ట్రంప్ కు భార‌తీయులు చాలా రుణ‌ప‌డి ఉన్నారు!

 అమెరికా అధ్య‌క్షుని దెబ్బ‌తో గుర్తుకు వ‌చ్చిన స్వ‌దేశీ గొప్ప‌ద‌నం 



         అడ్డ‌గోలు నిబంధ‌న‌ల‌తో అమెరికాలో మ‌న  ఉద్యోగుల‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ట్రంప్ కు భార‌తీయులు రుణ ప‌డి ఉండ‌ట‌మేంటి? అనుకుంటున్నారా.... ట‌్రంప్ త‌న దేశం కోసం ఏ ఆలోచ‌న‌తో ఆ నిబంధ‌న‌లు పెట్టినా ఇప్పుడు మ‌న దేశంలో మ‌రో సారి అభివృద్ధికి సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఇన్నాళ్లు ఇక్క‌డ చ‌దువుకొని అమెరికా వెళ్లి అక్క‌డ కంపెనీల కోసం ప‌నిచేసిన ఉద్యోగులకు ఇప్పుడు స్వ‌దేశం గుర్తుకు వ‌చ్చింది. వీరిలో చాలా మంది ఇప్పుడు ఇండియాకు వ‌చ్చి స్వంత దేశం కోసం ప‌నిచేసేందుకు స‌మాయుత్త‌మ‌వుతున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణ‌యం మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మేకిన్ ఇండియా నినాదానికి కాస్త ఊత‌మిచ్చే విధంగా ఉంది. గ్లోబ‌లైజేష‌న్ కు బీజం వేసిన అమెరికా ఇప్పుడు ఇలా యూ ట‌ర్న్ తీసుకుని విదేశీ ఉద్యోగుల‌ను బ‌య‌టికి పంపించాల‌నుకోవ‌డం కాస్త ఇబ్బందిగా ఉన్నా రానున్న రోజుల్లో ట్రంప్ నిర్ణ‌యం ఇండియాకు మేలు చేస్తుంద‌ని నిపుణులు చెపుతున్నారు. ఒక‌వేళ అమెరికా ప‌నిచేస్తున్న నిపుణులు అంతా  అక్క‌డి నుంచి ఇండియాకు వ‌చ్చి ప‌నిచేస్తే,  రానున్న ద‌శాబ్దంలోనే ఇండియా సూప‌ర్ ప‌వర్ గా అవ‌త‌రించ‌డం ఖాయం. అప్పుడు ట్రంప్ వార‌సులు కూడా ఇండియాలో ఉద్యోగం చేసే రోజులు వ‌స్తాయి. అయితే దీర్ఘ‌కాలిక విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే స్వ‌ల్ప‌కాలానికి ట్రంప్ నిర్ణ‌యం అమెరికాలో చ‌ద‌వాల‌నుకుంటున్న భార‌తీయ విద్యార్ధులను సందేహంలో ప‌డేసింది. 




 విద్యార్ధుల‌కు ట్రంప్ ట్ర‌బుల్..!

             అమెరికాలో ఉద్యోగాన్ని సాధించ‌డం, డాల‌ర్లు సంపాదించ‌డం ... ఇదే  అధిక శాతం మంది విద్యార్ధుల క‌ల. అమెరికాలో మంచి యూనివ‌ర్సిటీలో ఎంఎస్ చేసి, టాప్ ఎమ్ఎన్ సీ లో జాబ్ కొట్ట‌డ‌మే వారి ల‌క్ష్యంగా ఉంది. డాల‌ర్ల వేట‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఇదే తిరుగులేని ఫార్ములా. అయితే తాజాగా అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వీరి ఆశ‌ల‌కు, క‌ల‌ల‌కు చెక్ పెట్టాడు. వీసా నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యం మ‌న  విద్యార్ధుల‌తో పాటు అమెరికాలో ఇప్ప‌టికే ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు కూడా షాకింగ్ గా మారింది. ట్రంప్ స‌ర్కార్ తాజాగా ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు అమ‌ల్లోకి వ‌స్తే హెచ్ 1 బీ వీసాల‌తో పనిచేస్తున్న వారికి 1.3 ల‌క్ష‌ల డాల‌ర్ల వార్షిక వేత‌నం చెల్లించాల్సి ఉంటుంది.  ఆచ‌ర‌ణ‌లో ఇది సాధ్యం కాదు  క‌నుక ఇండియా నుంచి అక్క‌డికి వెళ్లి ప‌నిచేస్తున్న ఐటీ నిపుణులు, డాక్ట‌ర్లు, టీచ‌ర్లు న‌ష్ట‌పోనున్నారు. అమెరికాలో ప‌నిచేస్తున్న అధిక శాతం మంది వృత్తి నిపుణులు 80 వేల డాల‌ర్లు నుంచి 90 డాల‌ర్లు వ‌ర‌కూ సంపాదిస్తున్న వారే.  ట్రంప్ నిర్ణ‌యం పూర్తి స్థాయిలో అమ‌ల్లోకి వ‌స్తే క‌నుక వారు ఇండియాకు తిరిగి రావాల్సి ఉంటుంది. ఇక‌ అమెరికా యూనివ‌ర్సిటీల్లో చ‌ద‌వాల‌నుకునే విద్యార్ధులు చ‌దువును కొన‌సాగిస్తూ  ఒపీటీపై  త‌క్కువ వేత‌నాల‌కు ప‌నిచేస్తూ త‌ర్వాత హెచ్1బీ కి ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తాజా నిర్ణ‌యంతో ఇప్పుడు వారి ప్ర‌ణాళిక‌లు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణ‌యం చాలామందికి కంట‌గింపుగా ఉండ‌వ‌చ్చేమో కానీ అత‌ని చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్ధించే వారు కూడా ఉన్నారు.



 గ‌డిచిన కొన్నేళ్లుగా అమెరికాలో వృత్తి నిపుణులు క్ర‌మంగా త‌గ్గిపోతున్నారు. విదేశీ కంపెనీలు హెచ్ 1 బీ ల‌తో ఉద్యోగుల‌ను త‌మ స్వదేశం నుంచి తెచ్చుకోవ‌డంతో అక్క‌డ ప‌రిస్థితి కాస్త ఇబ్బందిక‌రంగా మారింది. స్టెమ్ విధానం అంటే సైన్స్ , టెక్నాల‌జీ,  ఇంజినీరింగ్, మెడిసిన్ ల‌లో మాత్ర‌మే వృత్తి నిపుణులు త‌యారు చేసుకోవాల‌న్న ఆలోచ‌న అమెరికాను దెబ్బ‌తీసింది. ఈ విధానంతో అక్క‌డ నిరుద్యోగం పెరిగింది. మ‌రోవైపు త‌క్కువ జీతాల‌కే విదేశీయులు అందుబాటులో ఉండ‌టంతో అక్క‌డి స్థానికుల‌కు ఉద్యోగాలు దొర‌క‌డం లేదు. ఆ ప‌రిస్థితిని గ‌మ‌నించే ట్రంప్ ఈ కొత్త నిబంధ‌న‌ల‌ను త‌యారు చేసాడు. అమెరికాలో ని స్థానిక ప‌రిస్థితుల‌ను కాస్త ప‌క్క‌న పెడితే మ‌రోవైపు ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికాకు ప‌య‌న‌మ‌య్యేందుకు రెడీ అవుతున్న విద్యార్ధులను, వారి త‌ల్లి దండ్రుల‌ను తాజా ప‌రిణామాలు క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. ట్రంప్ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు అమ‌ల్లోకి వ‌స్తే అమెరికా ప‌నిచేస్తున్న భార‌తీయ ఉద్యోగులే స్వదేశానికి రావాల్సి ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలో అక్క‌డికి వెళ్ల‌డం శ్రేయ‌స్క‌ర‌మా కాదా అన్న అనుమానం వారిని ప‌ట్టి పీడిస్తోంది. దీంతో  ఇప్పుడు చాలా మంది విద్యార్ధులు త‌మ అమెరికా ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోవ‌డ‌మో లేక ఆశ‌లు వ‌దిలేసుకోవ‌డ‌మో చేస్తున్నారు. అయితే మ‌న విద్యార్ధులు భ‌య‌ప‌డినంత తీవ్రంగా ప‌రిస్థితులు ఉన్నాయా?  అమెరికాలో చ‌దువుకోవ‌డం ఇక క‌ష్ట‌సాధ్యంగా మార‌నుందా? అయితే ఇందులో కొన్ని నిజాలు, మ‌రికొన్ని అపొహ‌లు ఉన్నాయ‌ని నిపుణులు చెపుతున్నారు. 


ట్రంప్ నిర్ణ‌యం మ‌న‌ విద్యార్ధుల‌కు నిజంగా న‌ష్టం చేస్తుందా? 

  • అమెరికాలో కొన్ని ప్ర‌పంచ స్థాయి యూనివ‌ర్సిటీలు ఉన్నాయి. వాటిల్లో చ‌దువుకునేందుకు ఎటువంటి అడ్డంకులు లేవు. ట్రంప్ నిషేదించిన కొన్ని దేశాలు మిన‌హా మిగ‌తా విద్యార్ధులు గ‌తంలో మాదిరిగానే అక్క‌డ విద్య‌ను కొన‌సాగించ‌వ‌చ్చు 
  • అమెరికాలో చ‌దువుకోవాల‌నుకునే విద్యార్ధుల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ఇప్ప‌టికే కొన్ని యూనివర్సిటీ ప్ర‌క‌ట‌న‌లు జారీ చేశాయి.  విదేశీ విద్యార్ధుల్లో నెల‌కొన్న భ‌యాల‌ను తొలిగించేందుకు ఇప్ప‌టికే అధ్య‌క్షున్ని క‌లిసి త‌మ వాద‌న వినిపించామ‌ని టాప్ యూనివ‌ర్సిటీస్ చెపుతున్నాయి. ఈ మేర‌కు ఇండియాలో ఉన్న క‌న్స‌ల్టెన్సీల‌కు స‌మాచారాన్ని అందిస్తున్నాయి. విద్యార్ధులు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని వారు భ‌రోసా ఇస్తున్నారు. 
  • ప్ర‌స్తుతం హెచ్1 బీ వీసాతో ప‌నిచేస్తున్న వారికే కానీ విద్యార్ధుల‌కు ఎటువంటి న‌ష్టం లేదు. వారు త‌మ స్టూడెంట్స్ వీసాతో త‌మ చ‌దువును కొన‌సాగించ‌వ‌చ్చు. అమెరికాలో స్థానికంగా ఎంఎస్ చేసే అమెరిక‌న్ల సంఖ్య చాలా త‌క్కువ శాతం కాబ‌ట్టి, అక్క‌డ మాస్ట‌ర్స్ చేసే విద్యార్ధుల‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. 
  • అమెరికాలో ఎమ్ఎస్ చేసేది మంచి కంపెనీలో ప‌నిచేసేందుకే కాబ‌ట్టి హెచ్1బీ వీసా నిబంధ‌న‌లు త‌మ‌కు కూడా న‌ష్టం క‌లిగిస్తాయ‌ని విద్యార్ధులు చెపుతున్నారు. హెచ్1బీ వీసాతో ప‌నిచేస్తున్న వారే స్వ‌దేశానికి తిరిగి రావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డితే, ఇక ఓపీటీ తో ప‌నిచేస్తున్న వారి ప‌రిస్థితి ఏంట‌నే వారు కూడా ఉన్నారు. 
  • హెచ్1బీ వీసా నిబంధ‌న‌లు మాత్రం క‌చ్చితంగా అమెరికాలో చ‌ద‌వాల‌నుకునే విద్యార్ధుల‌ను వెన‌క‌డుగు వేసేలా చేస్తున్నాయి. కొంచెం భ‌యాలు మ‌రికొంచెం పుకార్లు వాళ్ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. 
  •  నిజంగా త‌మ అవ‌స‌ర‌మున్న వారిని అమెరికాలోని మ‌న కంపెనీలు ట్రంప్ చెపుతున్న జీతం ఇచ్చి క‌చ్చితంగా కాపాడుకుంటాయి. 
  •  అమెరికాలో ప్ర‌పంచ స్థాయి విశ్వ విద్యాల‌యాలు ఉన్నాయి కాబ‌ట్టి అక్క‌డ చ‌దువుకోవ‌డం విద్యార్ధుల‌కు స‌రైన ఛాయిస్. అయితే అక్క‌డే ప‌నిచేయాల‌న్న నిబంధ‌న ఏమీ లేదు క‌దా. అక్క‌డ చ‌దువుకుని త‌మ మేథ‌స్సును స్వదేశం కోసం ఉప‌యోగిస్తే ఆత్మ సంతృప్తి కూడా దొరుకుతుంది. 



       నిజంగా త‌మ అవ‌స‌ర‌మున్న వారిని అమెరికాలోని మ‌న కంపెనీలు ట్రంప్ చెపుతున్న జీతం ఇచ్చి క‌చ్చితంగా కాపాడుకుంటాయి. అమెరికాలో ప్ర‌పంచ స్థాయి విశ్వ విద్యాల‌యాలు ఉన్నాయి కాబ‌ట్టి అక్క‌డ చ‌దువుకోవ‌డం విద్యార్ధుల‌కు స‌రైన ఛాయిస్. అయితే అక్క‌డే ప‌నిచేయాల‌న్న నిబంధ‌న ఏమీ లేదు క‌దా. అక్క‌డ చ‌దువుకుని త‌మ మేథ‌స్సును స్వదేశం కోసం ఉప‌యోగిస్తే ఆత్మ సంతృప్తి కూడా దొరుకుతుంది.  హెచ్1బీ వీసాల‌పై  పనిచేస్తున్న వారిని టార్గెట్ చేస్తూ ట్రంప్ తీసుకొచ్చిన నిబంధ‌న‌లు ఇప్పుడు ఉద్యోగులను మాత్ర‌మే కాదు అమెరికాలో చ‌ద‌వాల‌నుకుంటున్న విద్యార్ధుల‌ను కూడా ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయ‌న్న‌ది స్ప‌ష్టం. దీంతో అమెరికాలో చ‌ద‌వాల‌నుకుంటున్న విద్యార్ధులు త‌మ ప్ర‌ణాళిక‌ల‌పై పున‌రాలోచ‌న చేసుకుంటున్నారు. అయితే అమెరికాలోని మంచి యూనివ‌ర్సిటీల్లో చ‌దివితే అవ‌కాశాల‌కు ఎప్పుడూ ఢోకా ఉండ‌ద‌న్న‌ది విద్యార్ధులు గుర్తించాలి. 


                     ట్రంప్ నిర్ణ‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రావాలి 

         అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాల‌పై తీసుకొచ్చిన నిబంధ‌న‌లు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. వీటిపై ఇప్పుడే చ‌ర్చిస్తే విద్యార్ధుల్లో భ‌యాలు పెరుగుతాయి. అయితే అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లాల‌నుకుంటున్న‌వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అక్క‌డ ఉద్యోగాలు దొర‌క‌వ‌ని విద్యార్ధులు భ‌య‌ప‌డుతున్నారు. అయితే అలాంటి భ‌యాల‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.  అక్క‌డి యూనివ‌ర్సిటీలు కూడా విదేశీ విద్యార్ధుల్లో ధైర్యం పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. కొన్ని రోజుల్లో అన్ని ఆందోళ‌న‌లు స‌మిసిపోతాయి.  

                                              

                

అమెరికాలోని తెలుగు విద్యార్ధుల‌కు ఏసీఐసీఎస్ గండం!

            ఇప్పుడు ట్రంప్ అడ్డ‌గోలు నిబంధ‌న‌ల‌తోనే విద్యార్ధులు స‌గం బాధ‌ప‌డుతుంటే ఇప్పుడు ఏసీఐసీఎస్ రూపంలో వారికి మ‌రో షాక్ త‌గ‌ల‌నుంది. అమెరికాలో తెలుగు విద్యార్ధులు అధికంగా ప్ర‌వేశాలు పొందే విద్యా సంస్థ‌ల‌కు అనుబంధ‌ గుర్తిపునిచ్చే ఏసీఐసీఎస్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు కొన్ని నెల‌ల క్రితం ఒబామా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం కోర్టు ప‌రిధిలో ఉన్న ఏసీఐసీఎస్ గుర్తింపు ర‌ద్దు విష‌యం ఈ నెలాఖ‌రులో తీర్పుకు రానుంది. అమెరికాలోని విద్యా సంస్థ‌లు ప్ర‌ధానంగా రీజ‌న‌ల్  అక్రిడేష‌న్, ఏసీఐసీఎస్ ల నుంచి అనుబంధ గుర్తింపును పొందుతాయి. మ‌న తెలుగు విద్యార్ధులు ప్రారంభంలో రీజ‌న‌ల్ అక్రిడేష‌న్ ఉన్న క‌ళాశాల‌ల్లో చేరుతున్న‌ప్ప‌టికీ త‌ర్వాత చాలా మంది ఏసీఐసీఎస్ క‌ళాశాల‌కు మారిపోతున్నారు. త‌క్కువ ఫీజులు, ఎక్క‌వ మార్కులు వ‌స్తాయ‌న్న ఉద్దేశ్యంలో ఇలా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏసీఐసీఎస్ గుర్తింపు క‌నుక పూర్తిగా ర‌ద్దు అయితే దాని అనుబంధ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధుల భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్ధ‌కంగా మారుతుంది.అప్ర‌మ‌త్త‌త‌తో ఉన్న కొంద‌రు విద్యార్ధులు ఇప్ప‌టికే రీజ‌న‌ల్ అక్రిడేష‌న్ గుర్తింపు ఉన్న క‌ళాశాల‌కు త‌ర‌లిపోతున్నారు.  

ఈ ఫీచ‌ర్ పై  గైడెన్స్ కావాల్సిన వారు క్రింది నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో చేరచ్చు.
97006 09135

You can send your Educational related articles to  careertimes.online1@gmail.com



Comments

Popular posts from this blog

అదృష్టాన్ని జేబులో పెట్టుకు తిరగడం ఎలా?

24.."టైం మిష‌న్"..!

ఈ 'కెరీర్' తో కంపెనీకి, మీడియాకు మధ్య వారధి మీరే కావచ్చు!!