస్తున్న విధానంపై విమ‌ర్శ‌లు చెల‌రేగేలా చేశాయి. స్కూళ్ల‌లో పిల్లల‌ను క‌ర్క‌శంగా కొడుతున్న వార్త‌లు తాజాగా ఎక్కువ‌గా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అస‌లు పిల్ల‌ల‌ను అంత దారుణంగా హింసించ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం. అస‌లు ఎందుకు ఇలా జ‌రుగుతోంది అన్న దానిపై విద్యావేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మొన్న క‌రీంన‌గ‌ర్, నిన్న హైద‌రాబాద్ ఊరు ఏదైనా, ప్రాంతం ఏదైనా త‌మ‌కు కొట్ట‌డం మాత్ర‌మే వ‌చ్చు అన్న రీతిలో కొంద‌రు టీచ‌ర్లు రెచ్చిపోతున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో పిల్ల‌లు చేతుల‌కు, కాళ్ల‌కు ఫ్రాక్చ‌ర్స్ కూడా అవుతున్నాయంటే అర్ధం చేసుకోవ‌చ్చు ఆ టీచ‌ర్స్ త‌మ క్రూర‌త్వాన్నిఏ రేంజ్ లో చూపించారో. 



హ‌ద్దులు దాటుతున్న దండ‌న‌! 


   టీచ‌ర్ అంటే త‌ల్లిదండ్రుల త‌ర్వాత అంత ఉన్న‌త‌మైన స్థానం. ప్ర‌స్తుత మంచి స్థితిలో ఉన్న చాలా మంది త‌మ టీచ‌ర్ల చ‌లువ వ‌ల్ల‌నే ఈ స్థితిలో ఉన్నామ‌ని చెపుతారు. అంటే అప్ప‌ట్లో టీచ‌ర్స్ పిల్ల‌ల‌ను దండించ‌లేద‌ని కాదు. ప్రేమ‌తో, హ‌ద్దుల‌తో కూడిన దండ‌న ఉంటే పిల్ల‌వాడు ఎప్పుడూ టీచ‌ర్ ని ప్రేమిస్తాడు.  అయితే ఇప్పుడు అలాంటి టీచ‌ర్లు క‌ర‌వైపోతున్నారు. వృత్తిని ప్రేమించే వారు కాకుండా కేవ‌లం ఉపాధి కోసం కోసం మాత్ర‌మే ఉపాధ్యాయ వృత్తిలోకి వ‌స్తున్న వారి వ‌ల్ల‌నే ఇలాంటి దుష్ఫ‌లితాలు క‌లుగుతున్నాయి. పిల్ల‌ల‌ను ప్రేమించే గుణం లేని వారు, క్రూర స్వ‌భావం ఉన్న వాళ్లు ఎంతో ఉన్న‌త‌మైన ఉపాధ్యాయ వృత్తిలోకి రావ‌డం ప‌రిస్థితిని దిగజారుస్తోంది. పిల్ల‌లు తీవ్రంగా గాయ‌ప‌డేలా కొట్టి మాన‌సిక ఆనందం పొందే వారిని క‌ఠినంగా శిక్షించాల్సిందే. ఈ విష‌యంలో బాలల హ‌క్కుల కార్య‌కర్త‌లు స్కూళ్ల‌లో అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తే ప‌రిస్థితిలో ఏమైనా మార్పు వ‌స్తుందేమో. మ‌రోవైపు ప్ర‌భుత్వం కూడా దీనిపై స‌రైన చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్పుడు ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉంటాయి. సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు హడావుడి చేసేసి త‌ర్వాత ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే పిల్ల‌ల‌పై టీచ‌ర్లు దాడులు పెరుగుతూనే ఉంటాయి. మ‌న పురాణాల్లో చెప్పిన‌ట్టు ఏదైనా విష‌యాన్ని చెప్పేందుకు సామ, దాన‌, బేధ‌, దండో పాయాలు ఉంటాయి. మ‌రి పిల్ల‌ల విష‌యంలో కొంద‌రు టీచ‌ర్లు దండోపాయాన్నే ఎందుకు ఉప‌యోగిస్తున్నారు? అంటే వాళ్ల‌కు పిల్ల‌ల‌కు స‌రిగ్గా చెప్ప‌గ‌లిగే మాన‌సిక సామ‌ర్ధ్యం లేన‌ట్టు. 



పాఠ‌శాల యాజ‌మాన్యాల‌కు లాభాలే ప‌ర‌మావ‌ధి


      విద్యార్ధుల‌పై జ‌రుగుతున్న ఈ క్రూర‌త్వం విష‌యంలో టీచ‌ర్ల త‌ర్వాత దోషులు ఎవ‌రంటే స్కూల్ యాజ‌మాన్యాలు. ఏదో కంపెనీ న‌డిపిన‌ట్టుగా లాభాలు, డివిడెండ్ లు అంటూ చూసుకుంటున్నారు త‌ప్ప స్కూల్ నిర్వ‌హించ‌డంలో అత్యంత ముఖ్య‌మైన నైతిక‌త అనే దానికి వాళ్లు నీళ్లు వ‌దిలేసారు. టీచ‌ర్లు త‌క్కువ జీతానికి వ‌స్తున్నారా అని చూసుకుంటున్నారు కానీ ఆ టీచ‌ర్ మాన‌సిక స్థితి ఏంటి? పిల్ల‌ల‌తో ప్ర‌వ‌ర్తించే విధానం ఎలా ఉంది? అన్న విష‌యాల‌ను అధిక శాతం స్కూల్ యాజ‌మాన్యాలు అస‌లు ప‌ట్టించుకోవ‌డ‌మే మానేసాయి. దేశ భ‌విష్య‌త్ ను త‌యారు చేస్తున్న క‌ర్మాగారాలు అని మ‌ర్చిపోయి డ‌బ్బును సంపాదించుకునే యంత్ర‌శాల‌గా పాఠ‌శాల‌ల‌ను మార్చేసారు. 

త‌ప్పందా టీచ‌ర్ల‌దేనా? త‌ల్లిదండ్రుల‌కు ఈ త‌ప్పులో వాటా లేదా? 


       పిల్ల‌ల‌పై పెరిగిపోతున్న ఈ హింసకు టీచ‌ర్ల‌ను, యాజ‌మాన్యాలు మాత్ర‌మే బాధ్యులా? ఇందులో ఇంకెవ‌రూ లేరా? అంటే ..ఉన్నారు అనే చెప్పాలి వ‌స్తుంది. ఇద్ద‌రు పెద్ద‌ దోషుల‌తో పాటు ఉన్న ఆ మ‌రో దోషి త‌ల్లిదండ్రులు. ప్ర‌స్తుత స‌మాజంలో భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఉద్యోగం చేస్తున్నారు. దీంతో వాళ్లు పిల్ల‌ల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డిపేందుకు తీరిక కుద‌ర‌టం లేదు.  అవ‌కాశం లేకుండా పోతోంది. దీనికి తోడు ఆర్థిక ప‌రిమితులు దృష్ట్యా చాలా మంది త‌ల్లిదండ్రులు ఒక‌రు లేదా ఇద్ద‌రు పిల్ల‌ల‌నే క‌లిగి ఉంటున్నారు. ఒకవైపు ఉద్యోగ బాధ్య‌త‌లు పెరిగిపోవ‌డంతో పిల్ల‌ల‌ను మంచి స్కూళ్ల‌లో జాయిన్ చేస్తే త‌మ‌కు కొంచెం భారం త‌గ్గుతుంద‌ని భావిస్తున్నారు. అయితే స్కూళ్ల‌లో త‌మ పిల్ల‌ల‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌పై కానీ, టీచ‌ర్ల వ్య‌క్తిత్వంపై కానీ దృష్టి సారించ‌డం లేదు. దీంతో పిల్ల‌లు బాధ‌ను అనుభ‌విస్తున్నారు. 



మార్జాల కిశోర న్యాయం కొర‌వ‌డింది! 


       మ‌న విద్యా విధానంలో రెండు న్యాయాల‌ను మ‌నం అన్వ‌యించుకోవ‌చ్చు. అందులో మెద‌టిది మార్జాల కిశోర న్యాయం రెండోది మ‌ర్క‌ట కిశోర న్యాయం మూడోది భ్ర‌మ‌ర కిశోర న్యాయం. మార్జాల కిశోర న్యాయం అంటే...పిల్లి అప్పుడే పుట్టిన త‌న పిల్ల‌ల‌ను నోటితో జాగ్ర‌త్త‌గా ప‌ట్టుకుని వివిధ ప్రదేశాలు మారుస్తుంది. ఈ క్ర‌మంలో నోటి నుంచి ప‌ట్టు త‌ప్పి పిల్ల ప‌డిపోతే ఆ త‌ప్పు పిల్లిదే. ఇక మ‌ర్క‌ట కిశోర న్యాయం అంటే కోతి త‌న పిల్ల‌ల‌ను పోషిస్తున్న‌ప్పుడు త‌ల్లి కోతిని పిల్ల‌లే గ‌ట్టిగా ప‌ట్టుకుని ఉంటాయి. ఇందులో పిల్ల కింద ప‌డిపోతే అది కోతి పిల్ల త‌ప్పే.  ఇక్క‌డ మ‌నం తీసుకోవాల్సింది మార్జాల కిశోర న్యాయాన్ని. ఒక‌టో తర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కూ పిల్ల‌లు బాధ్య‌త పూర్తిగా త‌ల్లిదండ్రులు, టీచ‌ర్లదే. వారిని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాల్సింది వాళ్ల‌ను స‌రైన దారిలో పెట్టాల్సింది వీళ్లిద్ద‌రే. ఈ ద‌శ‌లో పిల్ల‌లు ఏ త‌ప్పు చేసినా దాన్ని త‌ల్లిదండ్రులు, టీచ‌ర్ల త‌ప్పుగానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. ఒక విద్యార్ధి గొప్ప‌వాడిగా మార‌డానికి, ప‌నికిరాని వాడిగా మార‌డానికి ఈ ద‌శ‌లోనే బీజం ప‌డుతుంది. ఇంత‌టి కీల‌క‌మైన ఈ ద‌శ‌లో పిల్ల‌వాన్ని హింసించి వాళ్ల మాన‌సిక ప‌రిస్థితిని దెబ్బ‌తీయడం నిజంగా నేరం. ఈ విష‌యంలో త‌ల్లిదండ్రులు ఎక్కువ శ్ర‌ద్ధ తీసుకోవాలి. ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కూ వాళ్ల‌తో గ‌డిపే స‌మ‌యాన్ని పెంచ‌డం, వాళ్ల‌కు మాన‌సికంగా ఆనందాన్ని ఇచ్చే విద్య‌ను నేర్ప‌డం వాళ్ల విధి. ఈ ద‌శ‌లో విద్యార్ధి అప‌జ‌యం పొందితే అది కచ్చితంగా ఆ త‌ల్లిదండ్రుల‌కే వ‌ర్తిస్తుంది. 




పిల్ల‌ల‌పై హింస‌ను అరిక‌ట్టేందుకు ఏం చేయాలి 

  •  టీచ‌ర్లు పిల్ల‌ల‌ను తీవ్రంగా హింసించిన త‌ర్వాత త‌ల్లిదండ్రులు మేల్కొంటున్నారు కానీ అంత కంటే ముందు వారి బాధ్య‌త‌ల‌ను స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌డం లేదు. ముఖ్యంగా టీచ‌ర్ చిన్న పిల్ల‌ల‌తో ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్న విష‌యాన్ని కొన్ని రోజులు ప‌రిశీలించాలి. రోజులో త‌ల్లిదండ్రుల‌తో గ‌డిపినంత స‌మ‌యాన్ని పిల్ల‌లు టీచ‌ర్ తో గ‌డుపుతారు. అలాంటి టీచ‌ర్ వ్య‌క్తిగ‌తంగా ఎలా ఉంటారన్న విష‌యాన్ని గ‌మ‌నించాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌దే. 


  •  టీచ‌ర్ల గ‌త చ‌రిత్ర‌ను స్కూల్ యాజ‌మాన్యాన్ని అడిగి తెలుసుకోవాలి. వారి విద్యార్హ‌త‌ల‌తో పాటు వారి నైతిక‌త కూడా చాలా ముఖ్యం. 
  •  ఒకవేళ ఫ‌లానా టీచ‌ర్ తో ఇబ్బందిప‌డుతున్నాం అని పిల్లలు చెపితే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వారు చెప్పింది నిజ‌మా కాదా అన్న‌ది త‌ల్లిదండ్రులే తేల్చాల్సి ఉంటుంది. టీచ‌ర్ పిల్ల‌ల‌తో క్రూరంగా ప్ర‌వ‌రిస్తున్న‌ట్టు రూఢీ అయితే ఆ విష‌యంపై స్కూల్ యాజ‌మాన్యాన్ని ఓ సారి హెచ్చ‌రించాలి. 
  •  ఇక ప్ర‌భుత్వం కూడా ప్ర‌యివేట్ స్కూళ్ల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ‌ను క‌ట్టుదిట్టం చేయాలి. క‌నీసం బాల‌ల హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు అయినా పిల్ల‌ల‌కు ఉన్న హ‌క్కులు, వారిపై క్రూరంగా ప్ర‌వ‌ర్తిస్తే ఎదుర్కొవాల్సిన ప‌రిణామాల‌ను టీచ‌ర్ల‌కు వివ‌రించాలి. 
  •  ఏదో ఒక ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు హ‌డావుడి చేసి వ‌దిలేయ‌డం కాకుండా చిత్త‌శుద్ధితో పిల్ల‌ల‌పై జ‌రుగుతున్న హింస‌ను అరిక‌ట్టాలి. 




           త‌ల్లిదండ్రుల త‌ర్వాత ఓ పిల్ల‌వాడిని మంచి పౌరునిగా తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త టీచ‌ర్ల‌పై ఉంటుంది. పిల్ల‌లు అన్నాక కాస్త అల్ల‌రి చేస్తారు అది అదుపులో ఉండే చిన్న చిన్న హెచ్చ‌రిక‌తో వారికి దారికి తేవాలి కానీ అత్యంత క‌ర్క‌శంగా వారిని దండించ‌డం నేరం. ఇలా శారీర‌క హింస‌కు గురైన పిల్ల‌ల్లో పెద్ద‌వాళ్లు అయ్యాక కూడా వారిలో ఒక ర‌క‌మైన ఆందోళ‌న‌, ద్వేష భావం అలానే ఉండిపోతాయి. ఈ విష‌యాన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించి త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను త‌గిన స్కూళ్ల‌లో జాయిన్ చేయాల్సి ఉంది. 

ఈ ఫీచ‌ర్ పై  గైడెన్స్ కావాల్సిన వారు క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరచ్చు.
97006 09135



You can send your Educational related articles to  careertimes.online1@gmail.com






Comments

Popular posts from this blog

అదృష్టాన్ని జేబులో పెట్టుకు తిరగడం ఎలా?

24.."టైం మిష‌న్"..!

ఈ 'కెరీర్' తో కంపెనీకి, మీడియాకు మధ్య వారధి మీరే కావచ్చు!!