ఉద్యోగం కోసమే చదివితే లైఫ్ గల్లంతే!
జీవిత నైపుణ్యాలు లేక తడబడుతున్న విద్యార్ధులు
చదువులు అంటే ఇంజినీరింగ్, మెడిసిన్ లేనా?
ముందస్తుగానే మొదలైపోతున్న సన్నాహాలు
మార్పుకు సమయం ఆసన్నమైంది
జీవితంలో ఏమైనా సాధించాలంటే పోరాటతత్వం కావాలి. అది వ్యక్తిగత జీవితమైనా కావచ్చు వృత్తిగత జీవితమైనా కావచ్చు. ఈ రెండింటిలో ఏ ఒక్క దాంట్లో సరిగ్గా వ్యవహరించలేకుంటే జీవితం అస్తవ్యస్తమవుతుంది. మంచి ఉద్యోగం ఉన్నా మనుష్యులతో వ్యవహరించే విధానం, భావోద్వేగాలను అదుపు చేసుకునే నేర్పు లేకపోతే అది విజయవంతమైన జీవితం అనిపించుకోదు. సమాజం, సాటివారితో ఎలా వ్యవహరించాలన్న విషయాలను నేర్చుకోకపోతే జీవితంలో ఎదురుదెబ్బలు తినాల్సి ఉంటుంది.
దురదృష్టవశాత్తూ మన దేశంలో విద్యార్ధులకు జీవిత నైపుణ్యాలు చెప్పే నాధుడు లేక పరిస్థితి రోజురోజుకీ జఠిలంగా మారుతోంది. సమస్యలకు స్పందించే విధానం తెలియక, వ్యక్తిగత, వృత్తి జీవితాలను సమన్వయం చేసుకోలేక చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆత్మహత్యలు, కుటుంబాల విచ్ఛిన్నం వంటి విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమకు నచ్చింది చదవలేక ఉద్యోగం కోసం మూస కోర్సుల్లో చేరినప్పుడే మొదలైన ఈ సమస్య ఇప్పుడు పెను విపత్తుగా మారుతోంది.
చదువులు అంటే ఇంజినీరింగ్, మెడిసిన్ లేనా?
ఇంజినీరింగ్, మెడిసిన్ ఎంట్రన్స్ ఇవే మన దేశ విద్యా విధానంలో ముఖ్యమైన విషయాలు. అయితే ఇప్పుడు ఈ రొటీన్ పరీక్షలకు ఆవల ఉన్న సరికొత్త విద్యా విధానాన్ని గూర్చి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. విద్య అనేది ప్రతీ వ్యక్తి జీవితంలోనూ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో విద్య ప్రాముఖ్యత మరింత పెరిగింది. మంచి విద్య ఉంటే మంచి జీవితానికి ఢోకా లేదని అందరూ నమ్ముతున్నారు. మంచి పేరున్న యూనివర్సిటీలో చదివితే మంచి ఉన్నత ఉద్యోగం వస్తుందన్నది అందరి భావన. అందుకు అనుగుణంగానే తల్లిదండ్రులు కూడా వాళ్ల పిల్లలను మంచి పేరున్న యూనివర్సిటీల్లో చదివించేందుకు సిద్ధపడుతున్నారు. పిల్లల ఆలోచనలతో సంబంధం లేకుండా అయితే ఇంజినీరింగ్ లేదంటే మెడిసిన్ కోర్సుల్లో జాయిన్ చేస్తున్నారు. ఈ రెండూ కుదరకపోతే మేనేజ్ మెంట్ డిగ్రీ. ఇదే ప్రస్తుతం ట్రెండ్.
2016 లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం 12 వ తరగతి పాసైన వాళ్లలో 71 శాతం మంది ఇంజినీరింగ్ చదివేందుకు రెడీ అయ్యారు. మరో 17 శాతం మంది మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నారు. అంటే 88 శాతం విద్యార్ధులు కేవలం ఇంజినీరింగ్ , మెడిసిన్ మాత్రమే చదివేందుకు సిద్ధమవుతున్నారు. ఇది సరైన విధానమేనా? ఎక్కడో లోపం జరుగుతోంది.
ముందస్తుగానే మొదలైపోతున్న సన్నాహాలు
ఈ ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో జాయిన్ అయ్యేందుకు కావాల్సిన తతంగమంతా చాలా ముందుగానే మొదలవుతోంది. విద్యార్ధి 7 వ తరగతిలో ఉన్నప్పటి నుంచే అర్హత పరీక్షల రాసే యంత్రాలుగా తయారు చేస్తున్నారు. దీంతో ఆ విద్యార్ధుల్లో సహజంగా ఉండే సృజనాత్మకత, వాళ్లకు ఉండే అభిరుచులు చిరు ప్రాయంలోనే లెక్కలు, సైన్స్ వంటి సబ్జెక్ట్ ల కింద నలిగిపోతున్నాయి. ఇక ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్ధులయితే వాళ్లు ఏం చేసిన సైన్స్, మ్యాథ్స్ మాత్రమే. సైన్స్, మ్యాథ్స్ టెక్ట్స్ బుక్స్ లో ప్రతీ పదాన్ని గుర్తుంచుకునేలా వాళ్లకు శిక్షణ ఇస్తున్నారు. అలా చేస్తేనే మంచి ఇంజినీరింగ్ కాలేజ్ లో సీటు వస్తుందని వాళ్ల బుర్రలోకి ఎక్కిస్తున్నారు. ఇక ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. దానికి డిఫరెంట్ ట్రైనింగ్ ప్రొగ్రామ్ ఉంటుంది. ఇలాంటి ట్రైనింగ్ విధానాలు విద్యార్ధులను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. ఈ నేర్పుతున్న విషయాలన్ని కేవలం ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలో పాస్ కావడానికే. తప్ప ఇంక దేనికి పనికివస్తాయి?
పైన మనం చెప్పుకున్న విధానాలన్నీ ఎలా ఉన్నాయంటే ఆపరేషన్ విజయవంతమైంది. రోగి చనిపోయాడు అన్నట్లుగానే ఉన్నాయి. ఇలాంటి మూస విధానాలతో ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్ధి నిజ జీవితంలో మాత్రం తడబాటుకు గురవుతున్నాడు. వృత్తి పరంగా ఉన్న స్థితిని కాస్త పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో పాటించాల్సిన నైతిక విలువలు పాటించకుండా ఓటమి చెందుతున్నాడు. ఈ పరిణామం ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతోంది. ఆ ప్రశ్న ఏంటి అంటే విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? అన్నదే ఆ ప్రశ్న. ఇంజినీరింగ్ పరుగు పందెం ఇప్పుడు అందరి ఆలోచన ఒకటే. ఇంజినీరింగ్ చదివితే లైఫ్ సెట్ అయిపోద్ది. ప్రజల్లో ఉన్న ఆ ఆలోచనా విధానానికి తగ్గట్టే ఇంజినీరింగ్ కాలేజీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. 2006-07 లో 1,511 గా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల సంఖ్య ఇప్పుడు 3,300 కు చేరింది. ఈ కాలేజీల నుంచి ప్రతీ ఏడాది దాదాపు 15 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. ఇందులో మూడొంతుల మందికి ఉద్యోగాలు దొరకడం లేదు. ఒక రిపోర్ట్ ప్రకారం ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో దాదాపు 85 శాతం మందికి సరైన నైపుణ్యాలు లేవని తేలింది. ఒకవేళ కొంతమందికి ఉద్యోగాలు వచ్చినా తక్కువ జీతాలతో సరిపెడతారని ఆ రిపోర్ట్ చెప్పింది. ఇక జీతాలు పెరిగే అవకాశాలు కూడా తక్కువే.
ఇక ఇప్పటికే ఉద్యోగాలు సాధించిన వాళ్లు మరో రకమైన ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సరైన సంతృప్తి లేక చాలా మంది ఉద్యోగులు నిరాశలో కూరుకుపోతున్నారు. సుదీర్ఘమైన పనిగంటలు, ఆఫీస్ లో సరైన వాతావరణం లేకపోవడం వాళ్లను ఇబ్బంది పెడుతోంది. సరైన విధంగా భావ వ్యక్తీకరణ చేయలేకపోవడంతో అటు వృత్తి జీవితాన్నిఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేక తంటాలు పడుతున్నారు. ఇందులో చాలా మందికి ఆఫీస్ పనులను ఇంటి పనులను ఎలా విభజించుకోవాలో తెలియక తత్తరపడుతున్నారు.
ఇందులో చాలామంది తాము ఒక చట్రంలో ఇరుక్కుపోయామని, తమ మనసుకు నచ్చిన పని చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు. కొంత మంది జీవితంలో ఎలా వ్యవహరించాలో తెలియక ఏం చేయాలో పాలుపోక కొన్ని సార్లు భారీ మూల్యాలు చెల్లించుకుంటున్నారు. వీరందరూ ప్రధానంగా గుర్తించింది ఏమిటంటే సంక్షోభంలో ఉన్నప్పుడు వాళ్లు నేర్చుకున్న విద్య వాళ్లకు ఎటువంటి సహాయం చేయలేదు. మార్కుల కోసం నేర్చుకున్న టెక్నిక్ లు ఏమీ వాళ్ల జీవితంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొవడంలో ఉపయోగపడలేదు.
మార్పుకు సమయం ఆసన్నమైంది
ఈ అనుభవాలు అన్ని మనకు చెపుతున్న సందేశం ఒకటే. ఉద్యోగం కోసమే చదువు అన్నవిధానం మన జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదిరించే శక్తిని ఈ విద్య అందించడం లేదని అర్ధమవుతోంది. ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తుల జీవితాలను నిశితంగా గమనిస్తే వాళ్లు మంచి ఉద్యోగం చేయడమే కాదు మంచి వ్యక్తిగత జీవితాన్ని కూడా గడుతున్నారు. వాళ్లు మనసుకు నచ్చిన పని చేయడంతో ఆఫీస్ లో మంచి పనితీరును కూడా కనబరుస్తున్నారు. ఇలాంటి విద్యను మనం మన విద్యార్ధులకు అందించాలి. అప్పుడే అభివృద్ధి అన్నది సాధించగలుగుతాం.
కొత్త విద్యా విధానాలు ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఆధునిక శిక్షణా పద్ధతులను ప్రవేశపెట్టి విద్యార్ధులు ఉద్యోగాలు సాధించే చూడాలి. ప్రతీ విద్యార్ధి అతని వ్యక్తిగత అభిరుచులు, ఇష్టం ఆధారంగా డిగ్రీలో విద్యా బోధన చేయాలి. ఇలా చేయడం వలను వాళ్లకు సమస్యకు స్పందించే విధానం, విశాల దృక్పధం అలవర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. విద్యార్ధులు ప్రకృతితో మమేకం అయ్యేలా చేస్తే అది మరింత విలువైనదిగా మారుతుంది. సరైన భావవ్యక్తీకరణ, వ్యక్తులతో ఎలా కలుపుగోలుగా ఉండాలి అన్న విషయాలను నైపుణ్యాలను పెంచాలి. మన దేశ చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాల కోసం విద్యార్ధులకు చెప్పడం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వలన మన విద్యార్ధులు వాళ్ల మూలాలను గుర్తించడంతో పాటు విలువలను అందిపుచ్చుకుంటారు. అదే విధంగా వాళ్లకు ఆత్మ విశ్వాసం, మన దేశం అంటే గర్వం పెరుగుతాయి. భారతీయ విజ్ఞానం, సంస్కృతం, తత్వశాస్త్రం, ప్రత్యామ్నాయ కళాకృతులు వంటి వాటిని మన విద్యా విధానంలో ప్రవేశపెట్టాలి. ఆసక్తి ఉన్న విషయాలతో పాటు ఉద్యోగం సంపాదించే విధంగా కోర్సులను డిజైన్ చేయాలి.
మంచి ఉద్యోగాలు అనేవి కొన్ని సౌకర్యాలు సమకూర్చగలవేమో కానీ ఆనందం, ఆత్మ సంతృప్తితో కూడిన వ్యక్తులను అందించలేవు. మన విద్యా వ్యవస్థలో పూర్వ కాలం నాటి విధానాలను ప్రవేశపెట్టాలి. ఈ పద్ధతి మాత్రమే అసలైన విద్యను పునఃస్థాపించేందుకు, సిసలైన విద్యా విధానాన్ని ప్రతిష్టించేందుకు ఉపయోగపడుంది. దీని ద్వారా కొన్ని బంధనాల్లో చిక్కుబడిపోయిన విద్యా విధానం అందులోంచి బయటపడి తన శక్తిని చాటుతుంది.
ఈ ఫీచర్ పై గైడెన్స్ కావాల్సిన
వారు
ఈ
క్రింది
నెంబర్
వాట్సాప్
గ్రూప్
లో
చేరవచ్చు.
97006 09135
You can send your Educational related articles to careertimes.online1@gmail.com




Comments
Post a Comment