వారసత్వ ఉద్యోగాలు సబబేనా?
కారుణ్య నియామకాలపై మొదలైన కొత్త చర్చ
రాజులు, రాజ్యాలు అంతరించినా కొన్ని వారసత్వ వాసనలు మాత్రం మన సమాజాన్నిఇంకా వీడిపోవడం లేదు. స్వాతంత్రం వచ్చి 69 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ కొన్నివిధానాలు మన పాలనా తీరును ప్రశ్నిస్తున్నాయి. రిజర్వేషన్లతో పాటు వారసత్వ వంటి విషయాలపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి విషయాలపై అనుకూల, వ్యతిరేక వర్గాల వాదనలు ఎలా ఉన్నా ప్రస్తుత సామాజిక దృక్కోణంలో చూస్తే చాలా విషయాలు చర్చనీయాంశంగా ఉన్నాయి. తాజాగా హైకోర్టు ముందుకు వచ్చిన వారసత్వ ఉద్యోగాల అంశం ఈ చర్చను మరింత బలంగా మార్చింది. ఈ విషయంలో హైకోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మన విధానాల్లో లోపాలను, లొసుగులను ఎత్తి చూపే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్నది నిపుణుల మాట.
హైకోర్టు ఏం చెప్పింది
తాజాగా సింగరేణి కాలరీస్ కు సంబంధించి ఒక హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సింగరేణి కాలరీస్ లో కారుణ్య నియామకాలకు వెలువడిన నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ ఈ వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
- వారసత్వ ఉద్యోగ పథకాలు సరికాదు. వారసత్వం పేరుతో టోకున ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం కుదరదు.
- ఉద్యోగులు శారీరకంగా అనర్హులని వైద్యపరంగా నిర్ధారించాక వారి కుటుంబాలకు ప్రయోజనం కల్పించొచ్చు కానీ అలా కాకుండా ఒకేసారి భారీ సంఖ్యలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం సరికాదని చెప్పింది.
- ఇలా చేస్తే ప్రతీ ఉద్యోగీ తన వారసునికి తన ఉద్యోగాన్ని బదిలీ చేయాలనే కోరుకుంటాడు. ఇది మంచి పరిణామం కాదని వెల్లడించింది.
- అదే విధంగా కారుణ్య నియామకాల్లో పారదర్శకత పాటించాలన్న సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది.
కారుణ్య నియామకం..ఈ పేరు వింటేనే అర్ధమవుతోంది. విపత్కర పరిస్థితుల్లోనే ఉద్యోగి కుటుంబ సభ్యులకు సరైన ఆసరా కల్పించడం కోసమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని. అయితే రోజులు మారుతున్న కొద్దీ కారుణ్య నియామకం అనేది తప్పుదారి పట్టిన ఒక లాభసాటి కార్యక్రమంగా మారిపోయింది. రాజకీయ నాయకులు, మధ్యవర్తులు పబ్బం గడుపుకునే విషయంగా తయారైంది. రాజకీయ నాయకులు ఆచరణ సాధ్యం కాని హామీలలో కారుణ్య నియామకాలను కూడా ఒక భాగంగా చేసుకున్నారు. ఇక మధ్యవర్తులకు ఇది డబ్బులు సంపాదించి పెట్టే బంగారు బాతుగా మారిపోయింది. కారుణ్య నియామకాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో మోసాలు చోటు చేసుకున్నాయి. ఉద్యోగం గ్యారంటీ అంటూ దళారులు అభ్యర్ధుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. పోనీ ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా పారదర్శకంగా వ్యవహరిస్తుందా అంటే అదీ లేదు. హామీలు ఇచ్చేయడం, తర్వాత కోర్టులు అడ్డుకట్ట వేయడంతో చేతులెత్తేయడం.
వారసత్వ ఉద్యోగ పథకాలపై ఎందుకీ వ్యతిరేకత!
ఇప్పటికే మన దేశంలో రిజర్వేషన్లపై ఎప్పటికప్పుడు ఎడతెగని వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. రిజర్వేషన్లపై అనుకూల వ్యతిరేక వర్గాలు ఈ విషయంపై నిరంతరం గొడవలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు వారసత్వ ఉద్యోగ పథకాలు కూడా కాస్త అదే విధంగా మారిపోయాయి. వీటి ద్వారా లబ్ది పొందే వారు సమర్ధిస్తుంటే ,తాము తీవ్రంగా నష్టపోతున్నామని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే అవి కులాల ఆధారంగా ఉండవు. ప్రాంతం ఆధారంగా ఉంటాయి. మన దేశంలో మాత్రం కులాల ఆధారంగానే రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక వారసత్వ ఉద్యోగాల విషయానికొస్తే ...తమ పొలం, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించినపుడు అభ్యంతరాలు రావు. ఎందుకంటే అది న్యాయం కనుక. అదే విధంగా ఉద్యోగి తన విధులు నిర్వర్తించలేని విధంగా వైద్య పరంగా అనర్హుడైనప్పుడు సంస్థ వారి కుటుంబానికి ఆసరా కల్పించేందుకు నియామకం చేపడితే కూడా అది న్యాయమైనదిగానే పరిగణించబడుతుంది. కానీ టోకున నోటిఫికేషన్ ఇచ్చివారసత్వ నియామకాలు చేపట్టడం సరైన విధానం కాదన్నది నిపుణుల మాట.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన వారు ఈ క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment